*అందని సాగునీరు
*తూర్పు కృష్ణాలో ఎండిపోతున్న నారుమళ్లు
*చేతిపంపు నీటితో నారుమళ్లు తడుపుతున్న వైనం
*మొలకెత్తని వెదజల్లిన విత్తనాలు
*రెండో పంటపై ఆశలు గల్లంతు
*పశ్చిమ కృష్ణాలో వాడుబట్టిన పత్తి, మొక్కజొన్న పైరు
కాలువలు అడుగంటాయి. వరుణుడు దోబూచులాడుతున్నాడు. ఫలితంగా తూర్పు కృష్ణాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. వెదజల్లిన విత్తనాలు నీరుతడిలేక కుళ్లిపోతున్నాయి. గుల్లపంపు, ఆయిల్ ఇంజిన్లకు నీరు అందడంలేదు. దిక్కుతోచని స్థితిలో కొన్నిచోట్ల కూలీలతో చేతిపంపు నీటిని కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి నారుమళ్లు తడుపుతున్నారు. వరి సాగు ప్రారంభం కాలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో సాగు సాగేదెలా.. అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చల్లపల్లి : జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా, అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికి 45వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. గత ఏడాది ఇదే కాలానికి రెండు లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు మురుగుబోదుల్లో నీరు చేరింది. వర్షంనీరు, పంటకాలువల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లు, గుల్లపంపులతో తోడుకుని పలుచోట్ల రైతులు నారుమళ్లు పోసుకుంటున్నారు.నాలుగురోజులుగా చాలా ప్రాంతాల్లో రైతులు ఇలా ఇంజిన్ల ద్వారా నారుమళ్లు పోసుకోవడంతో మురుగుబోదులు, పంటకాలువల్లోనూ నీరు అయిపోయింది.
కొన్నిచోట్ల ఆయిల్ ఇంజిన్లకు నీరు అందక నారుమళ్లు పోసుకోలేని పరస్థితి నెలకొంది. దీంతో నారుమడి కోసం నానబె ట్టిన వడ్లను ఏమిచేసుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. దివిసీమలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాలతోపాటు మొవ్వ, పామర్రు, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో పంటకాలువలు, మురుగుబోదులు అడుగంటి పోయాయి. ఆయిల్ ఇంజిన్లతో తోడుకునేందుకు నీరు అందకపోవడంతో ఈ ప్రాంత రైతులు అల్లాడుతున్నారు.
నారుమళ్లు రక్షించుకునేందుకు నానాపాట్లు..
ఎండిపోతున్న నారుమళ్లను రక్షించుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల కూలీలను పెట్టుకుని గ్రామాల్లోని చేతిపంపుల నుంచి నారుమళ్లకు నీరు పోయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లు, రిక్షాలు, ఆటోలపై ఆయిల్ పీపాల ద్వారా నారుమళ్లను తడుపుకుంటున్నారు.
సాగునీరు అందక పోవడంతో నీటిని తరలించేందుకే ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. వెదజల్లే పద్ధతిలో జిల్లాలో ఇప్పటివరకూ 28వేల ఎకరాల్లో సాగుచేయగా, తడి అందక కొన్నిచోట్ల గింజలు కుళ్లిపోతున్నాయి. గత్యంతరం లేక వెదజల్లిన కొన్ని ప్రాంతాల్లో మళ్లీ నారుమళ్లు పోసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేశారు.
అదును తప్పుతోంది
ఏటా ఆగస్టు మొదటి వారంలో జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యేయి. ఈ ఏడాది సాగునీరు అందక పోవడంతో ఆగస్టు నెలాఖరు వరకూ నారుమళ్లు పోసుకోవడం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఎక్కువగా బీపీటీ, 1060 రకాలను సాగుచేస్తుండగా ఇవి 145 రోజులకు పంట చేతికొస్తుంది. ఆగస్టు నెలాఖరుకు నారుమళ్లు పోస్తే వచ్చే ఏడాది జనవరిలో పంట చేతికొస్తుంది.
అదను తప్పడం వల్ల తెగుళ్లు బారిన పడటంతోపాటు పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో పంటచేతికొస్తే రెండోపంట మినుము సాగుకు అనుకూలంగా ఉంటుంది. సాగులో జాప్యం జరిగితే అపరాల పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంటసాగు చేసే పరిస్థితి ఉండదని పలువురు రైతులు చెబుతున్నారు.
సాగునీరు ఎప్పటికొచ్చేనో..?
కృష్ణాడెల్టాకు పది రోజులపాటు రోజుకు 12వేల క్యూసెక్కులు సాగునీటిని విడుదల చేయాలని కృష్ణానీటి యాజమాన్య బోర్డును కోరినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో దీనికి ఆమోదం లభించవచ్చని చెప్పారు. మంత్రి చెప్పినట్లు అయినా బచావత్ ట్రి బ్యునల్ కేటాయింపులకు లోబడి నీటిని నాగార్జున సాగర్ నుంచి విడుదల చేయడానికి కూడా ఐదారు రోజులు పట్టే అవకాశం ఉంది.
సాగర్ నీరు ప్రకాశం బ్యారేజీకి, అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మరో వారం రోజుల సమయం పడుతుంది. ఈలోగా పదిరోజుల సమయం అయిపోతుంది. నారుమళ్లకే నీరందక ఎండిపోతుంటే నాట్లు వేసేందుకు నీరెక్కడి నుంచి వస్తుందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖరీఫ్ సాగుకు సరిపడా సాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఆశలు ఆవిరి!
Published Wed, Aug 6 2014 9:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement