దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగించాయి. అయితే ఈ వరదలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం కలిగించాయి అనే దానిపై ఎస్‌బీఐ (SBI) రీసర్చ్ రిపోర్ట్ ఎకోర్యాప్ (Ecowrap) ఓ నివేదిక విడుదల చేసింది.
వరదల వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ. 10,000 కోట్లు నుంచి రూ.15,000 కోట్ల పరిధిలో ఉంటుందని ఎస్‌బీఐ ఎకోర్యాప్ నివేదిక అంచనా వేసింది. ఈ భారీ వరదలతోపాటు ఇటీవల సంభవించిన బిపార్జోయ్ తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. దేశ స్థానిక, భౌగోళిక స్వరూపాలు కూడా సహజ విపత్తులకు కారణమని అభిప్రాయపడింది.
మూడో స్థానంలో భారత్
1990 నుంచి తీసుకుంటే అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అత్యధిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటం, తుఫానులు, భూకంపాలు, వరదలు, కరువులు వంటి విపత్తులతో సహా భారతదేశం 1900 సంవత్సరం నుంచి 764 ప్రకృతి వైపరీత్యాలను నమోదు చేసింది. 1900 నుంచి 2000 వరకు 402 సంఘటనలు, 2001-2022 మధ్య 361 విపత్తులు సంభవించాయి.
ఇలాంటి విపత్తులు తరచూ సంభవించడం వల్ల ఆర్థిక ఒత్తిడికి సంబంధించి కొత్త రికార్డులను నెలకొల్పిందని నివేదిక పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు భారతదేశంలో ఎక్కువగా వరదల రూపంలోనే సంభవించాయని, ఇవి దాదాపు 41 శాతం, ఆ తర్వాత తుఫానులు సంభవించాయని నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన బీమా విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందని ఎస్‌బీఐ నివేదిక గుర్తు చేసింది. 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 275 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా 125 బిలియన్ డాలర్లు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చాయంది. అంటే అంతరం 150 బిలియన్ డాలర్లు. ఇది 10 సంవత్సరాల సగటు 130 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. మొత్తం నష్టాలలో 54 శాతం బీమా చేయనివేనని వెల్లడించింది.
భారతదేశంలో ఈ బీమా రక్షణ అంతరం 92 శాతంగా ఉందని, దేశంలో సగటున 8 శాతం మందికి మాత్రమే బీమా రక్షణ ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌లను కవర్ చేయడానికి బీమా రంగంలో 'డిజాస్టర్ పూల్' అవసరాన్ని నొక్కి చెప్పింది. దేశంలో 2020 వరదలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఆర్థిక నష్టం 7.5 బిలియన్ డాలర్లు (రూ. 52,500 కోట్లు) అయితే బీమా కవర్ కేవలం 11 శాతం మాత్రమే అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment