అమలాపురం :జిల్లాలో సేంద్రియ పద్ధతిని అనుసరించే రైతులు ఒకప్పుడు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టేస్థాయిలో ఉండేవారు. వీరి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతోంది. వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులపై మొగ్గు చూపుతుండడం, మార్కెట్‌లో ఎక్కువ ధర ఉండడం రైతులను ఇటు మళ్లేలా చేస్తోంది. ఈ పద్ధతిలో తొలి రెండేళ్లు దిగుబడి తగ్గినా, మూడో ఏటి నుంచి పెరుగుతోంది. వరి, ఇతర వాణిజ్య పంటలకన్నా కూరగాయల రైతులు ఎక్కువగా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జిల్లాలో 15 శాతం మంది సాగులో సేంద్రియ పద్ధతిని ఎక్కువగా వినిగిస్తుంటే ఐదు శాతం మందిది పూర్తిగా సేంద్రియ సాగే. కొందరు ప్రకృతి వ్యవసాయం అంటుంటే.. ఇంకొందరు వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల పద్ధతి అంటున్నారు. మరి కొందరు గో ఆధారిత సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అన్నింటిలో గో ఆధారిత వ్యవసాయానిదే అగ్రస్థానం. పేరూ, తీరూ ఏదైనా వీరందరి లక్ష్యం పెట్టుబడులు తగ్గించుకోవడం.. లాభాలు పొందడం, భూసారాన్ని పరిరక్షించుకోవడం, కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని, జీవన వైవిధ్యాన్ని కాపాడడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం.
కొత్త రైతుల ఆసక్తి
సేంద్రియసాగు వల్ల జిల్లాలో ప్రధాన పంట అయిన వరి, చెరకు, పత్తి సాగుల్లో ఎకరాకు రూ.8వేల నుంచి రూ.పది వేల వరకు ఆదా అవుతోంది. కొబ్బరి, అరటి తదితర పంటల్లో పెట్టుబడి మరీ స్వల్పం. సొంత ఆవుల నుంచి సేకరించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడతో కలిపి జీవామృతం తయారీకి రైతుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. పురుగులు, తెగుళ్ల నివారణకు వేప ఆకు, వేప నూనె, వేప పిండిని, ఆవుమూత్రం, సీతాఫలం, ఉమ్మెత్త వంటి వాటిని ఉపయోగించి ఘన జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రాలను తయారు చేస్తున్నారు. ప్రధానంగా పెట్టుబడి తగ్గడమే పలువురు కొత్త రైతులను ఆకర్షిస్తోంది.
మిత్రపురుగుల్ని పొట్టన పెట్టుకుంటున్న రసాయనాలు
రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయి. వీటిని పెంచడం కోసం మరిన్ని ఎరువులు వాడాల్సి వస్తోంది. తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటి నివారణకు రూ.వేలకు వేలు పెట్టుబడి అవుతోంది. ఈ ఖరీఫ్‌లో సుడిదోమ సోకి ఎకరాకు ఐదు బస్తాలకు పైబడి దిగుబడి కోల్పోగా, నివారణకు ఎకరాకు రూ.మూడు వేల వరకు ఖర్చయింది. కేవలం దోమ నివారణకే జిల్లాలో రైతులు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఒక సాలె పురుగు ఒకరోజులో 12 వరకు దోమల్ని తింటుంది. పురుగుమందుల వల్ల పొలంలో సాలీళ్లు , పలురకాల మిత్రపురుగులూ అంతరిస్తున్నాయి. భూమిలో 16 అడుగుల లోతుకు చొచ్చుకుపోయే వానపాము విసర్జించే మలమే కంపోస్టు అవుతోంది. విష రసాయనాలకు ఇవి కూడా బలయ్యాయి. వాటి ప్రాధాన్యతను గుర్తిస్తున్న రైతులు వీటిని వృద్ధి చేసుకునేందుకు వర్మీ కంపోస్టు, జీవన ఎరువులను వాడుతున్నారు.
ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనత..
రైతులు ఇలా అద్భుతాలు సృష్టిస్తుంటే ప్రభుత్వం ఈ సాగును ప్రోత్సహించడంలో ఉదాసీనత చూపుతోంది. ఎరువులు, పురుగు మందుల కంపెనీల అడుగులకు మడుగులు ఒత్తుతూ జీవన ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాల తయారీకి సహకరించడం లేదు. కోనసీమలో సాగుసమ్మె జరిగాక 2013లో కోనసీమలోని 13 మండలాలకు చెందిన సుమారు ఐదు వేల మంది రైతులకు ప్రభుత్వం రూ.కోటి విలువ చేసే జీవన ఎరువులను ఉచితంగా అందించింది. ఇది సత్ఫలితం ఇచ్చినా ఆయా కంపెనీల ఒత్తిడికి తలొగ్గి వీటి పంపిణీని పక్కనబెట్టింది. ఇప్పుడు కూడా రైతులకు అవసరమైన జీవన ఎరువులను అందకుండా చేసి పరోక్షంగా ప్రైవేట్ కంపెనీలకు వంత పాడుతోంది. ప్రభుత్వం కూడా కలిసి వస్తే ‘తూర్పు’న సేంద్రియ సాగు మరిన్ని వెలుగులు విరజిమ్ముతుంది.
ఆవు.. అన్నదాతకు ఆదరువు
Published Wed, Nov 19 2014 11:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement