ఆర్థికాభివృద్ధి తగ్గుతుంది..తదుపరి సంస్కరణలు కీలకం
ఆర్థికాభివృద్ధి తగ్గుతుంది..తదుపరి సంస్కరణలు కీలకం
Published Mon, Nov 21 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
న్యూఢల్లీ: డీమోనిటైజేషన్ కారణంగా భారత్ ఆర్థికాభివృద్ధి వచ్చే 12 నెలల్లో 1 శాతం మేర తగ్గుతుందని ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎస్‌బీసీ అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఒనగూడాలంటే..తదుపరి చేపట్టబోయే సంస్కరణలు కీలకమైని హెచ్‌ఎస్‌బీసీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలో వివరాలు... పెద్ద నోట్లను ఉపసంహరించడం..వాటి స్థానంలో కొత్త పెద్ద నోట్లను ప్రవేశపెట్టడంవల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలు వున్నాయి. ద్రవ్య సరఫరా తగ్గినందున, ఏడాదికాలంలో జీడీపీ 0.7-1.0 శాతం మేర తగ్గవచ్చు. అధిక ప్రభావం డిసెంబర్, మార్చిలతో ముగిసే త్రైమాసికాల్లో వుంటుంది.
నల్లధనంవల్ల సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇక అధికారికమైపోతున్నందున, ప్రభుత్వం ఇందుకు తగిన సంస్కరణల్ని ప్రవేశపెడితే ప్రయోజనాలు దీర్ఘకాలంలో వుంటాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా డబ్బు చేరినందున..రుణ, డిపాజిట్, ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు పాత పెద్ద నోట్లలో 80 శాతం బ్యాంకుల వద్దకు చేరితే, బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు రూ.11.3 లక్షల కోట్ల మేర పెరుగుతాయి. దీంతో డిపాజిట్, రుణ రేట్లు బాగా తగ్గుతాయి. ఆర్‌బీఐ పరపతి విధానానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం వుంది.
Advertisement
Advertisement