‘లోటు’ దిగొచ్చింది!
ముంబై: దేశాన్ని వణికించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కళ్లెం పడింది. ప్రధానంగా బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి తగ్గింది. అంటే 32.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో ఈ లోటు చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. సోమవారం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు.
దిగుమతుల భారం కారణంగా ఈ లోటు ఆందోళనకస్థాయికి ఎగబాకి... డాలరుతో రూపాయి మారకం విలువ భారీ పతనం ఇతరత్రా అనేక ఆర్థిక ఇబ్బందులకు కారణమైంది. గతేడాది ఆగస్టులో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టస్థాయి అయిన 68.85కు కరిగిపోయింది. దీంతో క్యాడ్ కట్టడి కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఎట్టకేలకు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యంగా బంగారం దిగుమతులపై నియంత్రణలతో క్యాడ్ దిగొచ్చేందుకు దోహదం చేసింది.
మార్చి క్వార్టర్‌లో మరింత ఉపశమనం...
గతేడాది ఆఖరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో క్యాడ్ ఏకంగా జీడీపీలో 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో 3.6 శాతం(18.1 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) తగ్గుముఖం పట్టడం.. తాజాగా విదేశీ నిధు ప్రవాహం పుంజుకోవడం కూడా క్యాడ్ భారీగా రికవరీ అయ్యేందుకు తోడ్పడింది.
ఎగుమతులు మెరుగుపడటం.. దిగుమతుల కట్టడి కారణంగా గతేడాది వాణిజ్య లోటు 147.6 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. అంతక్రితం ఏడాది వాణిజ్య లోటు 195.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, గతేడాది దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గి.. 48.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతక్రితం ఏడాదిలో ఈ మొత్తం 89 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ప్రధానంగా విదేశీ రుణాలపై నికర చెల్లింపులు పెరగడం ఇతరత్రా అంశాలు దీనికి కారణమైనట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
గతేడాది చివరి క్వార్టర్(క్యూ4)లో బంగారం దిగుమతులు మరింత దిగొచ్చాయి. విలువపరంగా 5.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో దిగుమతులు(15.8 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారీగా పడిపోయాయి. ఇక వాణిజ్య లోటు కూడా క్యూ4లో 45.6 బిలియన్ డాలర్ల నుంచి 30.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. గతేడాది మొత్తం తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడిన రూపాయి ప్రస్తుతం అట్టడుగు స్థాయి నుంచి భారీగా కోలుకుని కొంత స్థిరత్వాన్ని కూడా సంతరించుకుంటోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 స్థాయిలో కదలాడుతోంది. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటం... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) నిధుల ప్రవాహం కూడా రూపాయికి బలాన్నిస్తున్నాయి.