దేశానికి వచ్చి-పోయే విదేశీమారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 9.7 బిలియన్ డాలర్ల(రూ.81 వేలకోట్లు) కరెంట్ అకౌంట్ లోటు నమోదైంది. అదే త్రైమాసికానికి చెందిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ 1.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2023 ఏప్రిల్–జూన్) దీని విలువ 8.9 బిలియన్ డాలర్లు(రూ.74 వేలకోట్లు)గా నమోదైంది. అయితే 2024 జనవరి–మార్చి మధ్య కరెంట్ అకౌంట్ 4.6 బిలియన్ డాలర్ల(రూ.38 వేలకోట్లు) మిగులును నమోదుచేసుకుంది. ఈమేరకు ఆర్‌బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.
సీఏడీ పెరుగుదలకు కారణాలు..
క్యూ1లో కరెంట్ అకౌంట్ లోటు పెరగడానికి వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం) కారణమని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023 క్యూ1లో వస్తు వాణిజ్యలోటు 56.7 బిలియన్ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు)కాగా, 2024 ఇదే కాలంలో ఈ విలువ 65.1 బిలియన్ డాలర్ల(రూ.5.4 లక్షల కోట్లు)కు ఎగసింది.
ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు (ఎఫ్‌పీఐ) 2024–25 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కేవలం 0.9 బిలియన్ డాలర్లు(రూ.7.5 వేలకోట్లు)గా నమోదయ్యాయి.
ఏప్రిల్– జూన్ మధ్య విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) 5.6 బిలియన్ డాలర్ల(రూ.47 వేలకోట్లు) నుంచి 1.8 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు)కు పడిపోయాయి.
ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
రెమిటెన్సులు (ఎన్‌ఆర్‌ఐలు దేశానికి పంపిన మొత్తం) మాత్రం 27.1 బిలియన్ డాలర్ల(రూ.2.2 లక్షల కోట్లు) నుంచి 29.5 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)కు పెరిగాయి.
నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం 4.7 బిలియన్ డాలర్ల(రూ.39 వేలకోట్లు) నుంచి 6.3 బిలియన్ డాలర్ల(రూ.52 వేలకోట్లు)కు ఎగిసాయి.
ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 2.2 బిలియన్ డాలర్ల(రూ.18 వేలకోట్లు) నుంచి 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment