మాది చేతల ప్రభుత్వం | Chief Minister Revanth Reddy Chit Chat with Media in Khammam | Sakshi
Sakshi News home page

మాది చేతల ప్రభుత్వం

Published Wed, Sep 4 2024 3:55 AM | Last Updated on Wed, Sep 4 2024 3:55 AM

Chief Minister Revanth Reddy Chit Chat with Media in Khammam

గత ప్రభుత్వంలా కాదు 

నేను రాసిన లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు 

మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్‌లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.  

మేం ఇళ్లలో కూర్చోలేదు..  
‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. 

ఆక్రమణలతోనే అనర్థాలు 
‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది.  

అది కమీషన్‌ కాకతీయ 
మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్‌ కాకతీయ అనేది కమీషన్‌ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు దీన్ని కమీషన్‌ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. 

రిటైనింగ్‌ వాల్‌పై ఇంజనీర్లతో చర్చిస్తాం 
‘మున్నేరుపై రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్‌ తెలిపారు. 

వెంటనే స్పందించాం.. 
‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. 

పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది 
కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్‌ అన్నారు. 

సైంటిస్ట్‌ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా 
కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్‌ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

రూ.10 వేలు దేనికి సరిపోతాయి? 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.

మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement