ఖరీఫ్ కదిలేదెలా?
► వానాకాలం సీజన్ వచ్చినా రైతులకు రుణాలివ్వని బ్యాంకులు
► ఏప్రిల్ ఒకటి నుంచే రుణాలివ్వాలన్న నిబంధనకు తూట్లు
► ఇప్పటికీ రుణ ప్రణాళిక ప్రకటించని ఎస్‌ఎల్‌బీసీ
► రైతు ఖాతాల్లోకి చేరని నాలుగో విడత రుణమాఫీ సొమ్ము
► పంటల బీమా సంస్థలను ఖరారు చేయని వ్యవసాయశాఖ
► ఎప్పట్లాగే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: చినుకు సవ్వడి మొదలైంది.. రైతన్న సాగు పనులకు సిద్ధమవుతున్నాడు.. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు చేతిలో పైసలుంటేనే నాగలి ముందుకు సాగేది! కానీ పెట్టుబడులే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. వారిని ఆదుకోవడంలో అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలేదు. బ్యాంకులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్‌కు అవసరమైన పంట రుణాలు ఇవ్వాల్సిన ఉన్నా ఇప్పటిదాకా దిక్కులేదు. అసలు రాష్ట్ర పంటల రుణ ప్రణాళికే ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే బ్యాంకుల వారీగా లక్ష్యాలు ప్రకటించాలి. కానీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు మళ్లీ ప్రైవేటు అప్పుల వైపే చూస్తున్నారు.
సన్న, చిన్నకారు రైతులకు ఇక్కట్లు
గతేడాది కంటే ఈసారి ఖరీఫ్ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 2016–17లో ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18లో 1.08 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటారని అంచనా. వీరిలో సన్న, చిన్నకారు రైతులే 50 లక్షల మంది. మధ్య తరహా రైతులు 8 లక్షల మంది ఉంటారు. వీరే అధికంగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. గత లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఈసారి ఈ సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమంది రైతులు సాగు చేస్తుంటే వారికి సకాలంలో రుణ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.3 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేసినట్లు సమాచారం.
రైతు ఖాతాలకు చేరని రుణమాఫీ
ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినా రైతు ఖాతాల్లోకి చేర్చడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. చివరి విడత రూ.4 వేల కోట్లు విడుదల చేయగా.. ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లోకి చేరాయి. మిగిలిన సొమ్ము రైతు ఖాతాలకు చేరలేదని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అంటూ విభజన లేకుండా లబ్ధిదారులైన రైతులందరి బ్యాంకు ఖాతాలకు సొమ్ము విడుదల చేశారు. ఈసారి అలాకాకుండా ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చాకే సొమ్ము విడుదల చేస్తామని మెలికపెట్టారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతుల సంఖ్య తేలని బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది కేంద్రం నుంచి వచ్చిన ఇన్‌ఫుట్ సబ్సిడీ సొమ్ములో మిగిలిన రూ. 350 కోట్లు కూడా రైతు ఖాతాల్లో జమచేయలేదు.
ఖరారు కాని పంటల బీమా
వచ్చే ఖరీఫ్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయశాఖ టెండర్లు పిలిచింది. మూడు క్లస్టర్లను చోల ఎంఎస్ కంపెనీ దక్కించుకోగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు ఒక్కో క్లస్టర్ చొప్పున దక్కించుకున్నాయి. కానీ వ్యవసాయ శాఖ ఈ టెండర్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు ప్రీమియం చెల్లించడానికి వీలుపడదు. మరోవైపు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని చెప్పే సర్కారు ఇప్పటివరకు యంత్రాల ధరలు ఖరారు చేయలేదు. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ధరలను ఖరారు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతీ లేదు.
రుణమాఫీ పైసలు అందలేదు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకు నుంచి ఇంకా నాలుగో విడత రుణమాఫీ అందలేదు. బ్యాంకులకు వెళ్తే నిబంధనలు చెబుతున్నరు. నాలుగో విడత రుణమాఫీ పైసలు ఇవ్వాలని అడిగితే.. రుణమాఫీ మొత్తం చెల్లించి రెన్యూవల్ చేసుకుంటేనే ఇస్తమని అంటున్నరు. పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది.
– చిద్రాపు రమేశ్, ఖాజాపూర్ రైతు
ఇబ్బందులు పడుతున్నం
విత్తనాలు వేసుకునే సీజన్ వచ్చింది. ఇప్పటి వరకు బ్యాంకు రుణం అందలేదు. రుణం కోసం బ్యాంకుకు వెళితే అప్పుడూ ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలి.
– రాములు, ఉదండాపూర్, జడ్చర్ల మండలం