కొద్ది రోజులుగా విజయనగరం వద్దే తిష్ట
ముందుకు కదలని రుతుపవనాలు
దీంతో ఉష్ణతాపం.. అరకొర వానలు
రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రుతుపవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి విస్తరించాయి. వసూ్తనే మంచి వర్షాలను కురిపించాయి. వారం రోజులు చురుగ్గానే ఉన్నాయి. తర్వాత ఉత్తర కోస్తా వైపు కదిలి కొద్ది రోజల క్రితం విజయనగరం వరకు చేరగానే, ముందుకు విస్తరించకుండా అక్కడే తిష్టవేశాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పైగా, వర్షాకాలంలో వేసవిని తలపించే ఎండలు కాస్తున్నాయి.
సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ వడగాడ్పులూ వీస్తున్నాయి. ప్రధానంగా తీర ప్రాంత జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు విజయనగరం నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించకపోవడానికి కొన్నాళ్లుగా కొనసాగుతున్న అధిక పీడన ద్రోణి (రిట్జ్) కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అల్పపీడన ద్రోణి ఏర్పడితే వర్షాలు కురుస్తాయి.
కానీ, అధిక పీడన ద్రోణి ఉంటే అందుకు విరుద్ధంగా వర్షాభావ పరిస్థితులేర్పడతాయని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో రుతు పవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ఉత్తర కోస్తాంధ్రలో ఉష్ణ తీవ్రత ఉంటుందని ఆయన తెలిపారు.
కొనసాగుతున్న ఆవర్తనాలు..
ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒకటి, రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరొకటి ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే గురు, శుక్రవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment