ఐటీడీఏ ముట్టడి
అంగన్వాడీ కార్యకర్తలు
పెద్ద ఎత్తున ఆందోళన
హాస్టల్ కార్మికుల సమ్మెనోటీసు
గిరిజన మత్స్యకారుల ధర్నా
పాడేరు: ధర్నా, ఆందోళనలతో ఐటీడీఏ కార్యాలయం శుక్రవారం దద్ధరిల్లిపోయింది. గ్రీవెన్స్‌డే కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. బోట్లు, వలలు పంపిణీ చేయాలంటూ గిరిజన మత్స్యకారులు ధర్నా జరిపారు. ఏజెన్సీలోని 11 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐటీడీఏను ముట్టడించారు. పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, పదవీ విరమణ భత్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వీరాకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే జీతాలు పెరుగుతాయని భావిస్తే గతేడాది కంటే బడ్జెట్‌ను బాగా తగ్గించేశారన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్యకర్తలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు లేవన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలకు పింఛన్‌తోపాటు రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, జీతం రూ.15 వేలకు పెంచాలని, అంగన్‌వాడీ వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్‌లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు నాగశేషు, డివిజన్ నాయకులు భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, అంబలమ్మ, కృష్ణవేణి, నాగలక్ష్మి, సీఐటీయూ నాయకులు శంకరరావు, ఉమా మహేశ్వరరావు, సుందరరావు పాల్గొన్నారు.
సమ్మె బాటలో హాస్టల్ వ ర్కర్లు: దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరించకుంటే సమ్మె చేపడతామంటూ హాస్టల్ కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం ఐటీడీఏ పీవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన వర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు సమ్మె నోటీసు అందజేశారు. వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. 9 నెలలుగా డైలీవైజ్ వర్కర్లకు, 13 నెలలుగా క్యాజువల్ కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించ లేదని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదని, కలెక్టర్ గెజిట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇకపై అధికారులతో రాజీపడేది లేదని, సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీసీహెచ్ పడాల్, సుందరరావు, హాస్టల్ కార్మిక సంఘ నాయకులు రామారావు, బాలన్న, రాజారావు, శెట్టి గాశీ, చిన్నయ్య, లంకా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
వలలు, బోట్లు పంపిణీ చేయాలి
తమ జీవనోపాధి కోసం బోట్లు, వలలు పంపిణీ చేయాలని ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల గిరిజనులు శుక్రవారం ఐటీడీఏకు ప్రదర్శనగా వచ్చి ధర్నా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పాండురంగస్వామి, కె.సురేష్‌తో కలిసి ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. హుద్‌హుద్ ధాటికి బోట్లు, వలలు ధ్వంసమయ్యాయని, తమకు ఆర్థిక సహాయం అందించాలని, జీవనోపాధిని కొనసాగించేందుకు వలలు, బోట్లు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పనసపుట్టు సర్పంచ్ జె.మాలియ, జోలాపుట్టు ఎంపీటీసీ రామచందర్, పలు గ్రామాల గిరిజనులు సుందరరావు, నీలాంబరం, మంగు, రాందాస్, జైరాం, రాంబాబు పాల్గొన్నారు.