AP: పసుపు@రూ.11,750.. ప్రభుత్వ జోక్యంతో నెలలోనే రెట్టింపైన ధర | Turmeric price doubled in a month due to government intervention | Sakshi
Sakshi News home page

AP: పసుపు@రూ.11,750.. ప్రభుత్వ జోక్యంతో నెలలోనే రెట్టింపైన ధర

Published Sat, Aug 12 2023 3:47 AM | Last Updated on Sat, Aug 12 2023 7:11 AM

Turmeric price doubled in a month due to government intervention - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ధర లభిస్తుండడంతో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో శుక్రవారం క్వింటా పసుపు ధర రూ.11,750 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు.

మరోవైపు ఈసారి క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022–23 సీజన్‌లో రాష్ట్రంలో 84 వేల ఎకరాల్లో పసుపు సాగవగా 4 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర  ప్రకటిస్తోంది. 2022–23 సీజన్‌లో పసుపునకు కనీస మద్దతు ధర రూ.6,850గా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.

టీడీపీ ఐదేళ్ల పాలనలో 28,563 మంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, 2019–20 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం 28,724 మంది రైతుల నుంచి రూ.437.24 కోట్ల విలువైన 56,536 టన్నుల పసుపును సేకరించింది.

ప్రభుత్వ చర్యల ఫలితంగా దాదాపు రెండున్నరేళ్లపాటు పసుపు రైతుకు మంచి ధర లభించింది. ఒక దశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది. రబీ 2022–23 సీజన్‌ ప్రారంభంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికిన పసుపు ధర ఆ తర్వాత మేలో అనూహ్యంగా ఎమ్మెస్పీ కన్నా దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సీఎం యాప్‌ ద్వారా  మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిçస్తున్న ప్రభుత్వం ధరలు తగ్గిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా పసుపు రైతుకు అండగా నిలిచింది.

మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున పసుపు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా 2,794 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపును రైతుల నుంచి సేకరించింది. ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు కూడా పోటీపడి కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.

దీంతో ధరలు మళ్లీ ఎమ్మెస్పీకి మించడంతో ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపేసింది. క్వాలిటీని బట్టి ఈ ఏడాది జూన్‌లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలికిన పసుపు జూలై వచ్చేసరికి రూ.8 వేల నుంచి రూ.10,511 మధ్య పలికింది. ఆగస్టులో గత ఏడాది క్వింటా రూ.5 వేల నుంచి రూ.6,300 మధ్య పలకగా, ప్రస్తుతం రూ.8,200 నుంచి రూ.11,750 పలుకుతోంది. 

పెట్టుబడి పోను రూ.5 లక్షలు మిగులుతోంది.
మూడెకరాల్లో పసుపు వేశా. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మంచి దిగుబడి వచ్చింది. రెండునెలల కిందట రూ.5 వేలకు మించి పలకకపోవడంతో పెట్టుబడి కూడా దక్కదేమోనని ఆందోళన చెందాను. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో మళ్లీ ధరలు పెరిగాయి. శుక్రవారం 100 క్వింటాళ్లు మార్కెట్‌కు తీసుకొచ్చా. క్వింటా రూ.11,100 చొప్పున కొన్నారు. రూ.11 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. పెట్టుబడిపోను రూ.5 లక్షలకు పైగా మిగులుతోంది. చాలా ఆనందంగా ఉంది.     – ఎస్‌.రాము, చింతమోటు, భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా

ఈ స్థాయి ధర ఎప్పుడూ రాలేదు
ఒకటిన్నర ఎకరాలో సాగుచేశా. ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెలన్నర కిందటి ధరతో పోలిస్తే రెట్టింపు ధర లభించింది. ప్రభుత్వం కొనడం మొదలు పెట్టిన తర్వాత రేటు పెరుగుతూ వస్తోంది. ఈరోజు 44 క్వింటాళ్ల  పసుపు తీసుకొచ్చాను. క్వింటా రూ.11 వేలకు కొన్నారు. ఈ స్థాయి ధర గతంలో ఎప్పుడూ లభించలేదు. చాలా సంతోషంగా ఉంది. – ఎ.వెంకటసుబ్బయ్య, పోరుమామిళ్ల, వైఎస్సార్‌ జిల్లా

ధర మరింత పెరిగే అవకాశం 
ప్రభుత్వ జోక్యంతోపాటు డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దుగ్గిరాల మార్కెట్‌ పరిధిలోని కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో మూడులక్షల టన్నుల పసుపు ఉంది. రైతుల వద్ద మరో మూడులక్షల టన్నుల సరుకు ఉంది. కొల్లిపర, లంకల ఏరియా, సత్తెనపల్లి, పిడుగురాళ్లతో పాటు వైఎస్సార్‌ జిల్లా నుంచి రోజూ 30–40 లారీల పసుపు వస్తోంది. ధర మరింత పెరిగే అవకాశం ఉంది.   – ఎన్‌.శ్రీనివాసరావు, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌ యార్డు, దుగ్గిరాల 

ప్రభుత్వ జోక్యం వల్లే..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సీఎం యాప్‌ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇలా ఈ సీజన్‌లో రూ.513.94 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ప్రభుత్వ జోక్యం వల్లనే నెల తిరక్కుండానే పసుపునకు మంచి ధర లభిస్తోంది. మొక్కజొన్న క్వింటా రూ.2 వేలకు పైగా పలుకుతుండగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధర క్వింటా రూ.11,750 పలుకుతోంది. 
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement