
ఫైల్ ఫోటో
హిందూపురం టౌన్: నియోజకవర్గ ప్రజల గోడు వినిపించుకునేలా ఎమ్మెల్యే బాలకృష్ణకు బుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కోరాలని టీడీపీ నాయకులకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సూచించారు. సోమవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాలు తప్ప ప్రజల సమస్యలపై బాలకృష్ణకు ధ్యాసేలేదని మండిపడ్డారు.
ఆరు నెలలకోసారైనా ఎమ్మెల్యేను హిందూపురానికి తీసురాగలరా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సినిమా హిట్ అంటూ భారీ వసూళ్లు వస్తున్నాయని మాట్లాడుతున్న బాలకృష్ణ.. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎమ్మెల్యే విధులు, కర్తవ్యాలు చదివైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఓటీఎస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం–ఓటీఎస్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఓటీఎస్‌పై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నామమాత్రపు రుసుముతో గృహంపై ఎంతమేర రుణం ఉన్నా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్‌మెంట్) ద్వారా మాఫీ చేసి సంపూర్ణ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
రుణవిముక్తి పొందిన లబ్ధిదారులు తమ ఇంటిని ఇతరులకు బదలాయింవచ్చని, ఇంటిపై బ్యాంకు రుణాలు పొందవచ్చని తెలిపారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటీఎస్ పథకం ఎందుకు మంచిది కాదో టీడీపీ నాయకులు చెప్పాలని, హిందూపురంలో బాలకృష్ణతోనే తాము చర్చకు సిద్దమని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.
సూగూరు మరువ వద్ద శ్రమదానం
పట్టణంలోని సూగూరు మరువ వద్ద ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి శ్రమదానం చేశారు. గొడ్డలి చేతపట్టి కంపచెట్లను, పిచ్చి మొక్కలను తొలగించారు. చెరువు కట్టల పటిష్టతను, మరువ నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గుర్తుతెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సడ్లపల్లి చెందిన వారిని ఎమ్మెల్సీ పరామర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మారుతీరెడ్డి, కోఆప్షన్ మెంబర్ రహమత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment