ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది.
ద్వితీయార్థం పుంజుకోవచ్చు..
గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్‌లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్‌కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది.
విదేశీ కరెన్సీలో చెల్లింపులు..
మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
గత నష్టాల కంటే తక్కువగా..
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్‌ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment