గ్రామీణ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను
2024 ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక వెల్లడి
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్‌బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
→ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్‌ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది.
→ మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి.
→ కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది.
æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి.
2025లో వృద్ధి అవకాశాలు మెరుగు
భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది.
– ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట
Comments
Please login to add a commentAdd a comment