మాకు చదువుకోవాలని ఉందంటూ విద్యార్థుల వేడుకోలు
ఐటీడీఏ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన
ఏఎస్‌ఆర్ జిల్లా జోడూరులో ఘటన
పాడేరు: ‘అయ్యా.. కలెక్టర్‌గారు, పీఓ గారు.. మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా బడికి మాస్టార్ని పంపించండి’.. అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండేఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో 28 మంది బడిఈడు పిల్లలున్నారు. కానీ, ఇక్కడ పాఠశాల లేదు.
దీంతో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలను అధికారులు ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాలలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబరు 17న విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, నేటికి 20 రోజులు కావస్తున్నా ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరుకావడంలేదు.
దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరుకు తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చుర్రుమనే ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని, 20 రోజులుగా బడికిరాని ఉపాధ్యాయుడు సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం.. ఐటీడీఏ పీఓ అభిషేక్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment