Indian economic growth
-
విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్‌మార్క్‌లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్‌గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్‌తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్‌కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
పెరిగిన కరెంట్ అకౌంట్ లోటు.. కారణాలు..
దేశానికి వచ్చి-పోయే విదేశీమారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 9.7 బిలియన్ డాలర్ల(రూ.81 వేలకోట్లు) కరెంట్ అకౌంట్ లోటు నమోదైంది. అదే త్రైమాసికానికి చెందిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ 1.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2023 ఏప్రిల్–జూన్) దీని విలువ 8.9 బిలియన్ డాలర్లు(రూ.74 వేలకోట్లు)గా నమోదైంది. అయితే 2024 జనవరి–మార్చి మధ్య కరెంట్ అకౌంట్ 4.6 బిలియన్ డాలర్ల(రూ.38 వేలకోట్లు) మిగులును నమోదుచేసుకుంది. ఈమేరకు ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.సీఏడీ పెరుగుదలకు కారణాలు..క్యూ1లో కరెంట్ అకౌంట్ లోటు పెరగడానికి వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం) కారణమని ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023 క్యూ1లో వస్తు వాణిజ్యలోటు 56.7 బిలియన్ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు)కాగా, 2024 ఇదే కాలంలో ఈ విలువ 65.1 బిలియన్ డాలర్ల(రూ.5.4 లక్షల కోట్లు)కు ఎగసింది.ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్‌పీఐ) 2024–25 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కేవలం 0.9 బిలియన్ డాలర్లు(రూ.7.5 వేలకోట్లు)గా నమోదయ్యాయి.ఏప్రిల్– జూన్ మధ్య విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) 5.6 బిలియన్ డాలర్ల(రూ.47 వేలకోట్లు) నుంచి 1.8 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు)కు పడిపోయాయి.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..రెమిటెన్సులు (ఎన్ఆర్ఐలు దేశానికి పంపిన మొత్తం) మాత్రం 27.1 బిలియన్ డాలర్ల(రూ.2.2 లక్షల కోట్లు) నుంచి 29.5 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)కు పెరిగాయి. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం 4.7 బిలియన్ డాలర్ల(రూ.39 వేలకోట్లు) నుంచి 6.3 బిలియన్ డాలర్ల(రూ.52 వేలకోట్లు)కు ఎగిసాయి.ఎన్ఆర్ఐ డిపాజిట్లు 2.2 బిలియన్ డాలర్ల(రూ.18 వేలకోట్లు) నుంచి 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు చేరాయి. -
2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు
భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపవుతుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2026–27 సమయానికి మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్దకాలంగా గణనీయ పురోగతి సాధించిందని, 2047 నాటికి తలసరి ఆదాయం 18,000–20,000 డాలర్ల స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా తీసుకోతగిన చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పురోగమించాలంటే సరఫరా వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యం చెప్పారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
6.6% నుంచి 7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. ఎకానమీ పురోగతి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం ఉంటుందన్న తొలి (జూన్ నివేదికలో) అంచనాలను తాజాగా 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ‘ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్’ నివేదికలో పేర్కొంది. రుతుపవనాల మెరుగుదల, ప్రైవేట్ వినియోగం–ఎగుమతులు పెరిగే అవకాశాలు.. అంచనాల తాజా పెంపుదలకు తోడ్పడినట్లు ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లీ చెప్పారు. అవుట్‌లుక్ పాజిటివ్...: అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక అవుట్‌లుక్ ‘పాజిటివ్’ గా ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. 2024–25లో 7 శాతం వృద్ధి రేటు నమోదయితే, తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాలు (2025–26, 2026–27) ఎకానమీ పటిష్టంగా ఉంటుందని ఉద్ఘాటించింది. -
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి వేగవంతానికి వీలుగా మోదీ సర్కారు కారి్మక, భూ, సాగు సంస్కరణలు చేపట్టాలని పరిశ్రమల సంఘం సీఐఐ కేంద్రానికి సూచించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే అంచనాలు విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 8 శాతం మేర నమోదవుతుందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్‌పురి అంచనా వేశారు. సీఐఐ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన ఎన్నో విధానపనరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్టు చెప్పారు. ‘‘అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఆధారపడి ఉన్నాయి. మన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తృతం చేయడం, పెట్టుబడులు, వినియోగం, సాధారణ వర్షపాతంపై అంచనాలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి’’అని పురి వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పుంజుకున్నట్టు చెప్పారు. జీఎస్టీలో మూడు రకాల రేట్లే ఉండాలని, పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. -
ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ
లోక్‌సభ 18వ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మీడియాలో సమీక్ష జరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వృద్ధి రేటుతో 2024 ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిందని ఆర్థికవేత్తల అంచనా. ఇదే నిజమైతే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ప్రగతి అత్యంత వేగవంతంగా సాగినట్లేనని కూడా వారు భావిస్తున్నారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో నిరుద్యోగం కాస్త ఎక్కువగా ఉందనే ప్రచారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బాగానే వినిపించింది. ఆధునిక భారతంలో పట్టణ, నగర ప్రాంతాల్లోనే అన్ని విధాలా అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, మారుమూల ప్రాంతాల్లో వృద్ధి అంతగా లేదని కొందరు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు స్థానాలు ఎగబాకి పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానానికి చేరుకుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే దేశాన్ని మూడో స్థానానికి తీసుకెళతామని కూడా పాలకపక్షం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించింది. అగ్రశ్రేణి ఇకానమీగా అవతరించినప్పటికీ తలసరి ఆదాయం విషయంలో జీ–20 దేశాల్లో ఇండియా అట్టడుగున ఉందనే విషయాన్ని పాలకులు మరువకూడదని ఆర్థిక నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు.ప్రపంచ దేశాల ఆర్థిక బలాబలాలను మదింపు చేసి, వాటి పరపతికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నెలలో భారత సావరిన్ రేటింగ్ పరిస్థితిని ‘సుస్థిర’ (స్టేబుల్) నుంచి ‘సానుకూల’ (పాజిటివ్)గా అంచనావేసింది. బీబీబీ–రేటింగ్‌ను మాత్రం మార్చకుండా మెరుగైన భవిష్యత్తు ఉన్న దేశంగా ఇండియాను పరిగణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తూ ముందుకు సాగడం వల్ల దాని పరపతిపై నిర్మాణాత్మక ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పీ పేర్కొంది.రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..మార్చితో పోలిస్తే దేశంలో ఏప్రిల్ నెల వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. కీలకమైన ఈ సూచిక రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4%కు తగ్గకుండా కిందటి నెలలో 4.83% వద్ద నిలిచింది. వినియోగదారుల జీవన ప్రమాణాలను అధికంగా ప్రభావితం చేసే కీలకమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్ఫ్లేషన్) మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో కొద్దిగా పెరిగింది (8.52% నుంచి 8.70%కు). 2023 నవంబర్ నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%కి పైనే ఉంటోంది. సామాన్య, పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అందుకే, సాధారణ ఎన్నికలను, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కిందటేడాది నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గోధుమలు, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు21వ శతాబ్దం మొదటి పాతికేళ్ల చివరిలోకి వచ్చిన ప్రస్తుత సమయంలో నిరుద్యోగం కూడా ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. దేశంలో మార్చిలో 7.4%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.1%కు పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేట్ సంస్థ అంచనావేసింది. పట్టణ ప్రాంతాల్లో 19–29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 2023 చివరి మూడు నెలలతో పోల్చితే స్వల్పంగా (16.5% నుంచి 17%కి) పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయరంగంలో ఇండియా పలుకుబడి చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందనే నిపుణులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ బడా కంపెనీలను ఒక్క చైనా వైపే చూడకుండా ఇండియా రావాలని కోరుతూ ప్రోత్సాహకాలను అందిస్తానంటోంది. మొత్తంమీద భారత విదేశాంగ విధానం ఈ పదేళ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి పక్షంలో కేంద్రంలో అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందా? ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
భారత ఎకానమీపై స్పానిష్ పేపర్ కార్టూన్ దుమారం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్‌కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపింది. భారత ఆర్థిక వృద్ధిపై కథనాన్ని ప్రకటించిన ‘లా వంగార్డియా’ పత్రిక‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్‌ను పబ్లిష్ చేసింది. అక్టోబర్ 9న వీక్లీ పత్రిక మొదటి పేజీలో ఈ కార్టూన్ ప్రచురితమైంది. ఇది దేశంపై జాతివిద్వేషాన్ని వెళ్లగక్కడం తప్ప మరోకటి కాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ‘ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని వర్ణించడంపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ పీసీ మోహన్ సీరియస్‌గా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. అంతేకాదు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గ్లోబల్‌గా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. విదేశీ మనస్థత్వాలనుమార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని పేర్కొన్నారు. మరోవైపు రచయిత రజత్ సేథి కూడా దీనిపై స్పందించారు. భారత ఆర్థికవృద్ధిని ప్రపంచం గమనిస్తోంది. అయినా జాత్యహంకార వ్యంగ్య చిత్రాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా గమనిస్తోంది. కానీ భారత్‌ను ఇంకా సాంప్రదాయ కార్టూన్లతో చూపించడం చాలా అవమానకరం. కార్టూన్‌తో దేశాన్ని అవమానించడం చాలా దారుణమని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా సీఈవో నితిన్ కామన్ వ్యాఖ్యానించారు. పాములు పట్టే దేశంగా అభివర్ణించడం సరైంది కాదని ఆయన ట్వీట్ చేశారు. ఎకానమీతో పాటు, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకుపోతున్నా భారత్‌ను పాములు పట్టే దేశం అంటూ అవమానకర కార్టూన్‌ను ప్రచురించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. "The hour of the Indian economy," says La Vanguardia, a leading Spanish daily. Quite cool that the world is taking notice, but the cultural caricaturing, a snake charmer to represent India, is an insult. Wonder what it takes for this to stop; maybe global Indian products? pic.twitter.com/YY3ribZIaq — Nithin Kamath (@Nithin0dha) October 13, 2022 -
Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్‌దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. బ్రిటన్ వెనుకబాటుకూ, భారత్ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్ 814 బిలియన్ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్ డాలర్ల లెక్కన భారత్ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్ను భారత్ దాటేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. బ్రిటన్‌లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్‌వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్ను వెనక్కి నెట్టి, భారత్ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్ రివెంజ్’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్‌తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్’ (యూహెచ్‌సీ) లెక్కన చూసినా భారత్ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 2016 నాటికే బ్రిటన్ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్‌లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్‌ను మధ్య ఆదాయ దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి. -
ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: 5 కీలక అంశాలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ను వెనక్క నెట్టి ఇండియాఐదోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆరో స్థానానికి చేరింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉంది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి "అభివృద్ధి చెందిన" దేశంగా అవతరించాలని ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేను, అదీ రెండు శతాబ్దాల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒకదానిని దాటడం ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలతో భారత్‌సహా వివిధ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమైనాయి. ఎక్కడిక్కడ వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు స్థంభించి పోవడంతో వృద్ధిరేటు పతమైంది. అయితే ఈసంక్షోభంనుంచి శరవేగంగా పుంజుకున్న ఇండియనన్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఇండియా ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై చాలా నివేదికలు వచ్చాయి బ్లూమ్‌బెర్గ్ ఏఎంఎఫ్ డేటాబేస్ , చారిత్రాత్మక మారకపు ధరలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.కానీ భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరడం విశేషం. రానున్న సంవత్సరాలలో భారతదేశం, బ్రిటన్ మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 5 కీలక అంశాలు, పోలికలు ఇరు దేశాలమధ్య జనాబా, తలసరి జీడీపీ, పేదరికం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ అంశాలను పోల్చింది. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా. 2022 నాటికి, భారతదేశంలో 1.41 బిలియన్ల జనాభా ఉండగా, యూకేజనాభా 68.5 మిలియన్లు. మరో మాటలో చెప్పాలంటే, భారత జనాభా 20 రెట్లు ఎక్కువ. రెండు దేశాల జనాభా వ్యత్యాసం నేపథ్యంలో తలసరి జీడీపీతో పోలిస్తే సగటు భారతీయుని ఆదాయం చాలా తక్కువ. దీన్ని దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దం ప్రారంభంలో, భారత్‌తో పోలిస్తే అత్యంత పేదరికంలో ఉన్న బ్రిటన్ ఇపుడు మెరుగ్గానే ఉంది. అయితే పేదరికాన్ని అరికట్టడంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించినప్పటికీ బ్రిటన్ కంటే మెరుగ్గాలేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడీపీ డేటా వేగవంతమైన ఆర్థిక వృధ్దిని సూచిస్తుంది. ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాల సమ్మేళనమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో మాత్రం, 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశం ఇంకా ఒక దశాబ్దం పట్టవచ్చు. యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ ఒక దేశంగా ధనవంతులుగా మారడానికి కీలకమైన అంశం పౌరులకు అందుబాటులో ఉండే జీవన నాణ్యత. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్ పునరుత్పత్తి, తల్లి, నవజాత, శిశు ఆరోగ్యం, అంటు వ్యాధులు, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, సర్వీసెస్ సహా అవసరమైన సేవల సగటు కవరేజ్ విషయంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించినా 2005 నుండి ఆరోగ్య సంరక్షణ పథకాలపై ప్రభుత్వ విధాన దృష్టి భారతదేశానికి ప్రత్యేకమైన మెరుగుదలను అందించినప్పటికీ, బ్రిటన్‌తో పోలిస్తే ఇంకా చాలా గ్యాప్ ఉంది. -
అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ప్రసిద్ధ ఆర్థికవేత్త
న్యూఢిల్లీ: భవిష్యత్ భారతానికి మెజారిటీవాదం తీవ్ర హానికరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విశ్లేషించారు. భారత్ పురోగతిని ప్రతి దశలోనూ ఈ మెజారిటీవాదం నిరోధిస్తుందని ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ అన్నారు. స్పష్టమైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారని పేరున్న రాజన్ ఒక వెబినార్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. - శాసనపరమైన కొన్ని చర్యల ద్వారా కొన్ని విమర్శలకు ప్రభుత్వం మరింత ప్రతిస్పందించాలి. - మెజారిటీవాదం వైపు ధోరణి అపారమైన ప్రతికూల పరిణామాలను కలిగి ఉంది. ఇది ప్రతి ఆర్థిక సూత్రానికి విరుద్ధం. - భారతదేశానికి అందరి భాగస్వామ్యం కలిగిన సమ్మిళిత వృద్ధి అవసరం. ఏదైనా ఒక వర్గాన్ని రెండవ తరగతి పౌరులుగా చూస్తూ, సమ్మిళిత వృద్ధిని సాధించలేము. - మెజారిటీవాదం ప్రజలను విభజిస్తుంది. భారతదేశం కలిసి ఉండాల్సిన సమయంలో విభజన ఎంతమాత్రం మంచిదికాదు. ఇదే జరిగితే అంతర్జాతీయంగా దేశానికి బెదిరింపులు మరింత పెరుగుతాయి. - భారతదేశ ఎగుమతి విభాగం పనితీరు బాగానే ఉంది కానీ... అద్భుతం కాదు. - భారత్‌లో మహిళా కార్మిక భాగస్వామ్యం భారీగా పెరగాలి. - ప్రతి పరిణామాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుని, తగిన నిర్ణయాలతో ముందుకువెళ్లే ప్రభుత్వం అవసరం. గణాంకాల గురించి ఇలా... భారతదేశం నేడు బలమైన వృద్ధి గణాంకాలను కలిగి ఉంది. అయితే వృద్ధి గణాంకాల పట్ల దేశం జాగ్రత్తగా ఉండాలి. క్షీణత తర్వాత లో బేస్‌తో నమోదయ్యే వృద్ధి గణాంకాల గురించి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరాదు. వాస్తవిక వృద్ధి ధోరణి ఎల్లప్పుడూ అవసరం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎకానమీ వాస్తవంగా అంత అద్భుతంగా లేదు. బలమైన వృద్ధి గణాంకాలు ఉన్నప్పటికీ, అది మంచి ఉద్యోగావకాశాలను సృష్టించలేదు. ప్రస్తుతం పలు విభాగాల్లో మహమ్మారి కరోనా కన్నా వెనకడుగులోనే ఉన్నాము. గణాంకాలు వాస్తవింగా ఉండాలి. వాస్తవాలను దాచిపెట్టే విధంగా ఉండకూడదు. చదవండి: ఆర్థిక శాఖ వింత సూత్రీకరణ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ధనవంతులే నష్టపోతున్నారట! -
మారిన మూడీస్ ‘అవుట్‌లుక్’,భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే?
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సెప్టెంబర్ చివరి వారంలో మూడీస్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఎకానమీ మూలస్తంభాలు పటిష్టంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు వివరించారు. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణ్యం, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో మూడీస్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసినా, రేటింగ్‌ను మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడీస్ చెప్పిన ముఖ్యాంశాలు... ♦భారత్ ఫారిన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయెర్ రేటింగ్స్, లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌ను కూడా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు మూడీస్ తాజాగా విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ♦ మూలధనం, ద్రవ్యలభ్యత, బ్యాంకులు, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ సంస్థల పరిస్థితులు గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగుపడినట్లు మూడీస్ వివరించింది. ♦ అయితే రుణ భారాలపై అప్రమత్తత అవసరమని సూచించింది. మూడీస్ తాజా ప్రకటన ప్రకారం 2019లో జీడీపీలో భారత్ రుణ భారం 74 శాతం. 2020 జీడీపీలో ఇది 89 శాతానికి చేరింది. సమీపకాలంలో దాదాపు 91 శాతంగా ఉండే అవకాశం ఉంది. రుణ భారాల నిష్పత్తుల తగ్గాలంటే, దేశానికి భారీ వృద్ధి రేటు అవసరం. ♦ ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరింత తగ్గుతుందన్న అంచనాలను మూడీస్ వెలువరించింది. ♦ ద్రవ్యలోటు తగ్గితే దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనతలు మరింత తగ్గుతాయని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి (రూ.15,06,812 కోట్లు) కట్టడి చేయాలన్నది 2021–22 బడ్జెట్ లక్ష్యం. 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా కష్టాల్లో ఈ లోటు ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పరిస్థితులు బాగున్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు కరోనా ముందస్తుకాలంకన్నా మెరుగుపడే అవకాశం ఉంది. 2020–21లో జీడీపీ 7.3 శాతం పతనం అయితే, 2021–22లో 9.3 శాతంగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతంగా నమోదుకావచ్చు. ♦ వ్యాక్సినేషన్ పెరగడంతో మూడవవేవ్ ముప్పు ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉండకపోవచ్చు. ♦ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన, సంస్కరణాత్మక చర్యలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశం చక్కటి వృద్ధి బాటన దూసుకుపోయే అవకాశం ఉంది. రేటింగ్‌ల తీరు... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. ప్రాముఖ్యత ఎందుకు? అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. -
ఇది వాళ్లకు తెలిసేలా షేర్ చేయండి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఉదయం ఆసక్తికరమైన ఒక ట్వీట్‌ను షేర్ చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో సహకారిగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు బుధవారం ఆర్బీఐ ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఈ విషయమై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, సీఎం కేసీఆర్ సారధ్యంలో సత్తా చాటుతూ తెలంగాణ దూసుకుపోతోందని సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణకు అది ఇచ్చాం.. ఇది ఇచ్చాం అని హిందీలో అర్థం పర్థం లేని స్టేట్మెంట్లు ఇచ్చే అజ్ఞానులకు ఇది చూపించండి. తెలంగాణ ప్రజల్లారా వాళ్లకు తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి. అంటూ మరో ట్వీట్లో ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు విసిరారు. Request all Telanganaites to share this with any ignoramus who says otherwise Tired of the nonsensical statements; “Humne Telangana Ko Yeh Diya, woh Diya”! Agar Diya kisine tho Telangana Ji Janta ney is Desh ko Diya And we are proud to be contributing to the Nation 🇮🇳 — KTR (@KTRTRS) September 16, 2021 ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి జాబితాలో నాలగవ స్థానంలో నిలిచింది తెలంగాణ. ఈ మేరకు ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్‌స్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020-21’ పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రిలీజ్ చేసింది. జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో విస్తీర్ణంపరంగా 11లో, జనాభాలో 12వ ప్లేస్‌లో ఉన్న తెలంగాణ.. దేశ ఆర్థిక భాగస్వామ్యంలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. తలసరి ఆదాయం రెట్టింపు.. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు అయింది. ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పతి గణనీయంగా పెరగడంతో తలసరి ఆదాయం కూడా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632కు పెరిగిందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన వార్షిక హ్యాండ్ బుక్‌లో వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం దేశంలోనే తెలంగాణ టాప్-5లో నిలిచింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండగా.. ఆరేళ్లలో రూ.2,37,632కు చేరింది. చదవండి: కేటీఆర్ ఇచ్చిన శారీ బాగుంది: ఫైర్‌బ్రాండ్ -
భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా? లేదా పెరుగుతున్నా యా? అన్న అంశంపై భవిష్యత్ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఎస్అండ్పీ విడుదల చేసిన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైల్ ద్రవ్యోల్బణం సవాలుగా ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించిన తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి. ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుంది: ఫిచ్ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ ఒక నివేదికలో పేర్కొంది. ‘‘ఆహారం, ఆల్కహాల్యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి 2020లో కుటుంబాలు తమ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు’’ అని ఫిచ్ వివరించింది. -
బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా సగం పైగా తగ్గించేయడం గమనార్హం. లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని వివరించింది. చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని పేర్కొంది. ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను 2 శాతానికి కుదిస్తున్నాం‘ అని ఫిచ్ తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి. చిన్న సంస్థలు, బ్యాంకులకు దెబ్బ... వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. సాధారణంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలేమైనా తగ్గిన పక్షంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తవచ్చని తెలిపింది. ‘ఈ పరిస్థితుల్లో భారత్‌లోని ఎన్బీఎఫ్సీలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుంది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్బీఎఫ్సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముంది‘ అని ఫిచ్ తెలిపింది. వచ్చే ఏడాది రికవరీ: ఏడీబీ అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇది భారత్‌లోనే శరవేగంగా విస్తరిస్తే, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పవని ఏడీబీ తెలిపింది. అయితే, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) నివేదికలో ఏడీబీ తెలిపింది. ‘ప్రస్తుతం అసాధారణ గడ్డుకాలంగా నడుస్తోంది. కరోనా ప్రజల జీవితాలతో పాటు వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది‘ అని ఏడీబీ ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా తెలిపారు. ‘ప్రపంచ వృద్ధికి, భారత రికవరీకి కరోనా పెను సవాలుగా మారింది. కానీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో గట్టిగా కోలుకోవచ్చు. సంస్కరణల ఊతంతో అప్పుడు 6.2% ఉండొచ్చు‘ అని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. మహమ్మారి బారిన పడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత్ వేగంగా స్పందించిందన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లపరంగా కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు రికవరీకి తోడ్పడగలవని చెప్పారు. ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3–4.8%కి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కమోడిటీల ధరల పతనం కూడా కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతోందని వివరించింది. 2020లో వృద్ధి 4.1 శాతానికి తగ్గి, 2021లో 6 శాతానికి రికవర్ కాగలదని తెలిపింది. -
మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వినియోగం పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో రూ. 1 లక్ష కోట్ల మైలురాయిని దాటాయి. డిసెంబర్లో రూ. 1,03,184 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్ నెలలో ఈ వసూళ్లు రూ. 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో రూ. 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్లో రూ. 94,726 కోట్లు వసూలయ్యాయి. నిబంధనలను పాటించే విధానం, వినియోగం మెరుగుపడుతున్నాయనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో దేశీయంగా లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 16 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిసెంబర్లో వసూలైన రూ. 1,03,184 కోట్లలో .. సీజీఎస్టీ భాగం రూ. 19,962 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 26,792 కోట్లు, ఐజీఎస్టీ రూ. 48,099 కోట్లు, సెస్సు రూ. 8,331 కోట్లుగా ఉన్నాయి. ద్రవ్య లోటు కట్టడీలో ఉండాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా నెలల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు కొనసాగాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి అభిప్రాయపడ్డారు. వార్షిక లక్ష్యం స్థాయిని అందుకోలేకపోయినా.. ఇక నుంచి వసూళ్లు స్థిరంగా మెరుగుపడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ప్రతి నెలా రూ. లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. -
ఆర్థికాభివృద్ధి తగ్గుతుంది..తదుపరి సంస్కరణలు కీలకం
న్యూఢల్లీ: డీమోనిటైజేషన్ కారణంగా భారత్ ఆర్థికాభివృద్ధి వచ్చే 12 నెలల్లో 1 శాతం మేర తగ్గుతుందని ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఒనగూడాలంటే..తదుపరి చేపట్టబోయే సంస్కరణలు కీలకమైని హెచ్ఎస్బీసీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలో వివరాలు... పెద్ద నోట్లను ఉపసంహరించడం..వాటి స్థానంలో కొత్త పెద్ద నోట్లను ప్రవేశపెట్టడంవల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలు వున్నాయి. ద్రవ్య సరఫరా తగ్గినందున, ఏడాదికాలంలో జీడీపీ 0.7-1.0 శాతం మేర తగ్గవచ్చు. అధిక ప్రభావం డిసెంబర్, మార్చిలతో ముగిసే త్రైమాసికాల్లో వుంటుంది. నల్లధనంవల్ల సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇక అధికారికమైపోతున్నందున, ప్రభుత్వం ఇందుకు తగిన సంస్కరణల్ని ప్రవేశపెడితే ప్రయోజనాలు దీర్ఘకాలంలో వుంటాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా డబ్బు చేరినందున..రుణ, డిపాజిట్, ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు పాత పెద్ద నోట్లలో 80 శాతం బ్యాంకుల వద్దకు చేరితే, బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు రూ.11.3 లక్షల కోట్ల మేర పెరుగుతాయి. దీంతో డిపాజిట్, రుణ రేట్లు బాగా తగ్గుతాయి. ఆర్బీఐ పరపతి విధానానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం వుంది. -
ఈ ఏడాది వృద్ధి రేటు 5.4%
వాషింగ్టన్: గతేడాది 4.4 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 5.4 శాతానికి చేరే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్)తెలిపింది. ప్రపంచ వృద్ధి స్వల్పంగా బలపడడం, ఎగుమతుల సామర్థ్యం పుంజుకోవడం, ఇటీవల ఆమోదించిన పెట్టుబడుల ప్రాజెక్టులను అమలు చేయడం అభివృద్ధి రేటు పెరగడానికి దోహదపడతాయని పేర్కొంది. ‘ఇటీవలి నెలల్లో భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. పసిడి దిగుమతులపై ఆంక్షల ఫలితంగా కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) తగ్గింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా తిరోగమనం పట్టవచ్చు గానీ, అదో ముఖ్యమైన సవాలుగానే కొనసాగవచ్చు. 2015లో భారత్ 6.4 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశముంది. అయితే, ఇందుకు పెట్టుబడులు పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలం కావాలి, ఎగుమతులు మరింత వృద్ధి చెందాలి. ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంపాటు తక్కువ స్థాయిలో ఉంచడానికి భారత ప్రభుత్వం మరింత కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబించాల్సి ఉంది...’ అని ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన తాజా నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు ద్రవ్య విధాన రూపకర్తలు నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించాలని ఐఎంఎఫ్ సూచించింది. సహజ వనరులకు మార్కెట్ ఆధారిత ధరలను నిర్ణయించాలనీ, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల అమల్లో జా ప్యాన్ని తొలగించాలనీ పేర్కొంది. విద్యుత్తు, గనుల రంగాల్లో విధానాలను మెరుగుపర్చాలని కోరింది. భారత్ వృద్ధి బలహీనమే: ఓఈసీడీ కాగా, భారత్ వృద్ధి బలహీన ధోరణిని సూచిస్తోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 33 దేశాల ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ (ఎకనమిక్ కో-ఆపరేటివ్ అండ్ డెవలప్మెంట్) పేర్కొంది. దీనిప్రకారం జనవరిలో 97.7 పాయింట్లుగా ఉన్న ఓఈసీడీ కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) సూచీ ఫిబ్రవరిలో 97.6కు తగ్గింది. నవంబర్‌లో ఈ రేటు 97.9. డిసెంబర్లో 97.8గా ఉంది. భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యాలు సైతం ఆర్థికంగా బలహీనతలోనే ఉన్నాయి. చైనా పరిస్థితి మాత్రం కొంత మెరుగుపడింది.