పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు సోమవారం ధర్నాకు దిగారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజ్, పాలక లక్ష్మణమూర్తి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ నేతలు గిరిజనులని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుని రాజకీయంగా, ఉద్యోగాల పరంగా లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. అలాంటి నకిలీ గిరిజనులను వెంటనే తొలగించారని కోరారు. కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికేట్ లు జారీ చేసిన సబ్ కలెక్టర్ శ్వేతామహంతిపై విచారణ చేయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా అంకెల గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులను నమ్మించి మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే రాజన్న విమర్శించారు.