మృత్యు ఘంటికలు | Child Deaths In Visakha Agency | Sakshi
Sakshi News home page

మృత్యు ఘంటికలు

Published Tue, Mar 27 2018 12:04 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Child Deaths In Visakha Agency - Sakshi

ఈనెల 12న మృత్యువాత పడిన మూడేళ్ల చిన్నారి శిరిబాల జనని (ఫైల్‌)

సరిహద్దుల్లోని లోతట్టు ఆదివాసీ గ్రామాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. మండలంలోని చాపరాయి, కానివాడ పంచాయతీల్లో మాదిరి పరిస్థితులే పొరుగునే ఉన్న విశాఖ జిల్లాలోనూ నెలకొన్నాయి.

వై.రామవరం (రంపచోడవరం):వై.రామవరాన్ని ఆనుకుని ఉన్న విశాఖ జిల్లా, కొయ్యూరు మండలంలోని యు.చీడిపాలెం, మఠం భీమవరం అనే రెండు పంచాయతీలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కలిపి 40 గిరిజన గ్రామాలున్నాయి. ఆ పంచాయతీలు వై.రామవరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ గ్రామాల వారు తమ మండల కేంద్రమైన కొయ్యూరు వెళ్లాలంటే వై.రామవరం మీదుగా సుమారు 105 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి ప్రయాణించాలి. పైస్థాయి అధికార యంత్రాంగం ఉండే పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఈ గ్రామాలకు 200కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ జిల్లా అధికారులు వై.రామవరం మీదుగానే ఈ గ్రామాలకు చేరుకోవాలి. ఈ గ్రామాలకు చేరడానికి అనువైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మారుమూలగా విసిరేసినట్టుగా ఉండే ఈ రెండు పంచాయతీల్లోని గిరిజనులను ఆరోగ్య స్థితిగతులను పట్టించుకోవడం లేదు. స్థానికంగా నివాసం ఉండడం లేదు. ఈ క్రమంలో తమకు వైద్య సేవలు అందడం లేదని ఆ ప్రాంత గిరిజనులు ఆరోపిస్తున్నారు.

ఒకే ఇంట ముగ్గురి మృతి
ఈ రెండు పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యం అందక రోజుల తరబడి మంచాన పడి చివరికి ప్రాణాలొదులుతున్నారు.
పంచాయతీ కేంద్రమైన మఠం భీమవరంలో సంభవిస్తున్న వరుస మరణాలు ఇందుకు ఉదాహరణ. ఆ గ్రామంలో నాలుగు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట్లో 2017 నవంబర్‌లో యజమానురాలు శిరిబాల శాంతమ్మ (55), డిసెంబర్‌లో శిరిబాల శాంతిరాజు పుత్రిక పాప (ఒక నెల), అతని మరో ఆడబిడ్డ శిరిబాల జనని (3) ఈ ఏడాది మార్చి 12న మృతి చెందారు. ఈ నాలుగు నెలల వ్యవధిలో అదే గ్రామంలోని జర్త చిన్నారావు బిడ్డ బాబు (రెండు నెలల వయసు), గొలిసింగ్‌ విశ్వనా«థం పడాల్‌ (48) కూడా ప్రాణాలు వదిలారు. ఈ పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామాల్లో వైద్య సేవలు అందక మరెంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఆ విషయాలు పాడేరు ఐటీడీఏ వరకూ కాదు కదా, కనీసం మండల కేంద్రమైన కొయ్యూరులోని అధికారుల దృష్టికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. అదే తమకు శాపంగా మారిందని ఆప్రాంత వాసులు చెబుతున్నారు. తమ గ్రామాలకు రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించి, మెరుగైన వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంత అధికార యంత్రాంగం ఎవరూ అందుబాటులో లేదు.

కుటుంబ సభ్యులను కోల్పోయాను
నాలుగు నెలల వ్యవధిలో నాతల్లి, ఇద్దరు బిడ్డలు మెరుగైన వైద్య సేవలు అందక మృతి చెందారు. మా పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నా వెలుగులోకి రావడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పంచాయతీ కేంద్రంలో నివాసం ఉండడం లేదు. అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. మెరుగైన వైద్యసేవలు అందకే నా కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. అధికారులు ఇకనైనా స్పందించాలి.   – శిరిబాల శాంతిరాజు, మఠం భీమవరం, కొయ్యూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement