అమలాపురం : ‘సాగు లాభసాటి కావాలంటే రైతులు ఆధునిక పద్ధతిలో సాగు చేయాల్సిందే. తూర్పుగోదావరిలో పంట పెట్టుబడిలో సగం కూలీలకే వ్యయమవుతోంది. వ్యవసాయంలో పూర్తిస్థాయి యాంత్రీకరణ వస్తేపెట్టుబడి తగ్గి రైతులు సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. యాంత్రీకరణను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించాలి.’
సాగు సమ్మెపై ప్రభుత్వం నియమించిన మోహన్‌కందా కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫారసు ఇది.
ఇందుకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు ఏటా రూ.కోట్లను ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర్ర పభుత్వం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణకు రాయితీలు కల్పించడం కోసం రూ.5.15 కోట్లు కేటాయించింది. కేంద్రప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద రూ.2.88 కోట్లు, సబ్‌మిషన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం)కింద రూ.1.30 కోట్లు కేటాయించగా మొత్తం రూ.9.33 కోట్లు వచ్చాయి.
రాయితీ కేటాయింపు ఇలా...
ఎస్సీ, ఎస్టీ, మహిళ, చిన్న, సన్నకారు రైతులు కొనుగోలు చేసే చిన్నచిన్న యంత్రాలకు 40 నుంచి 50 శాతం వరకు రాయితీకి అవకాశం ఉంది. పెద్ద రైతులు అంటే మెట్టలో ఐదు ఎకరాలు, మాగాణిలో రెండున్నర ఎకరాలు దాటి భూములున్న రైతులకు 30 నుంచి 40 శాతం వరకు యంత్రాల కొనుగోలుపై రాయితీ లభిస్తోంది. నాట్లు వేసే యంత్రం, సీడ్‌ట్రేలు, లేజర్ గెడైడ్ ల్యాండ్ లెవెలర్ వంటి యంత్రాలు, చిన్న ట్రాక్టర్ల కొనుగోలుపై 50 శాతం వరకు రాయితీకి అవకాశముంది. అదే నాట్లు వేసే యంత్రాలతోపాటు పెద్ద ట్రాక్టరు కొనుగోలు చేస్తే 40 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అంటే రూ.28 లక్షల ఖరీదైన ఈ యంత్రాలకు రూ.12 లక్షల వరకు రాయితీ వస్తుందన్నమాట. అలాగే రూ.23.60 లక్షల ఖరీదు చేసే కంబైండ్ హార్వెస్టర్‌కు అయితే రూ.ఐదు లక్షల రాయితీ వస్తోంది. అయితే పెద్ద యంత్రాలపై రాయితీ పొందాలంటే కనీసం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది.
అంతా ఆన్‌లైన్‌లోనే... :
యాంత్రీకరణ రాయితీలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం ఆన్‌లైన్ చేసింది. రైతులు దరఖాస్తు చేయడం మొదలు వ్యవసాయ శాఖ అనుమతి, యంత్రాల కొనుగోలు, రాయితీల చెల్లింపు వంటి అన్ని దశలూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతాయి. తొలుత రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్లి రూ.20 చెల్లించి రాయితీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి రూ.500 నుంచి రూ.2 వేల వరకు డిపాజిట్ చేయాలి. రైతుల దరఖాస్తులు సంబంధిత ఏఓ కు అక్కడినుంచి జేడీకి, ఆపైన యంత్రాలు సరఫరా చేసే కంపెనీకి వెళతాయి. రైతులు పదేపదే వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ విధానంలో ఎంతమాత్రం ఉండదు.
తగ్గనున్న పెట్టుబడులు
వరిసాగు అనే కాదు, అన్నిరకాల పంటల సాగులో యాంత్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నారుమడులు వేయడానికి ఎకరాకు రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు ఖర్చవుతుంది. అదే యంత్రాల ద్వారా నాట్లు వేస్తే రైతుకు అయ్యేది రూ.మూడు వేలే. ఇక డ్రమ్‌సీడర్ పద్ధతిలో అయితే మరో రూ.500 తగ్గుతుంది. వరి, ఇతర పంటల్లో కలుపు నివారణ పనులు కూలీలతో చేయిస్తే రూ.మూడు వేల వరకూ ఖర్చవుతోంది. ఇదే కోనో వీడర్‌తో ఆ పని చేస్తే ఒక మనిషికి కూలి ఖర్చు (రూ.300) మాత్రమే అవుతుంది. వరిలో కోతలు, నూర్పిళ్లకు సంప్రదాయ విధానంలో ఎకరాకు రూ.ఏడు వేల వరకు ఖర్చవుతోంది. అదే కంబైన్డ్ హార్వస్టర్‌ను అద్దెకు తెచ్చుకుంటే రూ.రెండువేల ఖర్చుతోనే ధాన్యం బస్తాల్లోకి చేరుతోంది. ఈ యంత్రాల వినియోగం వల్ల రైతులకు పంట పెట్టుబడులు గణనీయంగా తగ్గి ఎకరా వరి సాగుకు రూ.18 వేల కంటే తక్కువే వ్యయమవుతుంది. తద్వారా రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుతెన్నులు చూడాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడి తగ్గితే రైతులు లాభాలు పొందే అవకాశముంది.
నిబంధనలు మారిస్తే మరింత మేలు
యాంత్రీకరణ రాయితీకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మారిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా పరిగణించి రాయితీ ఇచ్చేకంటే, జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల్లో భూమి స్థితిగతులను బట్టి యంత్రాలకు రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పెద్ద యంత్రాలను రైతు గ్రూపులకే కాకుండా కొనుగోలు శక్తి ఉన్న భూస్వామి రైతులకు కూడా ఇస్తే స్థానిక అవసరాలకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. కోతల సమయంలో స్థానికంగా ఈ యంత్రాలు లేక కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తెప్పించాల్సి వస్తోందని, దీంతో రవాణాభారం పడుతోందని రైతులు చెబుతున్నారు.
రైతు సంఘాలకే కాకుండా ప్రభుత్వ సహకార సంఘాలకు ఈ యంత్రాలను రాయితీలపై ఇస్తే తాము తక్కువ అద్దెకు వీటిని వినియోగించుకునే సౌలభ్యం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
ఆధునిక సేద్యమే శరణ్యం
Published Thu, Dec 25 2014 12:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement