![10 Lakh Startups in Next 10 Years Says Piyush Goyal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/piyush-goyal-says-about-startups.jpg.webp?itok=RobqZFrn)
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 10 లక్షలకు చేరగలదని భారత్–ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
140 కోట్ల జనాభా గల భారత మార్కెట్లో గణనీయంగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నీర్ ఎం బర్కత్ సారథ్యంలో వ్యాపార దిగ్గజాల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఆర్థిక, సాంకేతికాంశాల్లో పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు.
2016లో 450గా ఉన్న రిజిస్టర్డ్ స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం 1.57 లక్షలకు చేరింది. కొత్త ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద గుర్తింపు పొందిన యూనిట్లకు పన్నులు, పన్నులయేతర ప్రోత్సాహకాలకు అర్హత లభిస్తుంది.
ఇదీ చదవండి: ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్
ఫ్లాగ్‌షిప్ పథకాలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ స్కీము మొదలైన వాటి ద్వారా వివిధ రంగాలు, దశల్లో ఉన్న అర్హత కలిగిన స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం కూడా లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment