ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్
ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిన వ్యవసాయ శాఖ
రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు.
అయితే.. పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్‌ఎస్‌లలో ఫౌండేషన్, సర్టిఫైడ్ సీడ్‌రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్‌ఎస్) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్ సీడ్ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్ సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు.
బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్‌డీఎల్‌ఆర్ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్‌జీఎల్ 2537 వంటి ఫైన్ వెరైటీస్‌కు చెందిన ఫౌండేషన్ సీడ్ కిలో రూ.45, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్ సీడ్ కిలో రూ.40, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్‌తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.
రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం
ఖరీఫ్ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.
ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఖరీఫ్ సీజన్‌కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్ మొదలైంది.
– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్
పంపిణీకి విత్తనాలు సిద్ధం
సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment