గుంటూరు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటే.. ప్రభుత్వాలు వారికి బిల్లులు సకాలంలో అందించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు నెలల కింద గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లలో తాము పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకున్నారు. అయితే, ఇప్పటి వరకు రైతులకు మొక్కజొన్న పంటకు సంబంధించిన బిల్లులు చేతికి అందలేదు. ఒక వైపు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.