ITDA office
-
సార్.. మా బడికి మాస్టార్ని పంపించండి!
పాడేరు: ‘అయ్యా.. కలెక్టర్‌గారు, పీఓ గారు.. మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా బడికి మాస్టార్ని పంపించండి’.. అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండేఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో 28 మంది బడిఈడు పిల్లలున్నారు. కానీ, ఇక్కడ పాఠశాల లేదు. దీంతో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలను అధికారులు ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాలలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబరు 17న విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, నేటికి 20 రోజులు కావస్తున్నా ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరుకావడంలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరుకు తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చుర్రుమనే ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని, 20 రోజులుగా బడికిరాని ఉపాధ్యాయుడు సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం.. ఐటీడీఏ పీఓ అభిషేక్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరుణ్‌రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
మృత్యు ఘంటికలు
సరిహద్దుల్లోని లోతట్టు ఆదివాసీ గ్రామాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. మండలంలోని చాపరాయి, కానివాడ పంచాయతీల్లో మాదిరి పరిస్థితులే పొరుగునే ఉన్న విశాఖ జిల్లాలోనూ నెలకొన్నాయి. వై.రామవరం (రంపచోడవరం):వై.రామవరాన్ని ఆనుకుని ఉన్న విశాఖ జిల్లా, కొయ్యూరు మండలంలోని యు.చీడిపాలెం, మఠం భీమవరం అనే రెండు పంచాయతీలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కలిపి 40 గిరిజన గ్రామాలున్నాయి. ఆ పంచాయతీలు వై.రామవరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ గ్రామాల వారు తమ మండల కేంద్రమైన కొయ్యూరు వెళ్లాలంటే వై.రామవరం మీదుగా సుమారు 105 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి ప్రయాణించాలి. పైస్థాయి అధికార యంత్రాంగం ఉండే పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఈ గ్రామాలకు 200కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ జిల్లా అధికారులు వై.రామవరం మీదుగానే ఈ గ్రామాలకు చేరుకోవాలి. ఈ గ్రామాలకు చేరడానికి అనువైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మారుమూలగా విసిరేసినట్టుగా ఉండే ఈ రెండు పంచాయతీల్లోని గిరిజనులను ఆరోగ్య స్థితిగతులను పట్టించుకోవడం లేదు. స్థానికంగా నివాసం ఉండడం లేదు. ఈ క్రమంలో తమకు వైద్య సేవలు అందడం లేదని ఆ ప్రాంత గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఒకే ఇంట ముగ్గురి మృతి ఈ రెండు పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యం అందక రోజుల తరబడి మంచాన పడి చివరికి ప్రాణాలొదులుతున్నారు. పంచాయతీ కేంద్రమైన మఠం భీమవరంలో సంభవిస్తున్న వరుస మరణాలు ఇందుకు ఉదాహరణ. ఆ గ్రామంలో నాలుగు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట్లో 2017 నవంబర్‌లో యజమానురాలు శిరిబాల శాంతమ్మ (55), డిసెంబర్లో శిరిబాల శాంతిరాజు పుత్రిక పాప (ఒక నెల), అతని మరో ఆడబిడ్డ శిరిబాల జనని (3) ఈ ఏడాది మార్చి 12న మృతి చెందారు. ఈ నాలుగు నెలల వ్యవధిలో అదే గ్రామంలోని జర్త చిన్నారావు బిడ్డ బాబు (రెండు నెలల వయసు), గొలిసింగ్ విశ్వనా«థం పడాల్ (48) కూడా ప్రాణాలు వదిలారు. ఈ పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామాల్లో వైద్య సేవలు అందక మరెంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఆ విషయాలు పాడేరు ఐటీడీఏ వరకూ కాదు కదా, కనీసం మండల కేంద్రమైన కొయ్యూరులోని అధికారుల దృష్టికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. అదే తమకు శాపంగా మారిందని ఆప్రాంత వాసులు చెబుతున్నారు. తమ గ్రామాలకు రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించి, మెరుగైన వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంత అధికార యంత్రాంగం ఎవరూ అందుబాటులో లేదు. కుటుంబ సభ్యులను కోల్పోయాను నాలుగు నెలల వ్యవధిలో నాతల్లి, ఇద్దరు బిడ్డలు మెరుగైన వైద్య సేవలు అందక మృతి చెందారు. మా పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నా వెలుగులోకి రావడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పంచాయతీ కేంద్రంలో నివాసం ఉండడం లేదు. అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. మెరుగైన వైద్యసేవలు అందకే నా కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. అధికారులు ఇకనైనా స్పందించాలి. – శిరిబాల శాంతిరాజు, మఠం భీమవరం, కొయ్యూరు మండలం -
ఐటీడీఏ కార్యాలయం ముట్టడి
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు, గిరిజనులు సోమవారం ముట్టడించారు. మండలంలోని బోడిపంట మీద కలర్ గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప తోపులాట జరిగింది. -
రేపు సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. జిల్లాలోని నిమ్మలగూడేనికి హెలికాఫ్టర్‌లో వచ్చి, ఉదయం 10.35 నుంచి 11 వరకు ఉపాధిహామీ పనులు పరిశీలిస్తారు. అంగన్వాడీ సెంటర్‌ను తనిఖీ చేస్తారు. అనంతరం చింతూరులోని ఎర్రంపేటకు 11 గంటలకు వెళ్లి సబ్ ట్రెజరీని ప్రారంభిస్తారు. జీసీసీ పెట్రోలు బంక్, ఎల్పీజీ గోడౌన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించి, పీఓ, స్టాఫ్ క్వార్టర్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కూనవరం, చింతూరు సీహెచ్‌సీ భవనాలకు, చింతూరు-వీఆర్ పురం, నెల్లిపాక-పోచవరం ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆర్డబ్ల్యూఎస్ పనులకు, ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేసి, అనంతరం ఏపీ రెసిడెన్షియల్(గిరిజన సంక్షేమ) జూనియర్ కళాశాలలో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 17 వేల ప్రిమ్ టు ట్రైబల్ గ్రూపు కుటుంబాలకు చంద్రన్న పౌష్టికాహార కానుక ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, దీపం కనెక్షన్లు, ఉపకరణాలు పంపిణీ చేస్తారు. -
'దొంగ సర్టిఫికేట్లతో లబ్ధిపొందుతున్నారు'
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు సోమవారం ధర్నాకు దిగారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజ్, పాలక లక్ష్మణమూర్తి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ నేతలు గిరిజనులని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుని రాజకీయంగా, ఉద్యోగాల పరంగా లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. అలాంటి నకిలీ గిరిజనులను వెంటనే తొలగించారని కోరారు. కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికేట్ లు జారీ చేసిన సబ్ కలెక్టర్ శ్వేతామహంతిపై విచారణ చేయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా అంకెల గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులను నమ్మించి మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే రాజన్న విమర్శించారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
పార్వతీపురం: వేసవిలో తాగునీటికి కొరత లేకుండా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఎ.వి.సుబ్బారావుతో మాట్లాడుతూ నీటి కొరత ఉన్న గిరిజన గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు. నివేదిక మేరకు ఆయా గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయించాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రక్షిత పథకాల నిర్మాణాలను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మినీ ట్రాక్టర్లు, విత్తనాలకు సంబంధించిన అంశాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలకు అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నివేదికను తయారు చేసి పంపించాలని ఐటీడీఏ డీడీ విజయ కుమార్‌ను ఆదేశించారు. అంతర పంటల సాగు ఆవశ్యకతను ప్రజలను వివరించాలని ఉద్యానవన శాఖాధికారులకు సూచించారు. సీసీ రోడ్లు లేని గ్రామాల వివరాలు సేకరించి నివేదిక పంపించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్, ఆర్డీఓ రోణ ంకి గోవిందరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వ్యవసాయ జేడీ, పీఆర్ ఈఈ, ఆర్అండ్ బీఈఈ, ఇరిగేషన్ డీఈ తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత
విజయనగరం : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన హాస్టల్ విద్యార్థులు శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అందులోభాగంగా కార్యాలయంలో జరుగుతున్న పాలక మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. ఆ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి.. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. -
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన
పార్వతీపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ గిరిజన పాఠశాలలో వసతుల లేమిపై డిప్యూటీ డెరైక్టర్ చేసిన విచారణ తూతూ మంత్రంగా సాగిందంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాఠశాలలో వసతులు సరిగ్గా లేవంటూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో విచారణకు ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించిన డీడీ అసంపూర్తిగా నివేదిక రూపొందించారంటూ మంగళవారం గిరిజన సంఘాలు ధర్నా చేపట్టాయి. పాఠశాలలో అసౌకర్యాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పీవోను డిమాండ్ చేశాయి. -
ఐటీడీఏ ముట్టడి
అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన హాస్టల్ కార్మికుల సమ్మెనోటీసు గిరిజన మత్స్యకారుల ధర్నా పాడేరు: ధర్నా, ఆందోళనలతో ఐటీడీఏ కార్యాలయం శుక్రవారం దద్ధరిల్లిపోయింది. గ్రీవెన్స్‌డే కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. బోట్లు, వలలు పంపిణీ చేయాలంటూ గిరిజన మత్స్యకారులు ధర్నా జరిపారు. ఏజెన్సీలోని 11 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐటీడీఏను ముట్టడించారు. పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, పదవీ విరమణ భత్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వీరాకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే జీతాలు పెరుగుతాయని భావిస్తే గతేడాది కంటే బడ్జెట్‌ను బాగా తగ్గించేశారన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్యకర్తలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు లేవన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు పింఛన్‌తోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, జీతం రూ.15 వేలకు పెంచాలని, అంగన్వాడీ వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు నాగశేషు, డివిజన్ నాయకులు భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, అంబలమ్మ, కృష్ణవేణి, నాగలక్ష్మి, సీఐటీయూ నాయకులు శంకరరావు, ఉమా మహేశ్వరరావు, సుందరరావు పాల్గొన్నారు. సమ్మె బాటలో హాస్టల్ వ ర్కర్లు: దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరించకుంటే సమ్మె చేపడతామంటూ హాస్టల్ కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం ఐటీడీఏ పీవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన వర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు సమ్మె నోటీసు అందజేశారు. వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. 9 నెలలుగా డైలీవైజ్ వర్కర్లకు, 13 నెలలుగా క్యాజువల్ కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించ లేదని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదని, కలెక్టర్ గెజిట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇకపై అధికారులతో రాజీపడేది లేదని, సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీసీహెచ్ పడాల్, సుందరరావు, హాస్టల్ కార్మిక సంఘ నాయకులు రామారావు, బాలన్న, రాజారావు, శెట్టి గాశీ, చిన్నయ్య, లంకా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వలలు, బోట్లు పంపిణీ చేయాలి తమ జీవనోపాధి కోసం బోట్లు, వలలు పంపిణీ చేయాలని ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల గిరిజనులు శుక్రవారం ఐటీడీఏకు ప్రదర్శనగా వచ్చి ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు పాండురంగస్వామి, కె.సురేష్‌తో కలిసి ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. హుద్‌హుద్ ధాటికి బోట్లు, వలలు ధ్వంసమయ్యాయని, తమకు ఆర్థిక సహాయం అందించాలని, జీవనోపాధిని కొనసాగించేందుకు వలలు, బోట్లు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పనసపుట్టు సర్పంచ్ జె.మాలియ, జోలాపుట్టు ఎంపీటీసీ రామచందర్, పలు గ్రామాల గిరిజనులు సుందరరావు, నీలాంబరం, మంగు, రాందాస్, జైరాం, రాంబాబు పాల్గొన్నారు. -
ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయల ధర్నా
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం గొత్తికోయలు ధర్నాకు దిగారు. తాగునీటి వసతి, రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పత్రాలు ఇచ్చి అటవీ అధికారుల నుంచి దాడులు నివారించాలని ఐటీడీఏ ఏపీఓ వసంత్ రావుకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు వెయ్యి మంది వరకు గొత్తికోయలు పాల్గొన్నారు. -
సవర భాషా విద్యావలంటీర్ల దీక్ష భగ్నం
పార్వతీపురం:సవర విద్యావలంటీర్ల జీతాల కోసం చేస్తున్న ఆందోళనను పోలీసులు భగ్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల చర్యలకు నిరసగా, వలంటీర్లకు మద్దతుగా విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు స్థానిక ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి గురువారం యత్నించారు. 128 మంది సవర భాష విద్యా వలంటీర్లకు రావాల్సిన ఏడాది బకాయి జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా ఐదుగురు సవర భాష విద్యా వలంటీర్లు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో గురువారం వేకువజామున పోలీసులు వారిని బలవంతంగా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, బొబ్బిలి, ఎస్.కోట తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది సవరభాష విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, వీవైఎఫ్‌ఐ, యూటీఎఫ్, గిరిజన సంఘం, సీపీఎం, సీఐటీయూ తదితర సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక రాయగడ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విద్యార్థినులు, మహిళలు ఎండలో గంటలతరబడి కూర్చొని తమ ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, మూడడ్ల కృష్ణమూర్తి, రెడ్డి శ్రీరామమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షురాలు కె.విజయ గౌరి, బి.వి.రమణ, లక్ష్మీ, కొల్లి సాంబమూర్తి తదితరుల ఆధ్వర్యంలో గిరిజనుల కోసం పనిచేయని ఐటీడీఏ మాకొద్దు... గిరిజనులు విద్యావంతులు కావాలంటూ...టీచర్లు, సవర భాష వలంటీర్లు లేకుండా చేస్తున్న అధికారులు మాకొద్దు...‘బాబు వచ్చాడు. ..జాబు పోయింది’ అంటూ ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా మిన్నంటేలా నినాదాలు చేశారు. విద్యార్థులను అదుపుచేసేందుకు పార్వతీపురం సీఐ బి.వెంకటరావు ఆధ్వర్యంలో సాలూరు, ఎల్విన్‌పేట సీఐలు, డివిజన్లోని పలు స్టేషన్లకు చెందిన ఎస్సైలు సిబ్బంది దాదాపు 250 మందివరకు పోలీసులు ఐటీడీఏ వద్ద మోహరించారు. ఐటీడీఏ పీఓ వచ్చి సమాధానం చెప్పాలని విద్యార్థులు పట్టుబట్టడడంతో ఏపీఓ వసంతరావు వచ్చి వినతిపత్రం ఇస్తే కలె క్టర్‌కు పంపిస్తామనడంతో ఒక్కసారిగా వారు విరుచుకుపడ్డారు. ఏడాదిగా జీతాలు లేక ఆందోళనలు చేస్తుంటే, ఇంకా పంపిస్తారా...? అంటూ ఆగ్రహించారు. అనంతరం కార్యాలయం లోపలకి పంపించాలని పట్టుబట్టడంతో పోలీసులు వారిని వారించారు. ఈ నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతం ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ వచ్చి 2013-14కు సంబంధించి జీతాలు వచ్చేది, రానిది వారంలో చెప్తామని, 2014-15కు సంబంధించి విద్యావాలంటీర్లు కొనసాగింపు లేదని తెలిపారు. అలాగే టీచర్ల నియామకం తదితరవి తన చేతిలో లేవ ని, ప్రభుత్వం చేయాల్సి ఉందన్నారు. పీఓ సమాధానాలకు సంతృప్తి చెందని విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఈ తరుణంలో సీఐ వెంకటరావు విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ ఆందోళన విరమించాలని కోరారు. అయితే విద్యార్థులు వెనక్కి తగ్గకపోడంతో పోలీసులు సుమారు 90మందిని అరెస్ట్ చేసి, బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ఈ సమయంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ.నాయకులు జగన్, గణేష్, ముఖేష్, రాజశేఖర్, సురేంద్ర, యూటిఎఫ్ నాయకులు మురళి, సవర భాష విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.