సవర భాషా విద్యావలంటీర్ల దీక్ష భగ్నం | Savara Language vidyavalantirla protest crackdown | Sakshi
Sakshi News home page

సవర భాషా విద్యావలంటీర్ల దీక్ష భగ్నం

Published Fri, Sep 12 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

సవర భాషా విద్యావలంటీర్ల దీక్ష భగ్నం

సవర భాషా విద్యావలంటీర్ల దీక్ష భగ్నం

 పార్వతీపురం:సవర విద్యావలంటీర్ల జీతాల కోసం చేస్తున్న ఆందోళనను పోలీసులు భగ్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  పోలీసుల చర్యలకు నిరసగా, వలంటీర్లకు మద్దతుగా విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు స్థానిక ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి గురువారం యత్నించారు.  128 మంది సవర భాష విద్యా వలంటీర్లకు   రావాల్సిన ఏడాది బకాయి జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  నాలుగు రోజులుగా ఐదుగురు సవర భాష విద్యా వలంటీర్లు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో గురువారం వేకువజామున పోలీసులు వారిని బలవంతంగా ఏరియా ఆస్పత్రికి తరలించారు.  
 
 ఈ నేపథ్యంలో జిల్లాలోని   విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, బొబ్బిలి, ఎస్.కోట తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది సవరభాష విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, వీవైఎఫ్‌ఐ, యూటీఎఫ్, గిరిజన సంఘం, సీపీఎం, సీఐటీయూ   తదితర సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక రాయగడ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు.   మండుటెండను సైతం లెక్క చేయకుండా విద్యార్థినులు,  మహిళలు ఎండలో గంటలతరబడి కూర్చొని తమ ఆందోళన కొనసాగించారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, మూడడ్ల కృష్ణమూర్తి, రెడ్డి శ్రీరామమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షురాలు కె.విజయ గౌరి, బి.వి.రమణ, లక్ష్మీ, కొల్లి సాంబమూర్తి తదితరుల ఆధ్వర్యంలో గిరిజనుల కోసం పనిచేయని ఐటీడీఏ మాకొద్దు... గిరిజనులు విద్యావంతులు కావాలంటూ...టీచర్లు, సవర భాష వలంటీర్లు లేకుండా చేస్తున్న అధికారులు మాకొద్దు...‘బాబు వచ్చాడు.
 
 ..జాబు పోయింది’ అంటూ ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా మిన్నంటేలా నినాదాలు చేశారు. విద్యార్థులను అదుపుచేసేందుకు పార్వతీపురం సీఐ బి.వెంకటరావు ఆధ్వర్యంలో సాలూరు, ఎల్విన్‌పేట సీఐలు, డివిజన్‌లోని పలు స్టేషన్లకు చెందిన ఎస్సైలు సిబ్బంది దాదాపు 250 మందివరకు పోలీసులు ఐటీడీఏ వద్ద మోహరించారు.   ఐటీడీఏ పీఓ వచ్చి సమాధానం చెప్పాలని విద్యార్థులు పట్టుబట్టడడంతో  ఏపీఓ వసంతరావు వచ్చి వినతిపత్రం ఇస్తే కలె క్టర్‌కు పంపిస్తామనడంతో ఒక్కసారిగా వారు విరుచుకుపడ్డారు. ఏడాదిగా జీతాలు లేక ఆందోళనలు చేస్తుంటే, ఇంకా పంపిస్తారా...? అంటూ ఆగ్రహించారు. అనంతరం  కార్యాలయం లోపలకి పంపించాలని పట్టుబట్టడంతో పోలీసులు వారిని వారించారు. ఈ నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 
 అనంతం ఐటీడీఏ   పీఓ రజిత్ కుమార్ సైనీ వచ్చి 2013-14కు సంబంధించి జీతాలు వచ్చేది, రానిది వారంలో చెప్తామని, 2014-15కు సంబంధించి విద్యావాలంటీర్లు కొనసాగింపు లేదని తెలిపారు. అలాగే టీచర్ల నియామకం తదితరవి తన చేతిలో లేవ ని,   ప్రభుత్వం చేయాల్సి ఉందన్నారు. పీఓ సమాధానాలకు సంతృప్తి చెందని  విద్యార్థులు   ఆందోళన ఉద్ధృతం చేశారు. ఈ తరుణంలో  సీఐ వెంకటరావు విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ   ఆందోళన విరమించాలని కోరారు. అయితే విద్యార్థులు వెనక్కి తగ్గకపోడంతో  పోలీసులు  సుమారు 90మందిని అరెస్ట్ చేసి, బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ఈ సమయంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ.నాయకులు జగన్, గణేష్, ముఖేష్, రాజశేఖర్, సురేంద్ర, యూటిఎఫ్ నాయకులు మురళి,  సవర భాష విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement