భారత తయారీ రంగం జనవరి నెలకు పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గత డిసెంబర్‌లో 56.4 శాతంగా ఉంటే, 2025 జనవరి నెలలో 57.7కు దూసుకుకెళ్లింది. ఎగుమతులు 14 ఏళ్లలోనే (2011 తర్వాత) బలమైన వృద్ధిని చూపించడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు ఈ సర్వే అభిప్రాయపడింది. 50 పాయింట్లకు పైన తయారీ పీఎంఐ నమోదు అయితే దాన్ని విస్తరణగా, అంతకు దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తుంటారు.
‘భారత తయారీ పీఎంఐ ఆరు నెలల గరిష్ట స్థాయికి జనవరిలో చేరుకుంది. దేశీ, ఎగుమతుల డిమాండ్ బలంగా ఉంది. ఇది వృద్ధికి మద్దతునిచ్చింది’ అని హెచ్‌ఎస్‌బీసీ ముఖ్య భారత ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. తయారీదారులకు కొత్త ఆర్డర్లలో వృద్ధి ఉన్నట్టు, దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పీఎంఐ సర్వే తెలిపింది. రానున్న కాలంలో 32 శాతం సంస్థలు వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉంటే, కేవలం ఒక శాతం సంస్థలు క్షీణతను అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీ
ఐపీవోకు వీడా క్లినికల్ రీసెర్చ్
క్లినికల్ రీసెర్చ్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.185 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. ఇంతక్రితం కంపెనీ 2021 సెపె్టంబర్‌లోనూ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. సెబీ నుంచి అనుమతి లభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఐపీవోను పక్కనపెట్టింది. కంపెనీ ప్రధానంగా వివిధ దశల ఔషధ అభివృద్ధిలో సర్వీసులు అందిస్తోంది. తొలి దశసహా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ తదితర సేవలు సమకూర్చుతోంది.
Comments
Please login to add a commentAdd a comment