శృతి తప్పిన 'నైరుతి' | Rain drought | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 3:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Rain drought - Sakshi

సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాదీ ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. గత ఏడాది వర్షాభావం వల్ల నష్టాలు మిగల్చగా ఈ ఏడాది ఆలస్యపు వర్షాలతో రైతులను చిక్కుల్లోకి నెట్టా యి. ఈ సంవత్సరం ప్రస్తుత సీజన్‌లో ఆగస్టు మొదటి వారం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉండగా, చివరలో కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. చాలా వరకు ఎండిపోయిన పంటలను ఈ వర్షాలు ఏమాత్రం బతికించలేకపోయాయి. జూన్‌ ఏడో తేదీన సకాలంలో రాష్ట్రంలో ప్రవేశించిన ‘నైరుతి’ ఆరంభంలో వర్షాలతో ఆశలు రేకెత్తించింది. జూన్‌ చివరి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకూ వరుణుడు మొహం చాటేయ డంతో అరకొరగానే పంటలు సాగయ్యాయి. చినుకు జాడలేక జూన్‌లో విత్తిన పంటలు జూలైలో చాలా వరకూ ఎండిపోయాయి. పత్తి, వేరు శనగ, సజ్జ, జొన్న, కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. రాయలసీమలో ఈ పంటలు గిడస బారి భూమికి ఆనిన సమయంలో.. ఆగస్టు రెండో వారంలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో పంటలు పచ్చగా మారినా దిగుబడిపై దుష్ప్రభావం పడింది. 

ఆగస్టు మొదటి వారం వరకూ లోటే..
ఆగస్టు రెండో వారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 16 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌లో42 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఆగస్టు మొదటి వారం వరకూ 45 శాతం విస్తీర్ణంలో కూడా విత్తనం పడలేదు. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అయితే సాధారణం కంటే 20 శాతం పైగా లోటు వర్షపాతం ఉండింది. దీంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. రాయలసీమలో 9.20 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా నాలుగు లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. అనంతపురంలో వేరుశనగ సాగు దారుణంగా పడిపోయింది.

సాగైన విస్తీర్ణంలోనూ దిగుబడి సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదని రైతులతో పాటు అధికారులు కూడా చెబుతున్నారు. ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్‌లో సాగైన విస్తీర్ణంతో కలిపితే ఖరీఫ్‌లో సుమారు 85 శాతం వరకు విత్తనం పడింది. అయితే చివర్లో వేసిన పంటలను వ్యవసాయ శాఖ పరిభాషలో లేట్‌ ఖరీఫ్‌ లేదా ముందస్తు రబీ అంటారు. ఆగస్టు మూడో పక్షంలో, సెప్టెంబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో లోటు పూడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. 

సాంకేతికంగా సగటు వర్షపాతం నమోదు
రాష్ట్రంలో 556 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం (30 ఏళ్ల సగటు) కాగా, 567.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 19 శాతం ఎక్కువైనా, తక్కువైనా సాధారణ వర్షపాతంగానే వాతావరణ శాఖ పరిగణిస్తుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 33.1 శాతం, వైఎస్సార్‌ జిల్లాలో 23.4 శాతం అధిక వర్షం కురిసింది. మిగిలిన అన్ని జిల్లాలు సాధారణ సగటు వర్షపాత జాబితాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 26 మండలాల్లో కరువు పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 8.8 శాతం సగటు వర్షపాత లోటు ఉంది. తూర్పు గోదావరి జిల్లా 8.4 శాతం వర్షపాత లోటుతో రెండో స్థానంలో ఉంది.

కృష్ణా జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ‘రాజస్తాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నైరుతి నిష్క్రమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పశ్చిమ/ నైరుతి గాలులు కొనసాగుతున్నాయి. ఇవి ఆగిపోయి తూర్పు/ఈశాన్య గాలులు ఆరంభమైతే నైరుతి నిషŠక్రమించినట్లవుతుంది. ప్రస్తుతం అరేబియా మహా సముద్రం నుంచి గాలులు వీస్తున్నాయి. ఇవి వస్తున్నంత కాలం నైరుతి కొనసాగుతున్నట్లే. ఇవి దిశ మారి బంగాళాఖాతం నుంచి ఈశాన్య/ తూర్పు దిశగా గాలులు వస్తాయి. అప్పుడు నైరుతి నిషŠక్రమంచినట్లు నిర్ధారిస్తాం’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధిపతి డాక్టర్‌ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

ఆదుకుంటుందా? టెక్నాలజీతో తప్పుకుంటుందా?
ఈ సీజన్‌లో (జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ నాటికి) రాష్ట్రంలో 247 మండలాల్లో వర్షపాత లోటు ఉంది. తర్వాత వర్షాలు కురవడంతో ప్రస్తుతం వర్షాభావ మండలాల సంఖ్య 93కు తగ్గిపోయింది. దీంతో కరువు మండలాల ప్రకటనకు వేటిని పరిగణనలోకి తీసుకుంటారనే అంశం కీలకంగా మారింది. తాజా కరువు నిబంధనావళి ప్రకారం జూలై చివరి వరకూ కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ మండలాలు కరువు జాబితాలోకి వస్తాయి. దీంతో జూన్, జూలైలో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయిన, పంటల దిగుబడి పడిపోయి నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ పొందే వెసులుబాటు లభిస్తుంది.

రుణాలు రీ షెడ్యూల్‌ అవుతాయి. కేంద్రం నుంచీ రాష్ట్రానికి సాయం అందుతుంది. కరువు మండలాల ప్రకటనకు వర్షపాత లోటుతో పాటు డ్రైస్పెల్‌ (వర్షానికి మరో వర్షానికి మధ్య విరామం), పంటల సాగు విస్తీర్ణం, భూమిలో తేమ శాతం, పంట దిగుబడి.. తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. అయితే వర్షపాత లోటు అనేది ప్రథమ ప్రాధాన్య అంశం. గతంలో ఒక వర్షానికి మరో వర్షానికి మధ్య విరామం 21 రోజులు ఉంటేనే డ్రైస్పెల్‌ ఉన్నట్లు డ్రాట్‌ మాన్యువల్‌ (కరువు నిబంధనావళి) పరిగణనలోకి తీసుకునేది. కొత్త మాన్యువల్‌ ప్రకారం 21 రోజుల మధ్య వర్షం కురిసినా సాధారణం కంటే 50 శాతం లోటు ఉంటే పరిగణనలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా సాంకేతిక కారణాలు చూపి.. ఇప్పటి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం రైతులు నిండా మునిగినట్లే. ఈ విషయంపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు.  

ఈ పరిస్థితి రబీకి అనుకూలం..
అక్టోబర్‌ ఒకటో తేదీ (ఆదివారం) నుంచి రబీ సీజన్‌ ఆరంభమైంది. సెప్టెంబర్‌ చివర్లో, అక్టోబర్‌ ఆరంభంలో కూడా వర్షాలు కురుస్తున్నందున రబీ పంటల సాగుకు పరిస్థితి అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 40.64 లక్షల హెక్టార్లకన్నా ఆరు లక్షలు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రబీ సీజన్‌లో 24.63 లక్షల హెక్టార్లను పూర్తిగా సాగులోకి తీసుకువచ్చి ఖరీఫ్‌ లోటును భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వేరుశనగ, శనగ, కంది, మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, అలసంద, ఉలవ, జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి మెట్ట పంటల సాగుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అన్ని రకాల విత్తనాలను సిద్ధం చేసింది.

మొక్కజొన్న, సజ్జ, ఆముదం, జొన్న, పొద్దుతిరుగుడు హైబ్రీడ్‌ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. జాతీయ ఆహార భద్రతా పథకం పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వరి విత్తనాలను క్వింటాల్‌కు రూ.500 రాయితీ చొప్పున పంపిణీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల శాఖ రాష్ట్రంలోని సాగు ఆధారంగా ఎరువులను సకాలంలో రైతులకు అందించేందుకు మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ సంస్థగా నియమించింది. ఆధార్‌ అనుసంధానిత ఇ–పాస్‌ పద్ధతిన ఎరువులను డీలర్లు సరఫరా చేస్తారు. అక్టోబర్‌ నెలకు కావాల్సిన 2.30 లక్షల టన్నుల పొటాష్, నైట్రోజన్, భాస్వరం ఎరువుల్ని సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలో సుమారు 7 వందల క్లస్టర్లలో ప్రభుత్వం ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి, బహుళ ప్రయోజక విస్తరణాధికారిని నియమించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement