జాగు తప్పకుంటే..మరోసాగే మేలు
అమలాపురం :‘ఆలస్యం అమృతం విషం’ అన్నమాట ఈ దాళ్వా (రబీ) సాగు విషయంలో వందశాతం వర్తిస్తుందని అటు అధికారులే కాక ఇటు నిపుణులూ అంటున్నారు. ఈ సీజన్‌లో పంట పండించడం అనేది ఓ గమ్యం అనుకుంటే.. దాన్ని చేరే దారి వరి ఒక్కటే కాదని, వేరేదారులూ ఉన్నాయంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితిలో సార్వా (ఖరీఫ్) వరి కోతలు, మాసూళ్లు డిసెంబరు నెలాఖరు వరకూ పూర్తయ్యేలా లేవు. అలా పంట ఒబ్బిడి ఆలస్యమయ్యే పొలాల్లో రైతులు వరి పండించడానికి సంసిద్ధులైతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆలస్యమైన రబీలో వరి సాగు చేయాలన్న ఆలోచనను విరమించి, ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, స్వీట్‌కార్న్ వంటి పంటలు వేసుకుంటే మేలని సూచిస్తున్నారు. గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి పొంచి ఉండడం, వర్షాభావం వల్ల మెట్టలో రబీ వరిసాగు దాదాపుగా లేకపోవడంతో డెల్టాలో ఖరీఫ్ ఆలస్యమయ్యే రైతులు, మెట్టలో రెండో పంటగా వరి వేయలేని రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారించాలంటున్నారు.
ఒకవైపు గోదావరికి నీటి ఎద్దడి పొంచి ఉండగా మరోవైపు రబీ సీజన్ పూర్తికి మార్చి 31ని గడువుగా నిర్ణయించారు.. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో పడిపోతోంది. ఈ నేపథ్యంలో డెల్టా రైతులు డిసెంబరు 15 నాటికి రబీ నాట్లు వేయడం పూర్తి చేయాలి. ఇక వెదజల్లు, డ్రమ్ సీడర్ విధానాల్ని అనుసరించే రైతులు, యంత్రాలతో నాట్లు వేసే రైతులు కూడా డిసెంబరు నెలాఖరుకల్లా ఆ దశను పూర్తి చేయాలి. లేకుంటే పైరు చివరి సమయంలో నీటి ఎద్దడి బారిన పడే అవకాశముంది. తూర్పు డెల్టాలో ఇప్పటికే ఖరీఫ్ కోతలు 80 శాతం పూర్తయినందున ఇక్కడ రబీలో వరిసాగుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే శివారుల్లో ఇంకా కోతలు పూర్తి కాలేదు. మధ్యడెల్టాలో 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ఇక్కడ డిసెంబరు నెలాఖరు వరకు కోతలు పూర్తయ్యే అవకాశం లేదు. కొన్నిచోట్ల జనవరిలో గాని కోతలకు రానంత ఆలస్యంగా సాగు జరిగింది. ఇలాంటి చోట ప్రత్యామ్నాయ పంటలు మినహా మరో మార్గం లేదని, పట్టుబట్టి వరి నారుమడులు వేస్తే నష్టపోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అపరాల సాగు లాభసాటే..
కాగా మధ్యడెల్టాలో పరిస్థితే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు ఆయకట్లలో ఉంది. అయితే ఏలేరులో సమృద్ధిగా నీరున్నందున ఇక్కడ సాగు కొంత ఆలస్యమైనా ర్వాలేదు. మధ్య డెల్టా, పీబీసీల్లో మాత్రం సకాలంలో నాట్లు వేయకుంటే నీటికి కటకట తప్పదు. ఇలాంటి చోట తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటలు తప్పని సరిగా వేసుకోవాలంటున్న అధికారులు.. అపరాలు, మొక్కజొన్న విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు పెద్దఎత్తున సేకరిస్తున్నారు. అపరాల సాగుతో రైతులు పలు విధాలుగా లాభాలు పొందే అవకాశముంది. డెల్టాలో మూడో పంటగా రైతులు వీటిని సాగు చేస్తున్నా రబీలో కూడా సాగుకు అనుకూలం. పెసలు 65 నుంచి 70 రోజులకు, మినుము 85 రోజుల నుంచి 90 రోజులకు దిగుబడికి వస్తుంది. సగటున ఎకరాకు రూ.1,500 వరకు పెట్టుబడి అవుతుంది. మూడు క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. అదే మంచి యాజమాన్య చర్యలు పాటిస్తే ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో క్వింటాల్ మినుము ధర రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు, పెసలు ధర రూ.3,500ల నుంచి రూ.5,500 వరకు ఉంటోంది.
సత్ఫలితాలిచ్చిన ‘స్వీట్‌కార్న్’ప్రయోగాత్మక సాగు
తక్కువ తడితో పండించే మొక్కజొన్న పంటకాలం 130 నుంచి 150 రోజులు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అవుతుండగా, 35 బస్తాలకుై పెబడి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1,500 వరకు వస్తోంది. కాగా ఇటీవల కోనసీమకు చెందిన కొందరు రైతులు తక్కువ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా స్వీట్‌కార్న్ సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. ఈ సీజన్‌లో భారీ వర్షాలు, తుపాన్లు వచ్చే అవకాశం లేనందున ఈ పంట కూడా సాగు చేయవచ్చు. సాగుకు ఎకరాకు పెట్టుబడి రూ.28 వేల నుంచి రూ.48 వేల వరకు అవుతుండగా దిగుబడి 30 వేల పొత్తుల వరకు ఉంటుంది. పొత్తు రూ.ఐదు, ఆపైన అమ్మే అవకాశం ఉంది. ఇక మెరక ప్రాంతాల రైతులు కూరగాయల సాగు కూడా చేపట్టవచ్చు. జిల్లాలో రబీ సాగయ్యే విస్తీర్ణం 3.8 లక్షల ఎకరాల వరకూ ఉండగా అందులో 50 వేల ఎకరాలు మినహా మిగిలిన విస్తీర్ణంలో నాట్లు, ఇతర పద్ధతుల్లో సాగు ఈ నెలాఖరుకే ప్రారంభమవుతుంది. ఆ విస్తీర్ణంలో వివిధ రకాల అపరాలు, మొక్కజొన్న వంటివి వేసినా.. పంటలు చేతికి వచ్చేనాటికి మార్కెట్‌లో వాటి రేట్లు పెద్దగా మారే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.