Maize farmers
-
12 వరకు మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మార్కెట్లో ధరలు పుంజుకున్నప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనుమతికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయడమేగాక సకాలంలో డబ్బు చెల్లిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరలు మళ్లీ పుంజుకోవడంతో మొక్కజొన్న రైతులు సంతోషిస్తున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల్లోనే రైతులకు సొమ్ము మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. కనీస మద్దతుధర కంటే మార్కెట్లో మొక్కజొన్న ధరలు తగ్గినట్టు సీఎం యాప్ ద్వారా గుర్తించిన మరుక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 కాగా, మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,800 చొప్పున పలుకుతుండడంతో మొక్కజొన్న ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లోని 1,548 ఆర్బీకేల పరిధిలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. మే 5వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించింది. తొలుత 25,316 మంది రైతులు తమ వివరాలను ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 698 ఆర్బీకేల పరిధిలో 8,915 మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 చొప్పున రూ.140.18 కోట్ల విలువైన 71,445 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తోంది. ఇప్పటికే సీఎం యాప్ ద్వారా 6,292 మంది రైతులకు రూ.95.29 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వారం, పదిరోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న ధర ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు సైతం పోటీపడడంతో మార్కెట్లో ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాధారణ కామన్ వెరైటీ సైతం కనీస మద్దతు ధరతో సమానంగా ఉండగా, ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.2 వేలకు పైగా పలుకుతోంది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బహిరంగమార్కెట్లో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 85 శాతానికి పైగా రైతుల వద్ద ఉన్న నిల్వలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఈ నెల 9వ తేదీతో కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినా.. చివరి గింజ అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. సీఎం యాప్ ద్వారా ప్రతి రోజు మొక్కజొన్నతో సహా ఇతర పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని.. పంట చేతికొచి్చంది. మార్కెట్లో ధర లేదు. పెట్టుబడి కూడా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందా. ఏం చేయాలో పాలుపోలేదు. ప్రభుత్వం మా ఊళ్లోనే ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 113 క్వింటాళ్లు ఈ కేంద్రంలో అమ్ముకున్నా. పదిరోజులు తిరక్కుండానే క్వింటా రూ.1,962 చొప్పున రూ.2.22 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని. – ఎస్.వెంకటేశ్వరరెడ్డి, పాలపాడు, పల్నాడు జిల్లా కొనుగోలు కేంద్రంలో విక్రయంతో లబ్ధి నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. బయట క్వింటా రూ.1,600కు మాత్రమే కొంటున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనుకున్నా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల కిందట క్వింటా రూ.1,900 చొప్పున 10 టన్నులు విక్రయించా. దీంతో క్వింటాకు రూ.300 చొప్పున, 10 టన్నులకు రూ.30 వేల మేర లబ్ధి కలిగింది. – చీడెపూడి సాంబిరెడ్డి, వలివేరు, బాపట్ల జిల్లా కేంద్రాలు కొనసాగిస్తాం ప్రభుత్వ జోక్యం వల్ల వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కనీస మద్దతు ధరకు మించే కొనుగోలు చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ రూ.2 వేలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వాదేశాలతో ఈ నెల 12వ తేదీ వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరికొంతకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
మొక్కజొన్న రైతులకు సర్కారు బాసట
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో మొక్కజొన్న రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1,450 నుంచి రూ.1,500 వరకు మాత్రమే పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు దళారుల బారినపడి నష్టపోకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 19 (సోమవారం) నుంచి వాటిద్వారా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది. ఇక్కడ విక్రయించే మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.1,850 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది రబీలో 1.76 లక్షల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండటంతో హెక్టారుకు 8,144 కేజీల చొప్పున 14.33 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 3.96 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఈ క్రాప్ ఆధారంగా ఇప్పటికే ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్న రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతాయి. రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం మొక్కజొన్నను సాధారణంగా కోళ్ల ఫారాల్లో మేతగా వినియోగిస్తారు. పిండి పదార్థాల తయారీతో పాటు ఇథనాల్, ఆల్కహాల్ తయారీలోనూ మొక్కజొన్నను వినియోగిస్తారు. గతేడాది పంట చేతికొచ్చే సమయంలో కరోనా విరుచుకుపడింది. ఆ సమయంలో పౌల్ట్రీ రంగం కుదేలైంది. మొక్కజొన్నను ముడి సరుకుగా వినియోగించే ఇతర పరిశ్రమలు సైతం దెబ్బతిన్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్ లో మొక్కజొన్న రేటు ఒక్కసారిగా పడిపోయింది. క్వింటాల్‌కు రూ.1,300 నుంచి రూ.1,400కు మించి ధర లభించని దుస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,500కు పైగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర రూ.1,760 చొప్పున చెల్లించి 61,445 మంది రైతుల నుంచి 4,16,140 మెట్రిక్ టన్నులను సేకరించింది. రైతులకు రూ.732 కోట్లు చెల్లించింది. నేటినుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం ఆర్బీకేలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్నాం. కనీస మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
రైతుల ధర్నా.. దిగి వచ్చిన సర్కారు!
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఫలితం దక్కింది. అన్నదాత రోడ్డెక్కడంతో మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు ముందుకు వచ్చింది. క్వింటాలుకు రూ. 1850 చొప్పున వరి కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న కొంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం కొనుగోళ్ళకు అనుమతి ఇచ్చిందన్నారు. రైతుల పక్షాన నిలబడి తాము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశామని, రైతులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన సమిష్టివిజయంగా దీనిని అభివర్ణించారు. ఇక జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాలలో మొక్కజొన్న రైతులు పెద్దఎత్తున పోరాటం చేశారని, వారికి తమ పార్టీ మద్దతు ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులందరికీ సంపూర్ణ న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లిస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.(చదవండి: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ) -
నిలువునా ముంచిన ‘కరోనా’
కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచేసింది. కోళ్లకు ప్రధాన మేత అయిన మొక్క జొన్న వినియోగం అమాంతం తగ్గింది. ఫలితం.. మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మొన్నటివరకు రూ.2,200 పలికిన క్వింటా ఇప్పుడు రూ.1300కు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి పంటను దోచుకుంటుండడంతో శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. చీపురుపల్లి రూరల్/సాలూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మొక్క జొన్న రైతులనూ విడిచిపెట్టలేదు.చీడపీడలు, ఈదురుగాలులకు పంట నేలకొరగడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో మొక్కొజన్న రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న ఉత్తత్తిలో అధిక శాతం (సుమారు 90 శాతం) కోళ్ల పరిశ్రమకు వెళ్తుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫౌల్ట్రీ యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో పరిశ్రమను నిలిపివేస్తున్నారు. ఫలితం.. కోళ్లకు మేతగా వినియోగించే మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడింది. (కరెంటుకు ‘కరోనా’ షాక్!) ఒక్కసారిగా ధరలు పతనం... జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 18వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత ఖరీఫ్‌లో క్వింటా మొక్కజొన్నలు బస్తా రూ.2,400 నుంచి రూ.2,200 ధర పలికేది. దీంతో సాగు విస్తీర్ణం పెంచారు. పంట చేతికొచ్చేవేళ... దేశంలో కరోనా వైరస్ ప్రభావం కనిపించడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.1300లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాపైన సుమారుగా రూ.900లు నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. దీనిని అదునుగా తీసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల పంటను నిలువునా దోచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. (కోవిడ్-19: వారికి సోకదు) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి... మొక్కజొన్న పంటను కొనుగోలుకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్నపంటకు క్వింటా రూ.1760 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఆ సమయంలో పంట తక్కువగా ఉండడం, మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో రైతులు వ్యాపారులకు అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వ్యాపారులు పంటకు ధరలను అమాంతం తగ్గించేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
బిల్లుల కోసం రైతుల ఆందోళన
గుంటూరు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటే.. ప్రభుత్వాలు వారికి బిల్లులు సకాలంలో అందించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు నెలల కింద గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లలో తాము పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకున్నారు. అయితే, ఇప్పటి వరకు రైతులకు మొక్కజొన్న పంటకు సంబంధించిన బిల్లులు చేతికి అందలేదు. ఒక వైపు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
చేను చెరువైంది
* వ్యవసాయశాఖ లెక్క 2.20 లక్షల ఎకరాలే * క్షేత్రస్థాయి అంచనా 7లక్షల ఎకరాలకు పైనే.. * భారీ వర్షాలతో అతలాకుతలమైన రైతన్న * మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్లు లేక తడిసిన ధాన్యం, పత్తి బస్తాలు * పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. జలమయమైన గ్రామాలు.. కూలిన ఇళ్లు * వాగుల్లో కొట్టుకుపోయి ప్రకాశం జిల్లాలో ఒక విద్యార్థిని మృతి, ముగ్గురు గల్లంతు * రాజధానిలో భారీవర్షం.. ట్రాఫిక్ కష్టాలు సాక్షి-నెట్వర్క్: పాలుపోసుకుంటున్న వరి కంకులు.. తొలి కోతకు విచ్చుకుంటున్న పత్తి చేలు.. చేతిదాకా వచ్చిన మొక్కజొన్న... మార్కెట్ యార్డులకొచ్చిన ధాన్యం బస్తాలు.. ఒకటేమిటి కర్షకుడు కాయకష్టం చేసి కన్నబిడ్డలా పెంచుకున్న పంటలన్నీ నిలువెల్లా నీట మునిగాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలన్నీ కుదేలయ్యాయి. రైతన్నను మళ్లీ కష్టాల కడలిలోకి నెట్టేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. అయితే ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం పంట నష్టం 7 లక్షల ఎకరాలకుపైగానే ఉంటుందని అంచనా. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక నష్టం సంభవించింది. ఈ వర్షాలు ఇంతటితో ఆగకుండా కొనసాగితే పంట నష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో బుధవారం ఒక్కరోజే 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలో వర్షాల ధాటికి వాగులో కొట్టుకుపోయి ఒక విద్యార్థిని మరణించింది. మరో వాగులో 15 మంది విద్యార్థులు కొట్టుకుపోగా.. 12 మందిని స్థానికులు రక్షించగలిగారు. మిగతా ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మంగళవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మరణించినట్లు తేలింది. భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో 28 రూట్లలో 113 సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. విజయనగరం జిల్లాలో 33, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఇళ్లు, విశాఖ జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 5 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో 17 ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల గోడౌన్ కూలి పోవడంతో 250 టన్నుల పీడీఎస్ బియ్యం తడిసి ముద్దయ్యాయి. తల్లడిల్లిన ప్రకాశం.. వర్ష బీభత్సంతో ప్రకాశం జిల్లా తల్లడిల్లిపోయింది. జిల్లాలో 57.30 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒంగోలులో అత్యధికంగా 34 సెంటీమీటర్లు రికార్డైంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 40 వేల ఎకరాల్లో పత్తిపంట, 1500 ఎకరాల్లో రాగిపంట, 25 వేల ఎకరాల్లో మిర్చి, 8 వేల ఎకరాల మొక్కజొన్న, 5 వేల ఎకరాల వరి, 1250 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం పంటల నష్టం అంతకంటే చాలా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఒక్క పత్తి పంటే దాదాపు 75 వేల ఎకరాల్లో నష్టపోయినట్టు తెలుస్తోంది. చీరాలలో మూడు చేనేత కార్మికుల కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఒంగోలు నగరంలో 50 కాలనీలు జలమయమయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి భారీగా వర్షం నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. జిల్లాలో భారీ వర్షాలు ఇంత బీభత్సం సృష్టించినా అధికార యంత్రాంగం పత్తాలేకుండా పోయింది. జిల్లాలో ఉన్నతాధికారుల్లో అత్యధికులు హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన మంత్రి మహీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి వెళ్లిపోవడంతో సహాయక చర్యలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఒంగోలు జయప్రకాష్ కాలనీ, నెహ్రూనగర్ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహాయక చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వర్ష బాధితులకు బుధవారం రాత్రి భోజన వసతి కల్పించారు. గుంటూరు.. పంట చేల నిండా నీరే.. గుంటూరు జిల్లాలో బుధవారం 3.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బాపట్లలో గరిష్టంగా 11.9 సెం.మీ. వర్షపాతం రికార్డైంది. దీంతో నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి మండలాల్లోని 90 వేల ఎకరాల్లో నీరు నిండా నిలబడి ఉంది. దీంతో వరి, వేరుశనగ, కంది పంటలు దెబ్బతినే దశలో ఉన్నాయి. తాడికొండ మండలంలోని కంతేరు ప్రాంతంలో 1500 ఎకరాల్లో సాగులో ఉన్న టమోటా, చిక్కుడు, బెండ పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో కోడూరు, ముదినేపల్లి, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో 1500 ఎకరాల్లో వరి నీటమునిగింది. పల్లపు ప్రాంతాల్లో సాగు చేసిన దాదాపు పదివేల ఎకరాల పత్తి పొలాల్లోకి నీరు చేరింది. విజయనగరం జిల్లాలో 3000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయి. 33 తాటాకు, పూరిళ్లు నేల మట్టమయ్యాయి. భోగాపురం మండలం రావాడ నుంచి తూడెం వెళ్లే ఆర్అండ్బీ రహదారి వద్ద కల్వర్టు కొట్టుకు పోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి నగరాలతో పాటు పట్టణాలు, మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 75 వేల ఎకరాల్లో వర్షాల కారణంగా నేలకొరిగిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సుమారు 25 వేల ఎకరాల్లో పత్తి పంట వర్షపునీటిలో మునిగిపోయింది. కోనసీమలో లోతట్టులో ఉన్న సుమారు 150 కాలనీలు నీట మునిగాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 2,500 ఎకరాల్లో పొగాకు నాట్లు కుళ్లిపోతున్నారుు. విశాఖ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీటమునిగాయి. దెబ్బతిన్న వేరుశెనగ.. అనంతపురం జిల్లాలో 1250 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా చాగలమర్రి, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, రుద్రవరం, బండిఆత్మకూరు తదితర మండలాల్లో 10వేల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 40వేల క్వింటాళ్ల పత్తి వర్షంలో పూర్తిగా తడిచిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో వర్షాలకు దాదాపు 30 వేల ఎకరాల్లో పెద్దముడియం, రాజుపాలెం, వేంపల్లె మండలాల్లో బుడ్డ (పప్పు) శనగ మోసు దశలోనే కుళ్లిపోవడంతో రూ. 6 కోట్లకు పైగా నష్టం సంభవించింది. శ్రీకాకుళంలో 80 గ్రామాలు జల దిగ్బంధం అనధికార అంచనాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు సమాచారం. ఇవి కాకుండా వేలాది ఎకరాల్లోని పత్తి, చెరుకు, అరటి తదితర పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 80 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సంతబొమ్మాళి మండలంలో మంగళవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మరణించినట్లు తేలింది. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలో పోటెత్తి వచ్చిన వరదనీటితో తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ఆములూరు నుంచి విలుకానుపల్లి వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర కోడూరు రహదారి నీట మునిగిపోయింది. మార్కెట్ యార్డులో తడిసిపోయిన ధాన్యం.. కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యంతోపాటు చాలా చోట్ల ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. జమ్మికుంట మార్కెట్లో మధ్యాహ్నం వర్షం కురవగా అధికారులు టార్పాలిన్లు అందించకపోవడంతో రెండు వేల బస్తాల పత్తి తడిసి ముద్దయింది. కరీంనగర్ మార్కెట్లో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో మూడు రోజులుగా ధాన్యం, మొక్కజొన్న బస్తాలు అలాగే ఉండిపోయి వర్షానికి తడిసిపోయాయి. నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ మండలాల్లో కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన మొక్కజొన్న తడి సిపోయింది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వర్షాలకు పరిగి, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, చేవెళ్ల మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించింది. నల్లగొండ జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. వర్షం కారణంగా రూటుమారిన సీఎం కాన్వాయ్ బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ రోడ్డులో వరదనీరు చేరడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ రూటు మారింది. సచివాలయం నుంచి సీఎం యథావిధిగా నెక్లెస్‌రోడ్డు నుంచి ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ మీదుగా క్యాంపు కార్యాలయానికి సాయంత్రం బయల్దేరారు. అయితే ఆ మార్గం వర్షం నీటితో పోటెత్తడంతో సచివాలయం నుండి నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, బేగంపేట మీదుగా ఆయన కాన్వాయ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. కాగా, అల్పపీడన ప్రభావంతో మూడురోజులుగా విడవకుండా కురుస్తున్న వానతో రాష్ట్ర రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొనసాగుతున్న అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఆనుకొని స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం భూభాగం మీదకు వచ్చే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా, ఉత్తరకోస్తాలో భారీగా వర్షాలు పడతాయని అంచనా వేశారు. అప్రమత్తంగా ఉండాలి: సీఎం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. -
ఆరలేదని మొక్కజొన్న రైతును ముంచేశారు
ప్రభుత్వ నిర్లక్ష్యం, మార్క్‌ఫెడ్ అడ్డగోలు నిబంధనలతో మొక్కజొన్న రైతుల బేజారు సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, ప్రైవేటు వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి మొక్కజొన్న రైతును నిలువునా ముంచుతున్నాయి. నెల కింద క్వింటాలు రూ. 1,700 అమ్మిన మొక్కజొన్న.. రైతు చేతికి పంట వచ్చేసరికి ఒక్కసారిగా రూ. 1,100-1,200కు పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,310 అయినా అందడం లేదని రైతన్న గగ్గోలు పెట్టాక, మార్కెట్ యార్డుల్లో ‘ధర్మాగ్రహాన్ని’ చూపాకగానీ సర్కారు మొద్దు నిద్ర వీడలేదు. అయినా, అన్నదాతకు ఆవేదన తప్పడంలేదు. మొక్కజొన్న కొనుగోళ్లకు ‘మార్క్‌ఫెడ్’ను రంగంలోకి దించినా.. ‘కనీస మద్దతు ధర’ లభిస్తుందనుకున్న రైతుల ఆశలు ‘తేమ శాతం’లో కొట్టుకుపోయాయి. 14 శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్న మొక్కజొన్నలను కొనబోమని ‘మార్క్ ఫెడ్’ భీష్మించడంతో మార్కెట్‌కు తెచ్చిన సరకును రైతులు అక్కడే ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఈసారి సర్కారుకు వరుణుడు తోడవడంతో మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 15.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. అందులో దాదాపు 12 లక్షల ఎకరాల సాగు మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలోనే ఉంది. 20 రోజుల ముందు వరకూ కూడా మార్కెట్లో క్వింటాలు మొక్కజొన్న ధర రూ.1,600- 1,700 మధ్య ఉంది. కానీ, ప్రైవేటు వ్యాపారులంతా కలసి పంట రైతు చేతికి వచ్చే సమయానికి రూ. 1,200కు ధర తగ్గించేశారు. ప్రైవేటు వ్యాపారుల ఆగడాలను అడ్డుకుని, సకాలంలో మార్క్‌ఫెడ్ లాంటి సంస్థలను కొనుగోళ్లకు దింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూ ర్చుంది. చివరికి రైతులు ఆందోళనలతో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించింది. కానీ, సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలులో జాప్యం చేయడం మొదలుపెట్టింది. అప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు వ్యాపారుల మాయాజాలంతో కుంగిపోయిన రైతన్నను వర్షం నిండా ముంచేసింది. అడ్డగోలు నిబంధనలు: నిర్ణీత 14 శాతం కన్నా ఏమాత్రం ఎక్కువ తేమ ఉన్నా మార్క్‌ఫెడ్ మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు. అదే ప్రైవేటు వ్యాపారులు తేమ శాతం ఎక్కువ ఉంటే కాస్త ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ రైతులకు వెంటనే డబ్బు చెల్లించదు. కనీసం వారం తర్వాతే సొమ్ము అందుతుంది. అదే ప్రైవేటు వ్యాపారులు వెంటనే డబ్బు చెల్లిస్తారు. దానికితోడు కొనుగోళ్లలోనూ మార్క్‌ఫెడ్ జాప్యం చేయడంతో.. కనీస మద్దతు ధరకన్నా తక్కువకు ప్రైవేటు వ్యాపారులకు రైతులు మొక్కజొన్నను విక్రయించాల్సి వస్తోంది. దాంతో రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు... తమ మాయాజాలంతో రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రైవేటు దందాతో ‘పౌల్ట్రీ’కీ ముప్పు: రాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొక్కజొన్నలో 80 శాతానికిపైగా కోళ్ల పరిశ్రమ వినియోగానికే పోతుంది. దాంతో మొక్కజొన్న సరుకంతా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉంటే.. అది తమకు ఇబ్బందేనని కోళ్ల పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్న కొనుగోలు సమయంలో ధర తగ్గించేసి రైతులను... అమేటప్పుడు ధర పెంచేసి తమనూ దోచుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. మొక్కజొన్నను వీలైనంత మేరకు మార్క్ఫెడ్లాంటి ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తే.. రైతులకూ, తమకూ ప్రయోజనకరమని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్‌కు తెచ్చిన సరుకును తేమశాతం పేరుతో తిరస్కరించకుండా, అదనంగా ఉన్న తేమ శాతానికి తగినట్లుగా కొంత ధర తగ్గించైనా మార్క్‌ఫెడ్ మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే, ఈ విషయమై మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్ బాబును వివరణ కోరగా.. ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇస్తే తప్ప తేమ శాతం అధికంగా ఉన్న సరుకు కొనుగోలు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. జిల్లా కలెక్టర్ల సూచన మేరకు ఇప్పటివరకూ 53 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపు 34 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశామని మార్క్‌ఫెడ్ జీఎం తేజోవతి ‘సాక్షి’కి తెలిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి రూ. 4.45 కోట్లను ఆయా కేంద్రాలకు విడుదల చేశామని తెలిపారు.