లోక్‌సభ 18వ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మీడియాలో సమీక్ష జరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వృద్ధి రేటుతో 2024 ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిందని ఆర్థికవేత్తల అంచనా. ఇదే నిజమైతే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ప్రగతి అత్యంత వేగవంతంగా సాగినట్లేనని కూడా వారు భావిస్తున్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో నిరుద్యోగం కాస్త ఎక్కువగా ఉందనే ప్రచారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బాగానే వినిపించింది. ఆధునిక భారతంలో పట్టణ, నగర ప్రాంతాల్లోనే అన్ని విధాలా అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, మారుమూల ప్రాంతాల్లో వృద్ధి అంతగా లేదని కొందరు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు స్థానాలు ఎగబాకి పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానానికి చేరుకుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే దేశాన్ని మూడో స్థానానికి తీసుకెళతామని కూడా పాలకపక్షం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించింది. అగ్రశ్రేణి ఇకానమీగా అవతరించినప్పటికీ తలసరి ఆదాయం విషయంలో జీ–20 దేశాల్లో ఇండియా అట్టడుగున ఉందనే విషయాన్ని పాలకులు మరువకూడదని ఆర్థిక నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు.
ప్రపంచ దేశాల ఆర్థిక బలాబలాలను మదింపు చేసి, వాటి పరపతికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నెలలో భారత సావరిన్ రేటింగ్ పరిస్థితిని ‘సుస్థిర’ (స్టేబుల్) నుంచి ‘సానుకూల’ (పాజిటివ్)గా అంచనావేసింది. బీబీబీ–రేటింగ్‌ను మాత్రం మార్చకుండా మెరుగైన భవిష్యత్తు ఉన్న దేశంగా ఇండియాను పరిగణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తూ ముందుకు సాగడం వల్ల దాని పరపతిపై నిర్మాణాత్మక ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పీ పేర్కొంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..
మార్చితో పోలిస్తే దేశంలో ఏప్రిల్ నెల వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. కీలకమైన ఈ సూచిక రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4%కు తగ్గకుండా కిందటి నెలలో 4.83% వద్ద నిలిచింది. వినియోగదారుల జీవన ప్రమాణాలను అధికంగా ప్రభావితం చేసే కీలకమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్‌ఫ్లేషన్) మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో కొద్దిగా పెరిగింది (8.52% నుంచి 8.70%కు). 2023 నవంబర్ నుంచి ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 8%కి పైనే ఉంటోంది. సామాన్య, పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అందుకే, సాధారణ ఎన్నికలను, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కిందటేడాది నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గోధుమలు, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు
21వ శతాబ్దం మొదటి పాతికేళ్ల చివరిలోకి వచ్చిన ప్రస్తుత సమయంలో నిరుద్యోగం కూడా ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. దేశంలో మార్చిలో 7.4%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.1%కు పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేట్ సంస్థ అంచనావేసింది. పట్టణ ప్రాంతాల్లో 19–29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 2023 చివరి మూడు నెలలతో పోల్చితే స్వల్పంగా (16.5% నుంచి 17%కి) పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయరంగంలో ఇండియా పలుకుబడి చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందనే నిపుణులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ బడా కంపెనీలను ఒక్క చైనా వైపే చూడకుండా ఇండియా రావాలని కోరుతూ ప్రోత్సాహకాలను అందిస్తానంటోంది. మొత్తంమీద భారత విదేశాంగ విధానం ఈ పదేళ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి పక్షంలో కేంద్రంలో అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment