‘తెలంగాణ’పైకేంద్ర హోంశాఖ అసంతృప్తి
రాష్ట్రంలో వరద నష్టం వివరాల నివేదికను తక్షణమే పంపించండి
రోజువారీ పరిస్థితిపై నివేదిక పంపాలంటూ సీఎస్‌కు లేఖ
ఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్ర వాటా విడుదలకు యుటిలైజేషన్‌సర్టిఫికెట్లు పంపించండి
ఇప్పటికే రాష్ట్రంలో ఏడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 2 హెలికాప్టర్లను మోహరించాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భారీవర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రోజువారీ పరిస్థితిపై నివేదిక పంపేలా రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్‌ఈఓసీ)లోని అధికారులను ఆదేశించాలని సీఎస్ శాంతికుమారికి కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు తాజాగా సీఎస్‌కు కేంద్ర హోంశాఖలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్‌గవాయ్ లేఖ రాశారు.
ఎస్‌ఈఓసీ నుంచి అందిన సమాచారం ప్రకారం..
తెలంగాణ ఎస్‌ఈఓసీ నుంచి టెలిఫోన్ ద్వారా ఇటీవల కేంద్ర హోంశాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ప్రొటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా వరదలకు సంబంధించి తాజా నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పడవలు, రక్షించే పరికరాలతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 7 బృందాలను మోహరించిందన్నారు. వీటితోపాటు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది.
నిధులివ్వాలంటే నివేదిక పంపాలి...
» 2024–25 సంవత్సరానికిగాను రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ నిర్వహణ కోసం రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి రూ.1345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్ర వాటాను విడుదల చేసేందుకు అవసరమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
» 2022–23 సంవత్సరానికిగాను ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 2వ విడత కేంద్ర వాటా కింద రూ.188.80 కోట్లు.. 2023 జూలై 10న తెలంగాణకు విడుదలయ్యాయని కేంద్రం తెలిపింది. 2023–24కు సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్ర వాటా రెండు వాయిదాలను ఒక్కొక్కటి రూ.198 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 13న, మార్చి 28న విడుదల చేశామని చెప్పింది.
» 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత మొత్తం రూ.208.40 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 1 తర్వాత ఈ రూ.208.40 కోట్లు విడు దల కావాల్సి ఉన్నా, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యర్థన చేయలేదని లేదా ముందుగా విడుదల చేసిన నిధులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ మొదలైన వాటి జమకు సంబంధించిన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
అందువల్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల విడుదల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన సమాచారం/యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాతే 2024–25కు సంబంధించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment