ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు
హిందూపురం అర్బన్: ‘‘చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తాం.. నేతన్నకు అండగా ఉంటాం’’ అంటూ ఓట్లు దండుకున్న పాలకులు, ఆ మేరకు రుణమాఫీ చేయకపోవడంతో కడుపుమండిన వారంతా రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆక్రోశాన్నివెళ్లగక్కుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో చేనేతల వెతలు అన్నీ ఇన్నీ కావు. రుణమాఫీ వర్తించలేదని ఎన్నోమార్లు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వారంతా సోమవారం హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుటే నిరసనకు దిగారు.
అర్జీలిచ్చి.. అలిసిపోయి..
ఈ సందర్భంగా పలువురు చేనేతలు మాట్లాడుతూ.. 2012లో డబ్ల్యూసీసీ పథకం కింద హిందూపురం ప్రాంతంలోని చేనేతలంతా బ్యాంకుల్లో రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నామన్నారు. మగ్గం పనులు లేక పస్తులుంటున్నా వడ్డీలు కడుతూ వచ్చామన్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టీడీపీ చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ ప్రకటించిందనీ, అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా చేనేతల రుణాలు మాఫీ చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని కలెక్టర్, ఏడీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమని వాపోయారు. హిందూపురం మండలం, పరిసర గ్రామాల్లో సుమారు 155 మంది చేనేతలకు రుణమాఫీ కాలేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లామనీ.. ఆయన జిల్లా «అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో రుణాలు మాఫీ అయ్యేలా చూస్తామంటూ హామీలిచ్చారన్నారు. అయితే నెలలు దాటినా రుణాలు మాఫీకాలేదన్నారు. చేనేతల నిరసన సుమారు అరగంట పాటు సాగిన తర్వాత తీరిగ్గా ఇంట్లోంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పీఏ వారి నుంచి మరోసారి వినతులు తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పంపారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కిష్టప్ప, దేవరాజు, నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment