రుణమాఫీ ఆలస్యం
- తొలి విడత పరిశీలించాకే చెల్లింపులు
- పది ప్రత్యేక బృందాల ఏర్పాటు
- ఈ నెల ఆఖరులో నివేదిక సమర్పణ
- ఆ తర్వాతే రైతుల ఖాతాల్లో రెండో విడత జమ
- 10 ప్రత్యేక బృందాల ఏర్పాటు
- ఆ తర్వాతే రైతుల ఖాతాల్లో
- రెండో విడత జమ
హన్మకొండ : రుణమాఫీకి మళ్లీ ఎదురుచూపులు తప్పడం లేదు. రెండో విడత విడుదలయ్యే రుణమాఫీ నిధులతో ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేయూలని భావించిన రైతులకు ఆశాభంగమే మిగిలింది. మొదటి విడత రుణమాఫీ సక్రమంగా జరిగిందా.. అవకతవకలు చోటుచేసుకున్నాయూ.. అనర్హులు లబ్ధి పొందారా వంటి అంశాలను నిశిత పరిశీలన చేసిన అనంతరమే రెండో విడత చెల్లింపులు చేపట్టేలా జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. పరిశీలనల నివేదిక ఈ నెల చివరి వరకు అందజేయూలని అధికారులను కలెక్టర్ కరుణ ఆదేశించినప్పటికీ... పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో రుణమాఫీ రెండో విడత చెల్లింపులు జిల్లాలో మరింత ఆలస్యం కానున్నట్లు స్పష్టమవుతోంది.
ఒక్కో బృందంలో ఐదుగురు..
రుణమాఫీ మొత్తంలో 10 శాతం ర్యాండమ్‌గా పరిశీలించిన తర్వాతనే రెండో విడత రుణమాఫీ రైతులకు అందనుంది. రుణమాఫీ పరిశీలనలకు జిల్లాలో పది ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, బ్యాంక్, ఎస్‌టీఓ, ఆడిట్ అధికారులు ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. అయితే ఎస్‌టీఓ, ఆడిట్ అధికారుల కొరత ఉండడంతో ట్రెజరీ శాఖ నుంచి ఐదుగురు అధికారులను మాత్రమే పంపనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం తనిఖీ బృందాల సంఖ్యను తగ్గిస్తుందా, అందుబాటులో ఉన్న వారితో తనిఖీలు నిర్వహిస్తుందా అనేది తేలాల్సి ఉంది. జిల్లా అధికారులు 4,13,523 మంది రైతులను రుణమాఫీకి అర్హులుగా గుర్తించగా.. మొదటి విడతలో జిల్లాకు రూ.472 కోట్ల నిధులు వచ్చాయి. రుణాలు రెనివల్ చేయకపోవడం, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండడం వంటి కారణాలతో కొంత మంది రైతులు రుణమాఫీ పొందలేక పోయారు. దీంతో జిల్లాలో దాదాపు రూ.11 కోట్ల రుణమాఫీ నిధులు మిగిలిపోయాయి. రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వాదేశాల మేరకు లొసుగులు లేకుండా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అరుుతే ఈసారి వర్షాలు సకాలంలో కురువడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల చుట్టు తిరిగినా.. రుణాలు లభించకపోవడంతో అదునులోపు విత్తనాలు వేసుకోవాలనే ఆత్రుతతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారు. దీంతో రైతు సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రైతులు అప్పులు చేసిన తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో జమ చేయడం ద్వారా వారికి ఒరిగే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముందుగా రెండో విడత రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాలో జమచేసి... వారు పెట్టుబడులకు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.