సాగని ఖరీఫ్
విశాఖపట్నం: తొలకరి ఆరంభంలో అదరగొట్టింది. ఊహించని విధంగా వర్షాలు కురిపించింది. ఇక ఈ సీజనంతా ఇలాగే ఉంటుందని రైతన్న మురిసిపోయాడు. ఈ ఏడాది కాలం కలిసొస్తుందని సంబరపడ్డాడు. అయితే ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. హడావుడి చేసిన వరుణుడి జాడ కానరాలేదు. దాదాపు మూడు వారాల నుంచి ముఖం చాటేస్తున్నాడు. ఆయన స్థానంలో భానుడు ప్రవేశించాడు. ఎడాపెడా ఎండలతో దడపుట్టించాడు. ఫలితంగా తొలినాళ్లలో 32 వేల హెక్టార్లలో వేసిన వరి నారు అరకొరగా ఎదుగుతోంది. అక్కడక్కడా ఎండిపోతోంది. వాస్తవానికి ఈ సమయానికి, దమ్ములతో వరినాట్లు ముమ్మరంగా సాగాలి. రైతు, కూలీలు బిజీబిజీగా ఉండాలి. కానీ అన్నదాత ఆకాశం వైపే చూస్తున్నాడు. రైతు పిలుపు కోసం కూలీ ఎదురు చూస్తున్నాడు.
ఖరీఫ్ సీజను ఆరంభమై నెలన్నర అవుతున్నా ఇప్పటిదాకా జిల్లాలో సుమారు 15 వేల 600 హెక్టార్లలో (15 శాతం) మాత్రమే వరినాట్లు పడ్డాయి. అది కూడా ఈ వారంలోనే ఊపందుకున్నాయి. వారం రోజుల క్రితానికైతే కేవలం 632 హెక్టార్లలోనే వరి సాగయింది. ఏజెన్సీలో కొద్దిరోజుల నుంచి ఆశాజనకంగా కురుస్తున్న వర్షాల అక్కడ వరినాట్లు ముమ్మరవడం వల్ల 15 వేల హెక్టార్లకు చేరుకుంది. జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా మూడు వేల 68 హెక్టార్లు. గత ఏడాదికంటే పరిస్థితి దిగజారింది. మూడు వారాలుగా పత్తా లేకుండా పోయిన నైరుతి రుతుపవనాల్లో ఇప్పుడిప్పుడే కదలిక వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వానలైనా మేలు చేస్తాయన్న గంపెడాశలతో రైతన్నలున్నారు.
చెరకు సాగు నయం..
చెరకు పంట పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 37,828 హెక్టార్లు. ఇందులో ఇప్పటిదాకా మూడొంతులు (75 శాతం) అంటే సుమారు 28 వేల హెక్టార్లలో చెరకు సాగు జరిగింది. అయితే చెరకు పంట బోర్లు, జలాశయాల కింద ఎక్కువగా సాగవుతుంది. అందువల్ల వర్షాభావ ప్రభావం దీనిపై అంతగా చూపడం లేదు. వర్షాలు కురిస్తే వరి సాగుతో పాటు జొన్న, మొక్కజొన్న, గంటి (సజ్జ), రాగి, చిరుధాన్యాలు, పప్పు దినుసుల పంటలు ఊపందుకుంటాయని వ్యవసాయ శాఖ
జేడీ వెదురుపాక సత్యనారాయణ
‘సాక్షి’కి తెలిపారు.