కరోనా వైరస్ సంక్షోభంతో సంవత్ 2076లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అనిశ్చితి, నిరాశావాదం ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. 2020 జనవరిలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 12,431 తాకిన నిఫ్టీ .. కరోనా దెబ్బతో మార్చిలో ఏకంగా మూడేళ్ల కనిష్ట స్థాయి 7,511కి పతనమైంది. అయితే, ఈక్విటీ మార్కెట్లు శరవేగంగా కోలుకుని మళ్లీ కొత్త రికార్డు స్థాయిని తాకగా, అటు పసిడి సైతం కొత్త గరిష్ట స్థాయిని చూడటం గమనార్హం. మొత్తం మీద సంవత్ 2076కి మార్కెట్ లాభాలతో వీడ్కోలు పలికింది.
కార్పొరేట్ల ఆదాయాలు మెరుగుపడుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటుండటం, వ్యవస్థలో పుష్కలంగా నిధుల లభ్యత వంటి అంశాలతో 2077 సంవత్ మరింత ఆశావహంగా ఉండవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కోణంలో చూస్తే 2003 నాటి పరిస్థితులు పునరావృతం కావచ్చని చెబుతున్నాయి. 2003 జూలై–2008 డిసెంబర్ మధ్యకాలంలో సెన్సెక్స్ ఏకంగా అయిదు రెట్లు పెరిగిన సంగతి గుర్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఆటోమొబైల్, ఆయిల్.. గ్యాస్, టెలికం, భారీ యంత్ర పరికరాలు, సిమెంట్, మెటల్స్ కంపెనీల షేర్లు సంవత్ 2077లో రాణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల షేర్లు సుమారు 20 శాతం నుంచి 39 శాతం దాకా పెరగొచ్చని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.
వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ మరో 10–12 శాతం పెరగవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ భావిస్తోంది. అమెరికా మరో విడత ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశంతో పాటు అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో కొనసాగనుండటం, వచ్చే ఏడాది తొలినాళ్లలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండటం ఇందుకు తోడ్పడవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈక్విటీల్లో 70 శాతం, బాండ్లలో 20 శాతం, పసిడిలో 10 శాతం మేర పెట్టుబడులను కేటాయించవచ్చంటూ ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ పేర్కొంది.
వివిధ బ్రోకింగ్ సంస్థల సిఫార్సులు ఈ వారం ప్రాఫిట్ ప్లస్ స్పెషల్
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
భారతి ఎయిర్‌టెల్
ప్రస్తుత ధర రూ. 481
టార్గెట్ ధర రూ. 597
ప్రపంచంలోనే టాప్ టెలికం దిగ్గజాల్లో ఒకటి. డేటా వినియోగం, టారిఫ్‌ల పెరుగుదలతో యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఆర్‌పీయూ రూ. 175–180 స్థాయికి చేరొచ్చని అంచనా. సుమారు రూ. 22,700 కోట్ల నగదు నిల్వలు, ఏజీఆర్ బాకీల గడువుపరంగా కాస్త వెసులుబాటు మొదలైన అంశాలు కంపెనీకి సానుకూలంగా ఉండవచ్చు. చిన్న సంస్థల కోసం క్లౌడ్ కమ్యూనికేషన్స్ విభాగంలోనూ అడుగుపెట్టింది. జియోతో పోటీ, భారీ పెట్టుబడులు, సాంకేతిక.. నియంత్రణ సంస్థపరమైన మార్పులు, కరెన్సీ ఒడిదుడుకులు తదితర ప్రతికూలాంశాలు ఉన్నాయి.
క్యాడిలా హెల్త్‌కేర్
ప్రస్తుత ధర రూ. 429
టార్గెట్ ధర రూ. 508
దేశీయంగా దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటి. అంతర్జాతీయంగా అమెరికా, యూరప్ తదితర మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. దేశీ ఫార్మా మార్కెట్లో సుమారు 4.2 శాతం వాటాతో నాలుగో అతి పెద్ద సంస్థగా కొనసాగుతోంది. బ్రాండ్స్, ఇన్–లైసెన్సింగ్ ఒప్పందాలు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో కంపెనీ ఆదాయాలు మెరుగ్గా ఉండవచ్చని అంచనా. ఇక, బయోలాజిక్స్, టీకాలు మొదలైన ఇతర విభాగాల ఉత్పత్తులు కూడా ఇందుకు తోడ్పడవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్
ప్రస్తుత ధర రూ. 486
టార్గెట్ ధర రూ. 503
దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకు హోదా. రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. యస్ బ్యాంక్, ఇతరత్రా సహకార బ్యాంకుల్లో ప్రతికూల పరిణామాల కారణంగా డిపాజిటర్లు క్రమంగా పెద్ద ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వైపు మళ్లే అవకాశాలు ఉండటం ఐసీఐసీఐ బ్యాంకుకు సానుకూలంగా ఉండగలదు.
ఇన్ఫోసిస్
ప్రస్తుత ధర రూ. 1,133
టార్గెట్ ధర రూ. 1,205
ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో డీల్స్ దక్కించుకుంది. వ్యయాలను నియంత్రించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది.
కోటక్ సెక్యూరిటీస్
బజాజ్ ఆటో
ప్రస్తుత ధర రూ. 3,042
టార్గెట్ ధర రూ. 3,900
దేశీయంగా మోటార్ సైకిళ్లకు డిమాండ్ మళ్లీ దాదాపు గతేడాది స్థాయికి చేరుతోంది. ఎగుమతులు కూడా పెరుగుతుండటం సానుకూలాంశం. కంపెనీ కీలకంగా ఉన్న విదేశీ మార్కెట్లలో దీర్ఘకాలికంగా వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి.
ఎల్‌అండ్‌టీ
ప్రస్తుత ధర రూ. 1,059
టార్గెట్ ధర రూ. 1,300
కంపెనీ ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దేశవిదేశాల్లో కాంట్రాక్టుల విలువ సుమారు రూ. 6.1 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. రాబోయే రోజుల్లో వీటి నుంచి క్రమంగా ఆదాయాలు అందుబాటులోకి రావచ్చు.
అంబుజా సిమెంట్స్
ప్రస్తుత ధర రూ. 259
టార్గెట్ ధర రూ. 300
విస్తరణ ప్రణాళికలు, వ్యయ నియంత్రణ చర్యలతో పటిష్టమైన వృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత లాభదాయకంగా ఉండే ఉత్తరాదిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. ఆకర్షణీయ వేల్యుయేషన్‌తో షేరు లభిస్తోంది.
ఐటీసీ
ప్రస్తుత ధర రూ. 188
టార్గెట్ ధర రూ. 260
కీలకమైన సిగరెట్ల వ్యాపార విభాగం స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా జూలై, ఆగస్టుల్లో కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో మళ్లీ పుంజుకుంది. ఎఫ్‌ఎంసీజీ ప్రధాన పోర్ట్‌ఫోలియో మెరుగ్గా ఉంది.
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్
ప్రస్తుత ధర రూ. 312
టార్గెట్ ధర రూ. 362
వివిధ రకాల సాధనాలు, ప్రాంతాల్లో పెట్టుబడులతో వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తోంది. 2020–21 రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నిర్వహణలోని అసెట్స్ పరిమాణం 12–15 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తోంది. తగినంత స్థాయిలో మూలధన నిల్వలు, తగ్గుతున్న నిధుల సమీకరణ వ్యయాలు మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు.
ఏంజెల్ బ్రోకింగ్
గెలాక్సీ సర్ఫెక్టెంట్స్
ప్రస్తుత ధర రూ. 1,842
టార్గెట్ ధర రూ. 2,075
అధిక మార్జిన్ ఉండే స్పెషాలిటీ కేర్ ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం మొత్తం ఆదాయాల్లో వీటి వాటా 40 శాతం దాకా ఉంటోంది. మిగతాది సర్ఫెక్టెంట్ వ్యాపారం ద్వారా వస్తోంది. పలు బహుళ జాతి దిగ్గజ సంస్థలతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారత్‌తో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ మొదలైన ఖండాల్లోని దేశాల్లో సంస్థలకు కూడా ముడి వస్తువులు ఎగుమతి చేస్తోంది. తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ కారణంగా కంపెనీపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ వివిధ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో కార్యకలాపాలు సత్వరం కోలుకోగలవని అంచనా.
మోతీలాల్ ఓస్వాల్
ఎస్‌బీఐ
ప్రస్తుత ధర రూ. 229
టార్గెట్ ధర రూ. 300
దేశీ ఎకానమీ మెరుగుపడే కొద్దీ ఎస్‌బీఐ ఆదాయాలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయడానికి అనువైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పటిష్టమైన సంస్థ.
హీరో మోటోకార్ప్
ప్రస్తుత ధర రూ. 3,117
టార్గెట్ ధర రూ. 3,700
మార్కెట్‌లో ఆదిపత్యం, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి గల పోర్ట్‌ఫోలియో కారణంగా ఇతర ద్విచక్ర వాహనాల సంస్థలతో పోలిస్తే హీరో మోటోకార్ప్ మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన ఉత్పత్తులను మెరుగైన ధరల్లో అందించగలుగుతుండటం సంస్థకు సానుకూలాంశం. ఎకానమీ నుంచి ఎగ్జిక్యూటివ్ దాకా అన్ని వర్గాలకు కావాల్సిన వాహనాలు అందిస్తుండటం సంస్థకు అనుకూలించనుంది.
క్రాంప్టన్ కన్జూమర్
ప్రస్తుత ధర రూ. 299
టార్గెట్ ధర రూ. 360
ఫ్యాన్లు, పంపుల మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వాటర్ హీటర్ల సెగ్మెంట్లో రెండో స్థానానికి చేరింది. పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గ కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
డాబర్ ఇండియా
ప్రస్తుత ధర రూ. 517
టార్గెట్ ధర రూ. 600
హెర్బల్ సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. నేరుగా పంపిణీ చేసే వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. వ్యయాల నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇవన్నీ కలిసి సంస్థ ఆదాయాలు మెరుగుపడేందుకు దోహదపడగలవని అంచనా.
దివీస్ ల్యాబ్
ప్రస్తుత ధర రూ. 3,445
టార్గెట్ ధర రూ. 3,520
ఏపీఐలకు డిమాండ్ ఉండటం, ఇంటర్మీడియరీస్‌ను ఇన్ హౌస్‌లో తయారీ పెంచుకోవడం వల్ల మార్జిన్లు పెరిగే అవకాశాలు, కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి అద నపు ఆదాయాలు తదితర అంశాలు దివీస్ ల్యాబ్‌నకు సానుకూలంగా ఉండగలవు.
Comments
Please login to add a commentAdd a comment