మాంద్యం కోరల్లో! | Coronavirus has plunged the world into a recession | Sakshi
Sakshi News home page

మాంద్యం కోరల్లో!

Published Thu, Mar 19 2020 4:58 AM | Last Updated on Thu, Mar 19 2020 5:11 AM

Coronavirus has plunged the world into a recession - Sakshi

ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్‌ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్‌ 29,000 మార్క్‌ దిగువకు చేరింది.  

మాంద్యం భయాలు...
భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్‌అండ్‌పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్‌ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్‌అండ్‌పీ విడుదల చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు
అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్‌ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్‌ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్‌ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు.

అమెరికా, బ్రిటన్‌ భారీ ప్యాకేజీలు
అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్‌ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్‌ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్‌ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ కూడా బిలియన్‌ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి.

మాంద్యం, టెలికం ఏజీఆర్‌ ప్రభావం
‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్‌–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్‌ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్‌ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్‌ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

► ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్‌ 12 శాతం, కోటక్‌ బ్యాంకు , బజాజ్‌ ఫైనాన్స్‌ 11 శాతం చొప్పున, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10 శాతం, ఎన్‌టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి.

ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు
ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది.

భారత్‌ ‘వృద్ధి’కి ఎస్‌ అండ్‌ పీ కోత
న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఎస్‌ అండ్‌ పీ కోత పెట్టింది. క్యాలెండర్‌ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా  నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది.

ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్‌ అండ్‌ పీ, అమెరికా, యూరోప్‌ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది.   వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్‌ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్‌బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్‌ అంచనావేసింది.

2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్‌ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్‌ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది.

క్రూడ్, బంగారం మరింత పతనం
కోవిడ్‌–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్‌ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్‌ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది.


► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది.  
► ఇక క్రూడ్‌ విషయానికి వస్తే, స్వీట్‌ బ్యారల్‌ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌ ఆయిల్‌ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం.
► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement