ఉద్యానవన ‘మాఫీ’ హుళక్కేనా!?
అమలాపురం :‘ఓడ దాటేదాక ఓడ మల్లన్నా.. రేవు దాటించాకా బోడి మల్లన్న’ అన్న చందాన ఉంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు. మాట తప్పడంలో రెండాకులు ఎక్కువే చదివిన చంద్రబాబు.. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని ఆచరణలోకి వచ్చేసరికి తుంగలోకి తొక్కుతున్నారు. మాఫీ భారం తగ్గించుకునే నెపంతో వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తించదని తేల్చిన మంత్రివర్గం వాణిజ్య పంటల రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబు ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదనే విషయాన్ని తేల్చేశారు. ఉద్యానవన పంటల రైతులకు రుణమాఫీ వర్తించదని జీఓ 174లో ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ జీఓపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, జీఓలోని కొన్ని అంశాల్లో మార్పులు చేయిస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యానవన పంటలకు కూడా మాఫీ అమలు చేసే నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు.
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీఓ 174పై చర్చ జరిగింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 31 మధ్యలో అప్పు చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదనే నిబంధనపై రైతు సంఘాలు మండిపడుతున్నందున, దీనిని మార్పు చేయాలనే మంత్రుల సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. జీఓలో కొన్ని సవరణలు చేసి, దాని స్థానంలో జీఓ 181ను విడుదల చేసింది. ఇందులో ఉద్యానవన పంటలకు రుణమాఫీ విషయాన్ని పక్కన పెట్టింది. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన వాణిజ్య పంటల రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హతాశులయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రివర్గ సమావేశంలో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ వర్తింపజేయాలని కొందరు మంత్రులు కోరగా, చంద్రబాబు తిరస్కరించారు. సాధారణంగా వాణిజ్య పంటలకు రుణ అర్హత (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఎక్కువగా ఉంటుంది.
వరికి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.24,500, రబీలో రూ.30 వేలు ఉండగా, వాణిజ్య పంటలకు రూ.50 వేలకు పైబడి ఉంటుంది. పసుపునకు ఎకరాకు రూ.55 వేలు, అరటికి రూ.85 వేలు, కందకు రూ.లక్ష వరకు రుణ అర్హత ఉంది. అందువల్ల రుణమాఫీని ఈ పంటలకు వర్తింపజేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని భావించిన చంద్రబాబు.. మాఫీ నుంచి వీటిని తొలగించారు. కొబ్బరి సాగుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ఎకరాకు రూ.25 వేలు) తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పంట కావడం వల్ల రైతులు దీర్ఘకాలిక (ఎల్‌టీ) రుణాలు పొందుతుంటారు. దీనివల్ల వడ్డీ భారం పడుతుందని, జీరో పర్సెంట్ వడ్డీ వర్తించదని చెప్పి చాలామంది రైతులు తమ కొబ్బరి తోటల్లో సాగు చేసే అంతర పంటలు అరటి, కంద, పసుపు, కూరగాయ పంటలపై స్వల్పకాలిక (ఎస్‌టీ) రుణాలు తీసుకుంటారు. ఇవి కూడా పంట రుణాల్లోకి వస్తున్నా మాఫీ వర్తించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
గతేడాది భారీ వర్షాలు, తర్వాత హెలెన్ తుపాను వల్ల వాణిజ్య పంటల రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. దీర్ఘకాలిక పంట అయినప్పటికీ ఈ తుపాను వల్ల కొబ్బరికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు ఒక్క కోనసీమలోనే సుమారు 80 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. మిగిలిన చెట్లకు సైతం మొవ్వులు విరిగిపోవడం వల్ల రెండేళ్ల పాటు ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకుండా పోయాయి. ఆ నష్ట పరిహారం ఇప్పటి వరకు అందలేదు. అందుతుందన్న నమ్మకం కూడా రైతుల్లో సన్నగిల్లుతోంది. ఈ తరుణంలో రుణమాఫీ కూడా వర్తింప చేయకపోవడంతో ఉద్యానవన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని మాటమార్చి కొంతవరకు భారాన్ని తగ్గించున్నారు. తాజాగా ఉద్యానవన పంటలను మినహాయించి ఆ భారాన్ని మరింత దించుకున్నారు.