వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్
ఇళ్లు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలి
భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం
ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని..రూ.25లక్షలు పరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలన్నారు.
భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27న ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతా డు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే ‘చీఫ్ మినిస్టర్’ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశి్నస్తాడు’అని కేటీఆర్ మండిపడ్డారు.
ఎస్‌ఎన్‌డీపీతోనే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పింది
విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఎస్‌ఎన్‌డీపీ’నిరూపించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా..లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడటంలో ఎస్‌ఎన్‌డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కీలకపాత్ర పోషించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ ట్వీట్‌పై కేటీఆర్ ఆగ్రహం
భారీవర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధపడుతున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. తెలంగాణలో సహాయక కార్యక్రమాలను ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వాకం తెలిసేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment