సాక్షి, అమరావతి: చినుకు జాడ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న రైతుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు. మెట్ట పంటలతో పాటు మాగాణుల్లో నాట్లు వేయడం మొదలైంది. అడుగంటిన జలాశయాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతుండటంతో నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే వారంలో మంచి వానలు పడే అవకాశం ఉండటం కూడా రైతుల్లో భరోసా నింపుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రుతుపవనాలు విస్తరించి ఉండడం కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో విత్తన పంపిణీ నిరాటంకంగా సాగుతోంది.
వర్షాధారిత పంటలు వేయడం ఊపందుకుంది. జొన్న, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల పంటల సాగు సైతం పుంజుకుంది. మొత్తం సాగు విస్తీర్ణం 42,04,218 హెక్టార్లు కాగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను 38,30,466 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఇందులో ఇప్పటికి 19,73,041 హెక్టార్లలో విత్తనాలు పడాల్సి ఉంటే సుమారు 13.84 లక్షల హెక్టార్లలో విత్తినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప వంటి పంటలు 26 శాతం నుంచి 50 శాతం వరకు వేయడం పూర్తయింది. చెరకు నాటు దాదాపు 75 శాతం పూర్తయింది.
డెల్టాలో ముమ్మరంగా నాట్లు...
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాట్లు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ పెట్టుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటికి 6.27 లక్షల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికి 4.81 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పెరుగుతుండటంతో అనుకున్న లక్ష్యం మేరకు వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వేరుశనగ పరిస్థితి ఇలా...
వేరుశనగను ఈ సీజన్‌లో 9.16 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 7.53 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటికి 5.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలు పడాల్సి ఉంటే 2.43 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. మంచి వర్షాలు పడితే వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్టపంటలు, ఇతర ఆహార ధాన్యాల సాగు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు.
త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం..
గత వారంలో 36 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఈ వారానికి 27 శాతానికి చేరింది. మున్ముందు ఇది మరింత తగ్గి సాధారణ స్థితికి చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌లో నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 556 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఇప్పటికి 245 మిల్లీమీటర్లు కురవాలి. కానీ ఇప్పటికి 178.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్‌లో జూలై 31 వరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదవలేదు. ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మినహా మిగతా మూడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం మినహా కృష్ణా, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. రాయలసీమలో చిత్తూరు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి.
వరి రైతులకు సూచనలు
ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆయా మండలాలకు సిఫార్సు చేసిన భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలైతే 25, 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుంటే 20 నుంచి 25 రోజుల నారు నాటుకోవాలి. ప్రతి 2, 3 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఒకసారి, పిలకల దశలో రెండో సారి, అంకురం దశలో మూడో సారి వేసుకోవాలి. పొటాష్‌లో సగభాగాన్ని మొదటి దశలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. కలుపు నివారణకు నాట్లు వేసిన 3, 5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి ఒకటిన్నర లీటర్ల బుటాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా ఆక్సాడయార్జిల్ 35– 50 గ్రాములు లేదా బెన్‌సల్ఫూరాన్ మిథైల్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment