భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.
నివేదికలో వివరాల ప్రకారం..
జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.
విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్‌టైన్‌మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.
2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.
దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.
దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.
77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్‌షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.
బ్రాండ్‌ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్‌ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.
ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment