దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.
ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.
ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..
ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment