ఆదుకోవాల్సిన వేళ చేదుకబురు
Published Mon, Dec 9 2013 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘కోటి విద్యలు కూటి కొరకే’ అంటారు. వ్యవసాయం రైతులకు ‘కూటి విద్యే’ కావచ్చు. కానీ, అది యావత్తు సమాజానికీ కూడు పెట్టే విశిష్ట విద్య. ఓ రకంగా వెల కట్టలేని విలక్షణ కర్తవ్యం. అయితే- ఆ విద్యను నమ్ముకుని, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న అన్నదాతలకు ‘కోటి కష్టాలు’ తప్పడం లేదు. అందరి కడుపూ నింపే కృషీవలుర వేదన ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడడం’ తప్ప ఫలితం లేనిదిగా మారుతోంది. వరుస విపత్తులతో కుత్తుక లోతు కష్టాల్లో మునిగిన రైతులకు సేద్యమంటేనే సింహస్వప్నంగా కనిపించే రోజులు దాపురించాయన్నా సత్యదూరం కాదు. ఇలాంటి ఆపత్సమయంలో అన్నదాతల్లో మనోస్థైర్యాన్ని నిలపాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఒక్క అడుగూ వేయకపోగా.. వ్యవసాయం పట్ల వారికి కలుగుతున్న విముఖత పెరిగేలా, దాన్నుంచి మరింత వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. సమాజం కడుపు నింపడంతో పాటు తానూ, తన కుటుంబమూ ఓ ముద్ద తినగలమనీ, మన్నును నమ్ముకున్నందుకు ఎన్నటికైనా మంచిరోజులు వ ణుకుమంటున్న ఆశను సైతం చిదిమేస్తున్నాయి.
బాగా పండితే క్వింటాల్‌కు మిగిలేది రూ.49 మాత్రమే..
గత కొన్నేళ్లుగా అటు ప్రకృతి వైపరీత్యాలతో పంటను కోల్పోవడంతో పాటు ఇటు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులకు ధైర్యం చెప్పి, చేయూతనివ్వాల్సిన సమయంలో మూడేళ్లపాటు ధాన్యానికి మద్దతు ధర పెంచేది లేదని కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల నిర్ణాయక కమిటీ (సీఏసీపీ) చైర్మన్ అశోక్ గులాటీ ప్రకటించడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇటీవల కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో రైతులతో మాట్లాడిన ఆయన ఇప్పటికే వరికి మద్దతు ధర ఎక్కువగా ఉందని, దాన్ని పెంచే అవకాశం లేదని చావుకబురు చల్లగా చెప్పారు.
ఇప్పటికే సీఏసీపీ ప్రకటించిన మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతుంటే.. పెంచే అవకాశం లేదని చైర్మన్ స్వయంగా ప్రకటించడంపై రైతులు హతాశులవుతున్నారు. ప్రస్తుతం వరి సాధారణ రకం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1310 ఉండగా గ్రేడ్-1కు రూ.1345 ఉంది. జిల్లాలో ఖరీఫ్ ఎకరా సాగుకు రూ.26,500 అవుతున్నట్టు జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఖరీఫ్‌లో అన్నీ కుదిరితే 28 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుత మద్దతు ధరను బట్టి రైతుకు మిగిలేది క్వింటాల్‌కు రూ.49 మాత్రమే. ఐదేళ్లలో నాలుగుసార్లు ఖరీఫ్ తుడిచిపెట్టుకుపోవడంతో పెట్టుబడులు కూడా దక్కడం లేదు.
ఏ సర్కారుకూ కారుణ్యం లేదు..
గతంలో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి అవుతున్న పెట్టుబడికి 50 శాతం పెంచి మద్దతు ధర ప్రకటించాలని సిఫార్సు చేసింది. అయితే ఎన్డీఏ, ఆ తరువాత యూపీఏ ప్రభుత్వాలు దీనిని తొక్కిపెట్టాయి. 2011లో మద్దతు ధర గిట్టుబాటుకావడం లేదని కోనసీమ రైతులు సాగు సమ్మె చేశారు. ఈ ఉద్యమం జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టించడంతో సీఏసీపీ చైర్మన్ అశోక్ గులాటీ కోనసీమలో పర్యటించారు. ఉప్పలగుప్తంలో రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం నిజమేనని అంగీకరించారు.
అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, తాను అందుకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మూడేళ్లు మద్దతు ధర పెంచేది లేదని ప్రకటించడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. కేంద్రం మద్దతు ధర పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు అదనంగా రూ.200 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సర్కారు నుంచీ స్పందన కరువైంది. సాగు సమ్మె తరువాత రెండేళ్లకాలంలో ధాన్యం మద్దతు ధరను సీఏసీపీ 15 శాతం మాత్రమే పెంచింది. ఎరువులు, పురుగు మందుల ధర 300 శాతం పెరిగాయి. మద్దతు ధర పెంచలేమంటున్న సీఏసీపీ మూడేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగవని హామీ ఇస్తే బాగుండునని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement