ఆర్థికాభివృద్ధిలో క్రీడలు తోడవ్వాలి
ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ నివేదిక విడుదల
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్‌ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.
ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్‌లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్‌మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.
క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్‌పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.
అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి.
దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.
ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
స్పోర్ట్స్ లీగ్‌లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.
స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.
స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.
2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment