
చెంప ఛెల్లుమనిపించి ఆగ్రహంతో ఊగిపోతున్న బాలయ్య
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించాడు.
ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు. ఎండ వేడిమికి తోడు, ప్రచారంలో జనం కూడా పెద్దగా లేకపోవడంతో చిర్రెత్తిన బాలయ్య.. ఓ అభిమాని ఫొటో క్లిక్‌మనిపించడంతో సహనం కోల్పోయాడు. ఫొటోలు తీయవద్దు అన్నానా.. అంటూ చెంప మీద కొట్టారు. అభ్యర్థి కుటుంబసభ్యులు అందరినీ బయటకు పంపుతుండగా.. ‘ఏయ్ ఫొటో ఎరేజ్ చెయ్..’అంటూ మరోసారి అతనిపై చేయి చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన టీడీపీ నేతలు అతడిని సముదాయించి తిరిగి బాలకృష్ణతో ఫొటో తీయించి పంపడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment