సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు ఇలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన దాఖలాల్లేవన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీ గున్వత్ సంకల్ప (నాణ్యతకు భరోసా) వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు రైతుల సంక్షేమం కోసమే వేస్తున్నారని చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించేందుకు ఆర్బీకే వ్యవస్థను, దీనికి అనుబంధంగా యంత్రసేవా కేంద్రాలు, గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారని వివరించారు. పాడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందించడంతోపాటు బ్యాంకింగ్ సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు, రివార్డులతో నేడు మన ఆర్బీకేలు దేశానికే కాదు.. ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలిచాయని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఉద్యానపంటల హబ్‌గా నిలిచిన ఏపీ బొప్పాయి, టమాటా, కొకో, పామాయిల్‌లో మొదటిస్థానంలోను, అరటి, బత్తాయి, వంగ, మిరపలో రెండోస్థానంలోను, మామిడి, ఉల్లి, జీడిమామిడిలో మూడోస్థానంలోను నిలిచిందని చెప్పారు. రొయ్యలు, చేపలు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు.
14 ఎఫ్‌పీవోలకు గ్యాప్ సర్టిఫికేషన్
క్యూసీఐ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు కింద గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్–23లో 33 ఎఫ్‌పీవోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అర్హత పొందిన 14 ఎఫ్‌పీవోలకు మంత్రి కాకాణి గ్యాప్ సర్టిఫికేషన్ జారీచేశారు. క్యూసీఐ ఇండిగ్యాప్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సేవలందించేందుకు మంత్రి సమక్షంలో ఏపీ ప్రభుత్వం, క్యూసీఐ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
క్యూసీఐ చైర్‌పర్సన్ జాక్సా షా, సీఈవో డాక్టర్ ఎ.రాజ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవిచౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఉద్యాన, సహకార, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment