బాబోయ్‌ కరోనా జీడీపీకి షాక్‌! | Fitch slashes India growth forecast to 30-year low of 2percent for FY21 | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ కరోనా జీడీపీకి షాక్‌!

Published Sat, Apr 4 2020 4:20 AM | Last Updated on Sat, Apr 4 2020 7:03 AM

Fitch slashes India growth forecast to 30-year low of 2percent for FY21 - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్‌ .. తాజాగా సగం పైగా తగ్గించేయడం గమనార్హం. లాక్‌డౌన్‌లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని వివరించింది.

చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని పేర్కొంది. ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను 2 శాతానికి కుదిస్తున్నాం‘ అని ఫిచ్‌ తెలిపింది. మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.  

చిన్న సంస్థలు, బ్యాంకులకు దెబ్బ...
వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్‌ పేర్కొంది. సాధారణంగా నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలేమైనా తగ్గిన పక్షంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తవచ్చని తెలిపింది. ‘ఈ పరిస్థితుల్లో భారత్‌లోని ఎన్‌బీఎఫ్‌సీలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుంది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్‌బీఎఫ్‌సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముంది‘ అని ఫిచ్‌ తెలిపింది.  

వచ్చే ఏడాది రికవరీ: ఏడీబీ
అంతర్జాతీయంగా హెల్త్‌ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇది భారత్‌లోనే శరవేగంగా విస్తరిస్తే, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పవని ఏడీబీ తెలిపింది. అయితే, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీవో) నివేదికలో ఏడీబీ తెలిపింది. ‘ప్రస్తుతం అసాధారణ గడ్డుకాలంగా నడుస్తోంది.

కరోనా ప్రజల జీవితాలతో పాటు వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది‘ అని ఏడీబీ ప్రెసిడెంట్‌ మసాత్సుగు అసకావా తెలిపారు. ‘ప్రపంచ వృద్ధికి, భారత రికవరీకి కరోనా పెను సవాలుగా మారింది. కానీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో గట్టిగా కోలుకోవచ్చు. సంస్కరణల ఊతంతో అప్పుడు 6.2%  ఉండొచ్చు‘ అని ఏడీబీ చీఫ్‌ ఎకానమిస్ట్‌ యసుయుకి సవాడా చెప్పారు. మహమ్మారి బారిన పడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత్‌ వేగంగా స్పందించిందన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లపరంగా కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు రికవరీకి తోడ్పడగలవని చెప్పారు.

ప్రపంచానికి 4.1 ట్రిలియన్‌ డాలర్ల నష్టం..
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్‌) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్‌ జీడీపీలో ఇది 2.3–4.8%కి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కమోడిటీల ధరల పతనం కూడా కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతోందని వివరించింది. 2020లో వృద్ధి 4.1 శాతానికి తగ్గి, 2021లో 6 శాతానికి రికవర్‌ కాగలదని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement