
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్‌మార్క్‌లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్‌లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!
‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్‌గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.