వరద నష్టంపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
ఇంకా నష్టం లెక్కలు తీస్తున్నాం..
బాధితులందరికీ సాయం అందేలా నిబంధనలు సులభతరం చేయండి..
వరదలపై వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని వెల్లడి
ఎన్డీఆర్‌ఎఫ్ తరహా ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి
సచివాలయంలో సీఎస్‌తో భేటీ అయిన కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని బృందం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టం విలువ రూ.5,438 కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా నష్టం లెక్కలు తీస్తున్నామని వివరించింది. ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు వేగంగా సాగేందుకు, బాధితులందరికీ సాయం అందేందుకు వీలుగా మార్గదర్శకాలను సులభతరం చేయాలని కోరింది.
రాష్ట్రంలో వరదల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. తొలుత వరద నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అనంతరం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.
వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు అందిన తర్వాత, తక్కువ సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని... వేగంగా తీసుకున్న చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని సీఎస్ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు నిరంతరం పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. పునరావాస కార్యక్రమాల కోసం నిధులను వెంటనే విడుదల చేశామన్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సహకరించండి
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో సమానంగా రాష్ట్రంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. ఈ బృందాలకు శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనలో కేంద్రం సహకరించాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయిన అంశాన్ని కేంద్ర బృందానికి వివరించారు. దీంతో చెట్లు కూలిన ఘటనకు మూలకారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్‌కు కేంద్ర బృందం సూచించింది.
ఇక వరదల కారణంగా సంభవించిన నష్టాలు, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్ వివరించారు. సమావేశం అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లింది.
వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్‌సింగ్ ప్రాథమిక నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అందించారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత జిల్లాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించిన విషయం తెలిసిందే.
బుధవారం ఆయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అమిత్ షాతో భేటీ అయి.. తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం ఈ వివరాలను ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment