ఇదేం కక్కుర్తి
♦ వర్షా కాలంలో కుంటలనునీరు-చెట్టు పేరుతో తవ్వేస్తున్నారు
♦ ఏళ్ల తరబడి బాగున్న రివిట్‌మెంట్‌ను తీసివేసి బంక మట్టివేశారు
♦ సాగు భూములు ఉన్న రైతులకు సమాచారం లేదు
ఆ రైతులు ఆరేళ్లుగా కరువుతో అల్లాడిపోయారు. గతేడాది నవంబర్‌లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు చేరడంతో కష్టపడి కొద్దిమేర భూములను సాగులోకి తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు పర్వాలేదనిపిస్తున్నాయి. ఇంతలోనే అధికారపార్టీ నేతలకు ఆ చెరువులపై కన్నుపడింది. నీరు-చెట్టు పేరుతో బాగున్న చెరువుకట్టలను తొలగిస్తూ ఇష్టానుసారంగగా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో సీజన్‌లో ఇలా చెరువు కట్టను తొలగించి తమ పొట్టకొడుతున్నారని అధికారులకు రైతులు ఎంత మొరపెట్టుకున్నా వారు మాత్రం అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారు.
లక్కిరెడ్డిపల్లె : ఈ ఏడాది ఖరీఫ్ కాస్త ఆశాజనకంగా ఉంది. సకాలంలో వర్షాలు పడటంతో రైతులు పంటల సాగును చేపట్టారు. లక్కిరెడ్డిపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ఖరీఫ్‌లో వర్షపాతం అధికంగా నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సమాచారం మేరకు ఇప్పటికే చెరువులు, కుంటలు, బావులు, బోరుబావుల కింద వరినారు పోసుకొని కోటి ఆశలతో రైతన్న ఎదురుచూస్తున్న తరుణంలోనే గద్దల్లా టీడీపీ నేతలు వాలిపోయారు. ఎక్కడికక్కడ కుంటలు, చెరువులను మరమ్మతుల పేరుతో ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నారు. నీరు-చెట్టు పేరుతో బాగున్న కుంటలను ఇటాచీలు, జేసీబీలు పెట్టి మట్టితో పాటు ఎన్నో ఏళ్లుగా ఉన్న రాతి కట్టడాలను కూడా తొలగిస్తున్నారంటూ ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. దప్పేపల్లె, వీరారెడ్డిగారిపల్లెలకు వెళ్లే మార్గంలో ఉన్న కుంటను ఆయకట్టుదారులకు ఏ మాత్రం సమాచారం లేకుండా ఇటీవల అధికారపార్టీ గ్రామస్థాయి నేత రాత్రికి రాత్రే జీసీబీతో తొలగించడం మొదలుపెట్టాడు.
సమాచారం అందుకున్న రైతులు పరుగున అక్కడికి చేరుకొని బాగున్న చెరువుకట్టను ఎందుకు తొలగిస్తున్నారని నిలదీయడంతో కట్టను వెడల్పు చేసి బాగు చేస్తున్నామని బదులిచ్చాడు. వర్షాలు పడుతున్నప్పుడు కట్టపనులు చేపడితే ఎగువన ఉన్న చెరువు నిండి దిగువన ఉన్న ఇక్కడకు వస్తాయని, కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు తెలియజెప్పారు. ఎంతచెప్పినా అతను వినిపించుకోకుండా మొత్తం చెరువుకట్టకు ఉన్న రాతికట్టను తొలగించారు. అదేవిధంగా చెరువుకట్టకు దిగువున ఉన్న తమ పొలాలు ఆక్రమణకు గురవుతాయని ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు.
ఎన్నో ఏళ్ల కిందట చెరువుకట్టపై ఎర్రమట్టితో నిర్మించిన రోడ్డు స్థానంలో ప్రస్తుత కాంట్రాక్టర్ చెరువులోని బంకమట్టిని వాడుతున్నాడు. వీరారెడ్డిగారిపల్లె, చిన్నాగిరెడ్డిగారిపల్లె వాసులు పాఠశాలలకు గాని, పట్టణానికి వెళ్లాలంటే ఈ రోడ్డు మార్గమే ఆధారం. చిన్నపాటి వర్షం పడినా బంకమట్టి బురదమయమై చెరువులోకిగానీ, పొలాలల్లోకి గానీ జారి పడిపోయే ప్రమాదం వుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ఆయకట్టుదారులు లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంపై వారు ఆవేదన వక్తం చేస్తున్నారు.