Grievance Day
-
గ్రీవెన్స్‌డేలో కలకలం; కిరోసిన్ పోసుకొని..
సాక్షి, నల్లగొండ : తన తండ్రిని బెదిరించి తమకు ఉన్న ఒక ఎకరం ఐదు గుంటల వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్టేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన షేక్ గౌస్ తన సోదరి ఆఫ్రిన్తో కలసి కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డేకు వచ్చాడు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన వారు కలెక్టర్‌కు, ఇతర అధికారులకు అర్జీలు ఇస్తుండగానే ఉదయం 11.45 గంటల సమయంలో లోనికి వచి్చన షేక్ గౌస్ తన వెంట బాటిల్లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుంటుండగా అక్కడే ఉన్న వారు అతడి చేతిలోని బాటిల్‌ను లాక్కున్నారు. ఈ ఘటన కార్యాలయంలో కలకలం సృష్టించడంతో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అతడిని పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తుమ్మడం గ్రామానికే చెందిన నజీర్ అనే వ్యక్తి తన తండ్రి షేక్ హుస్సేన్ హైదర్‌ను బెదిరించి తమ కుటుంబానికి చెందిన ఒక ఎకరం ఐదు గుంటల వ్యవసాయ భూమిని రిజి్రస్టేషన్ చేయించున్నాడని తెలిపాడు. 2018 సంవత్సరంలో ఇది జరగ్గా, అప్పటినుంచి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించడం లేదని వాపోయాడు. గ్రీవెన్స్‌డేలో కూడా నాలుగు నెలల నుంచి పలు సార్లు అర్జీలు ఇచ్చినా తీసుకుంటున్నారు తప్ప తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తానని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ చెప్పడంతో ఆ యువకుడు వెనుదిరిగాడు. -
మంచి రోజులొచ్చాయి
ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల నుంచి వేటకు సముద్రంలోకి వెళ్లి పాకిస్తాన్ సైనికుల చెరలో చిక్కిన మత్స్యకార కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఏడు నెలలుగా పైసా చెల్లించలేదు. అయితే వారు ఒకటో తేదీన స్పందనలో విన్నవించుకుంటే.. పాకిస్తాన్ చెరలో ఉన్నవారిని విడిపించేందుకు కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాశారు. అంతేకాకుండా వారి కుటుంబాల జీవనోపాధికి ఏడు నెలల పింఛను మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శ్రీకాకుళం మండలం ఇప్పిలి గ్రామానికి చెందిన దివ్యాంగుడు జోగిపాటి వెంకటరమణ తనను ఆదుకోమని గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు విన్నవించుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. ఈ నెల 1వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో మళ్లీ దరఖాస్తు చేశాడు. వారం తిరక్కుండానే కలెక్టర్ స్వయంగా ట్రైసైకిల్ అందజేశారు. ఇది కలా నిజమా అని ఆయన ఆశ్చర్యపోయాడు. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన దివ్యాంగుడు పంచాది గౌరిది అదే పరిస్థితి. దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే వీల్ చెయిర్ అందించారు. ఇలా జిల్లా అంతటా దిగ్యాంగులకు పెద్ద ఎత్తున ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. స్పందన ప్రారంభించాక గడచిన మూడు వారాల్లో అర్జీదారులను ఆశ్చర్య ఆనందాల్లో ముంచెత్తిన ఇలాంటి సంఘటనలెన్నో.. సాక్షి, శ్రీకాకుళం: ‘ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమానికి స్పందన అని పేరు పెట్టండి. బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను నవ్వుతూ పలకరించండి. వారి అర్జీలను పరిశీలించి ఎన్నాళ్లలో పరిష్కరిస్తారో పేర్కొంటూ రశీదు ఇవ్వండి. బాధితుల సమస్య తీర్చేందుకు వెంటనే రంగంలోకి దిగండి..’ ఇదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట. ఆ తర్వాత మూడు వారాలు స్పందన కార్యక్రమం జరిగింది. కొద్ది రోజుల్లోనే అధికారుల స్పందనలో వచ్చిన మార్పును ప్రజలు గమనించారు. మంచి రోజులు వచ్చాయని ఆనందపడుతున్నారు. ప్రతి వారం జిల్లా గ్రీవెన్సుకు వందల్లో వచ్చే వినతులు ప్రస్తుతం వేల సంఖ్యకు చేరుకున్నాయి. తక్షణం చాలా ఫిర్యాదులు పరిష్కరిస్తుండడంతో ప్రజలు దీర్ఘకాలికంగా ఉన్న బాధలను, గతంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా చిక్కు వీడని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. జిల్లాస్థాయిలోనే కాక డివిజన్, మండల స్థాయుల్లో.. అన్ని విభాగాల కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు 5,223 పరిష్కరించినవి 3,224 పరిష్కారం కానివి 1999 అందులో గడువు దాటినవి 399 ఇంకా సమయమున్నవి 1600 మూడు వారాల్లో 61.73 శాతం అర్జీల పరిష్కారం ఈ కార్యక్రమం ఈనెల ఒకటో తేదీ సోమవారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటి వరకు ఒకటి, 8, 15 తేదీల్లో మూడుసార్లు జరిగింది. జిల్లా అధికారులు వినతులు తీసుకొని కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తుండడంతో తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెల్లింది. ప్రతివారం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని సమస్యలు అక్కడే అధికారులను పిలిచి పరిష్కరిస్తున్నారు. మరికొన్ని సమస్యలు ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతున్నాయి. ఇంతవరకు 5,223 వినతులు రాగా అందులో 3,224 వినతులపై అధికారులు ఇప్పటికే స్పందించారు. అంటే వెంటవెంటనే 61.73 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. గతంలో అధికారుల స్పందన అంతంతమాత్రంగా ఉండేది. వినతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉండేవి. సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త ఆలోచనలో పాత విధానానికి స్వస్తి పలికారు. ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది పరుగులు తీస్తున్నారు. పౌర సరఫరాల విభాగానికి అత్యధికంగా 1211 వినతులు స్పందనలో ఇటీవల జరిగిన మూడు కార్యక్రమాల్లోనూ అత్యధికంగా పౌర సరఫరాల విభాగానికి ఎక్కువగా 1211 వినతులు వచ్చాయి. తెలుపురంగు కార్డులు కావాలని ఎక్కువమంది వినతులు అందజేశారు. వీటిలో ఇప్పటికే 872 వినతులు పరిష్కరించారు. -
బుచ్చి సీఐ ఓవర్‌యాక్షన్
నెల్లూరు , కావలి: దగదర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం బుచ్చిరెడ్డిపాలెం సీఐ టి.వి.సుబ్బారావుయాదవ్ ఓవర్ యాక్షన్ చేశారు. విమానాశ్రయ భూములు, ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు ఉన్న మండలం కావడంతో అధికార టీడీపీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్నారు. అధికారపార్టీకి నియోజకవర్గ స్థాయి నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర, దగదర్తి మండలస్థాయి నాయకులైన మాలేపాటి సుబ్బానాయుడు, రవీంద్రనాయుడులపై మండలంలోని బాధితులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. సాక్షాత్తూ దగదర్తి మండల రెవెన్యూ అధికారులే బాధితులను టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి రాజీచేసుకోవాలని చెబుతుంటారు. బీద సోదరుల వేధింపులతో విసిగి వేసారిపోయిన బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమకు న్యాయం చేయమని అడగడమే మానుకున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దృష్టికి పలు అంశాలు రావడంతో సోమవారం దగదర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే గ్రీవెన్స్‌డేలో భూ బాధితులు తరలిరావాలని రెండు రోజుల క్రితం పిలుపునిచ్చారు. దీంతో తమకు ఎమ్మెల్యే అండగా ఉంటారనే ఆశతో బాధితులు పెద్దసంఖ్యలో సోమవారం తహసీల్దార్ కార్యాయానికి చేరుకున్నారు. అయితే తమ భూ భాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని భావించిన బీద సోదరులు, మాలేపాటి సోదరులు బాధితులకు ఆశలు చూపి మండలంలోని కొందరిని తహసీల్దార్ కార్యాలయానికి చేర్చారు. అలాగే తమ సొంత మనిషి అయిన బుచ్చిరెడ్డిపాలెం సీఐ టి.వి.సుబ్బారావుయాదవ్తోపాటు మరో ఇద్దరు ఎస్ఐలను, పోలీసులను కూడా తమకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉండేలా అక్కడికి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. కాగా రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి హోదాలో మాలేపాటి రవీంద్రనాయుడు గ్రీవెన్స్‌డేలో అధికారుల వద్ద కూర్చున్నారు. కార్యాలయం బయట తాము తెచ్చుకొన్న మనుషులతో మాలేపాటి సుబ్బానాయుడు హడావుడి చేయసాగాడు. ఈ క్రమంలో బుచ్చి సీఐ గ్రీవెన్స్‌డేకు ఎంపీటీసీ సభ్యులను కూడా పోనివ్వనని మొండికేశాడు. టీడీపీకి చెందిన ఎంపీపీ, రవీంద్రనాయుడులను లోపలికి పంపడంతో సీఐను ఎమ్మెల్యే ఈ విషయంపై ప్రశ్నించారు. సీఐ తాను పంపేది లేదని తెగేసి చెప్పారు. స్థానికులు ఎంపీటీసీని కూడా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లనివ్వకపోతే ఎలా అంటూ సీఐని నిలదీశారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఎంపీటీసీలను లోపలికి పంపాలని చెప్పడంతో సీఐ అప్పుడు అంగీకరించారు. అర్జీదారులను అడ్డుకున్న సీఐ అర్జీదారులను సీఐ తహసీల్దార్ కార్యాలయంలోకి పంపకుండా నిలిపేశారు. గ్రీవెన్స్‌డే అర్జీదారుల కోసమైతే వారిని లోపలికి పంపకపోతే ఎలా అని సీఐని ప్రశ్నించడంతో సీఐకు చిర్రెత్తుకొచ్చింది. క్యూలో నిలబడితేనే ఒక్కక్కరినే లోపలికి పంపుతానని అన్నారు. అర్జీ ఇచ్చి వెళతామని అర్జీదారులు చెప్పినా సీఐ వారిపై కస్సుమన్నాడు. ఇక చేసేది లేక ఎర్రటి ఎండలో కార్యాలయం బయట నిలబడి అర్జీదారులు ఉసూరుమంటూ తమ అర్జీలను లోపల ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా బుచ్చి సీఐ అర్జీదారులను సతాయించడం ద్వారా టీడీపీ నాయకులను సంతోషపెట్టారని çపలువురు వ్యాఖ్యానించారు. -
సీఎం చెప్తే.. వినాలా..!
-
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణి (గ్రీవెన్స్‌డే)కి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే)లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... కారేపల్లి మండలం ఉసిరికాయపల్లి గ్రామానికి చెం దిన అలివేలు మంగతాయారు తనకు గ్రామ సర్వే నం బర్ 104/2లో 4 ఎకరాల 13 గుంటల భూమి ఉందని, తనకు భూమికి సంబంధించిన పాస్ పుస్తకం కూడా ఉందని, ఇటీవల పహాణీలో గుగులోతు ద్వాలీ, గుగులోతు బాలాజీ పేర్లతో అధికారులు భూమిని ఎక్కించారని, తనకు న్యాయం చేసి, అక్రమంగా పేర్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని, వర్షాకాలం సమయంలో రోడ్లన్నీ బురదమయంగా మారి నడిచే పరిస్థితి కూడా లేకపోయిందని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తమ భూముల్లో బోర్లు వేయించుకున్నా ఉపయోగం లేకుండాపోతోందని, శాస్త్రీయంగా భూగర్భజలాలు సర్వే చేయించి ప్రభుత్వ పథకాల్లో బోర్లు మం జూరు చేయాలని వేంసూరు జెడ్పీటీసీ బాషా, ఎర్రగుంట పాడు గ్రామస్తులు జక్కా బ్రహ్మ య్య, చిలకా వసంతం, కృష్ణయ్య, వాసం వెంకటేశ్వరరావు, మంగయ్య, యాకూబ్ విన్నవించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, దీంతోపాటు రెట్టిం పు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నా అమలు చేయడం లేదని, దానిని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పీడీఎస్యు నాయకులు సునీల్‌కుమార్, ఆజాద్, వెంకటేష్, సౌందర్య, శిరీష వినతిపత్రం సమర్పించారు. తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, ముజాహిద్‌పురం, సుద్దవాగుతండా, కాకరవాయి తది తర గ్రామాల సమీపంలో ఉన్న పాలే రు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ తహసీల్దార్ కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు రవి, వెంకటరెడ్డి, రమేష్, మోహన్ విన్నవించారు. ఖమ్మంలో ఐటీడీఏని ఏర్పాటుచేయాల ని ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు భద్రూనాయక్, నగేష్, రమేష్, వెంకన్న విన్నవించారు. -
‘ఉపాధి హామీ’లో అక్రమాలు
ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి గ్రీవెన్స్‌లో గ్రామస్తుల ఫిర్యాదు సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలిగించి, మాసం రోజుల్లోనే మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై గ్రామస్తులు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావిజ్ఞాప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరి నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్వో దయానంద్ ,ఇతర జిల్లా శాఖల అధికారులు వినతులు స్వీకరించారు. పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకయ్య రూ. 12 లక్షల మేరకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సామాజిక తనిఖీలో నిరూపణ కావడమే కాకుండా, అసభ్యంగా ప్రవరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో గత నెల 13వ తేదీన విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, తిరిగి విధుల్లోకి తీసుకోడంపై సమగ్ర విచారణ చేపట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. జిన్నారం మండలం మాదారం గ్రామం నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ రోడ్డును నాణ్యాత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేలా వీఎన్ఆర్ నిర్మాణ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్పంచ్ సురేందర్‌గౌడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు, కల్వర్టు నిర్మాణంలో నాసిరకం డస్టును వినియోగిస్తున్నారని ఆరోపించారు. హత్నూర మండలం పాల్పనూర్ పెద్దచెరువులో మిషన్ కాకతీయ పనులను నాసిరకంగా చేపట్టారని, పాత అలుగులకు కొత్త సొగసులు అద్దారని, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలతో పాటు శిఖం భూమి విస్తీర్ణం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నాగేష్ కోరారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇందిర జల ప్రభ పథకం కింద బోరు వేసిన అధికారులు మోటారు, ట్రాన్స్ఫార్మర్ బిగించే విషయంలో కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని టేక్మాల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన రామావత్ సర్వన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనన ధ్రువీకరణ పత్రం కోసం గతేడాది సెప్టెంబర్ 29న మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే నేటికీ అందలేదని నారాయణఖేడ్ మండలం మాద్వార్ తాండకు చెందిన రవీందర్ నాయక్ ఫిర్యాదు చేశారు. విధుల నుంచి తొలగించిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సంగారెడ్డి మండలం చిద్రుప్పకు చెందిన లాల్‌సింగ్ కోరారు. పశువులపాక కాలి ఐదు ఆవులు మృతి చెందగా, మరో తొమ్మిది ఆవులు తీవ్రంగా గాయపడినందున తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నారాయఖేడ్ మండలం పిప్రితాండకు చెందిన రాంసింగ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కయి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఉపసర్పంచ్ సాయిలు వార్డు సభ్యులు లావణ్య ,పద్మ,సంగీత, యాదగిరి ఫిర్యాదు చేశారు. -
మా బాధలు తీర్చండయ్యా..
పోలీసు అధికారులకు పలువురి వేడుకోలు గ్రీవెన్స్‌డేలో అర్జీల సమర్పణ నెల్లూరు(క్రైమ్): రకరకాల సమస్యలతో బాధలు పడుతున్నాం. మీరైనా స్పందించి న్యాయం చేయండి..అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు తమ గోడును పోలీసు అధికారులకు చెప్పుకున్నారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నెల్లూరు సిటీ, రూరల్ డీఎస్పీలు జి.వెంకటరాముడు, డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డికి అర్జీలు సమర్పించారు. హింసించి ఇంట్లో నుంచి గెంటేశారు: డి.అఖిల, ఎన్జీవో కాలనీ, నెల్లూరు నాకు 2013లో ప్రకాశం జిల్లా పొదిలి మండలం వేలూరుకు చెందిన డి.వెంకటప్రసాద్‌తో పెళ్లయింది. కొద్ది రోజులు మా కాపురం బాగానే ఉంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త శేషమ్మ వేధించడం ప్రారంభించారు. 2014 జూలైలో బాబు పుట్టిన తర్వాత పుట్టింటి వారు ఇచ్చిన నగలను అమ్ముకున్నారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తెస్తేనే ఇంటికి రావాలని, లేకుంటే కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్త చిత్రహింసలు పెట్టింది. చివరకు గత ఏడాది డిసెంబర్ 25న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. విచారించి నాకు న్యాయం చేయండి. చీటీల వ్యాపారి మోసగించాడు: ఎ.జగదీష్, సునీల్‌రెడ్డి, మనుబోలు మేము ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. సంపాదించిన దాంట్లో కొంత నగదు కూడబెట్టుకొని మనుబోలు కోదండరామపురానికి చెందిన మల్లికార్జునరెడ్డి వద్ద చీటీలు వేశాము. మాతో పాటు అనేకమంది అతని వద్ద రూ. 80లక్షల వరకు చీటీలు వేశారు. చీటిలు పాడుకోగా మాకు రావాల్సిన నగదు ఇవ్వకుండా రేపు, మాపూ అంటు కాలయాపనచేస్తూ కొంతకాలం కిందట ఉడాయించాడు. అప్పటి నుంచి అతని ఆచూకీS తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్ఐ నాగరాజు నిందితుడ్ని పిలిపించి రాత్రికి రాత్రే వదలివేశాడు. ఉన్నతాధికారులు స్పందించి మాకు డబ్బులు ఇప్పించండి. చెట్లను కొట్టేశారు యరగల కృష్ణమూర్తి, నాగమాంబపురం, బుచ్చిరెడ్డిపాలెం నేను దివ్యాంగుడిని. నాకు నాగమాంబపూరంలో 0.99సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో వేప, తాటి చెట్లతో కూడిన కరగాడ ఉంది. ఆ భూమిని ఆనుకొని ఉత్తరం వైపు 6.52 సెంట్ల స్మశానం ఉంది. మా గ్రామానికి చెందిన రాఘవరెడ్డి శ్మశానానికి ప్రహరీ కట్టించడం కోసమని కరగాడలోని చెట్లను కొట్టేశారు. ఈవిషయమై కోర్టులో దావా వేయగా విచారణ జరుగుతోంది. నా చెట్లను కొట్టివేసిన నిందితునిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రహరీని శ్మశాన భూమిలోని కట్టేలా చర్యలు తీసుకోండి. కారుణ్య మరణానికి అనుమతించండి పులీంద్ర మరియమ్మ, దగదర్తి నేను, నా భర్త చిన్నయ్య ఇద్దరం షుగర్ వ్యాధితో బాధపడుతున్నాం. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకూ దెబ్బతింటోంది. ఆయనను ఆస్పత్రిలో చూపించేందు కోసం మా ఆధీనంలో ఉన్న భూమిని అమ్ముకోవాలని అనుకుంటే నా భర్త అన్న అయిన రమణయ్య కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. మా పై దౌర్జన్యం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి..లేదంటే కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండి. -
కలెక్టర్‌కు వినతుల వెల్లువ
సమస్యలను పరిష్కరించాలని వినతి నెల్లూరు(పొగతోట): సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ముత్యాలరాజుకు జిల్లా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయనకు అర్జీలు సమర్పించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన కోరారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కలెక్టర్‌తో పాటు జేసీ ఎ.మహమ్మద్ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, ఇన్చార్జి డీఆర్వో మార్కండేయులు అర్జీలు స్వీకరించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి: బీజేపీ నేతలు జిల్లాలో ప్రస్తుత సీజన్లో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రెండో పంట సాగు కోసం రైతులు పెట్టుబడి బాగా పెట్టారు. పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. పుట్టి రూ.10,500కి కొనుగోలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి ధాన్యం భారీగా వస్తుంది. మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి. దారిని ఆక్రమించారు యు.అనూరాధ, చీకవోలు, సైదాపురం నా భర్త, తల్లిదండ్రులు మరణించారు. కుమారుడితో కలిసి పక్కా ఇంట్లో నివాసం ఉంటూ పుట్టింటి ద్వారా సంక్రమించిన నిమ్మతోట సాగు చేసుకుంటున్నాను. రోడ్లోకి పోయే బాటను ఊళ్లో వాళ్లు ఆక్రమించి పేడదిబ్బలు, రాళ్లు వేశారు. సర్వేయర్ వచ్చి హద్దు రాళ్లు నాటినా వాటిని పోస్తూనే ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్నారు. ఉన్నతాధికారులే న్యాయం చేయాలి. బెల్టుషాపులు తొలగించండి: పెరుమాళ్లపాడు మహిళలు మా ఊళ్లో పంచాయతీ ఆఫీసుతో పాటు బడికి, గుడికి పక్కనే బెల్టుషాపులు ఉన్నాయి. మందు తాగిన వారు మాతో పాటు చిన్నపిల్లలతో అసభ్యంగా ప్రవరిస్తున్నారు. ఊళ్లో గొడవలకు దిగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బెల్టుషాపులు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి: ప్యాసింజర్స్ అసోసియేషన్ నాయకులు కావలిలోని పెద్దపవని రోడ్డులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి సమస్య పరిష్కరించాలి. దివ్యాంగుల పోస్టులు భర్తీ చేయాలి: వీహెచ్పీఎస్ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులందరికీ రూ.1,500 పింఛన్ ఇవ్వాలి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. దివ్యాంగులందరికీ స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు కట్టించాలి. నిర్వాసితులకు న్యాయం చేయాలి: రాజులపాడు వాసులు రాజులపాడులో కడుతున్న రిజర్వాయర్‌తో 250 ఇళ్లు, ఆరువందల ఎకరాల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించారు. వెంటనే పరిహారం అందజేయాలి. పొలాలకు బదులుగా పొలాలే కేటాయించాలి. భూములిచ్చిన వారికి ఉపాధి చూపాలి. -
ఇండ్ల కోసం బారులు
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పోటెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బారులుతీరారు. కొందరు మహిళలు చంటిపిల్లలతో వచ్చారు. జనం పెద్ద ఎత్తున రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. కలెక్టర్ కరుణ దరఖాస్తుదారులతో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. - హన్మకొండ అర్బన్ హన్మకొండ అర్బన్: పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు కుప్పలుగా వచ్చా యి. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 3500కుపైగా దరఖాస్తు లు అందాయి. వీటిలో అధిక మొత్తం ఇండ్లు, ఇంటి స్థలాల కోసం చేసుకున్నవే కావడం విశేషం. అయితే ఒక్కసారే వూహించని విధం గా గ్రీవెన్స్‌సెల్‌కు జనం పోటెత్తడంతో అధికారులు కొంత హైరానా పడ్డారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో కొద్దిపాటి తోపులాట జరిగింది. చివరకు పోలీసుల సహకారంతో మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జనం ఉదయం 9గంటల నుంచే కలెక్టరేట్లో దరఖాస్తులు చేసుకునేందు కు క్యూలో ఉన్నారు. చిన్నపిల్లలతో వచ్చినవారు పిల్లలకునీరు, ఆహారం విషయంలో ఇ బ్బందులు పడ్డారు. అయినా సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండి దరఖాస్తులు అధికారులకు ఇచ్చిన తరువాతే వెళ్లారు. దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన వారు తెల్లకాగితాలు, నమూనా దరఖాస్తులు కొనుగోళ్లతో కలెక్టరేట్ సమీపంలోని స్టేషనరీ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. జనం తాకిడితో కలెక్టరేట్ ఎదుట ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. దరఖాస్తుకు రూ.50 దరఖాస్తులు అప్పటికప్పుడు నమూనా తయా రు చేసి వాటిపై లబ్దిదారుల ఫొటోలు పెట్టి ఖాళీలు నింపి ఇచ్చినందుకు దుకాణాదారులు ఒక్కొక్కరి నుంచి రూ.50నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. దరఖాస్తులు చే సుకునేందుకు వచ్చినవారిలో చాలా మంది నిరక్ష్యరాస్యులు కావడంతో అడిగినంత ఇచ్చి దర ఖాస్తులు రాయించుకున్నారు. తూర్పునుంచి అధికం ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తు ల్లో 90శాతం వరకు వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని వారివే. కొన్ని డివిజన్లలో స్థానిక నాయకులు దరఖాస్తులు చేయమని పంపించి నట్లు కొందరు దరఖాస్తుదారులు వెల్లడించారు. వేల సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి తెలసుకున్న కలెక్టర్ వాకాటి కరుణ నేరుగా జనంవద్దకు వచ్చి ఆరా తీశారు. దరఖాస్తు రశీదులు ఇంటికే పంపిస్తాం : కలెక్టర్ కలెక్టరేట్లో సోమవారం ఇండ్లు, ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులకు సంబంధించిన రసీదులను దరఖాస్తుదారులు అందజేసిన చిరునామాకు అధికారులు పంపిస్తారని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన లబ్దిదారులను అధికారులు ఎంపిక చేస్తారని, కొందరు మద్యవర్తుల మాటలు నమ్మి కార్యాలయా ల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని కోరారు. దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పుడు చేసుకుంటే వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నా రు. కలెక్టరేట్‌కు కాకుండా స్థానికంగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేస్తే వారు పరిశీలించి పంపుతారని, ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఐటీడీఏ ముట్టడి
అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన హాస్టల్ కార్మికుల సమ్మెనోటీసు గిరిజన మత్స్యకారుల ధర్నా పాడేరు: ధర్నా, ఆందోళనలతో ఐటీడీఏ కార్యాలయం శుక్రవారం దద్ధరిల్లిపోయింది. గ్రీవెన్స్‌డే కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. బోట్లు, వలలు పంపిణీ చేయాలంటూ గిరిజన మత్స్యకారులు ధర్నా జరిపారు. ఏజెన్సీలోని 11 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐటీడీఏను ముట్టడించారు. పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, పదవీ విరమణ భత్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వీరాకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే జీతాలు పెరుగుతాయని భావిస్తే గతేడాది కంటే బడ్జెట్‌ను బాగా తగ్గించేశారన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్యకర్తలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు లేవన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు పింఛన్‌తోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, జీతం రూ.15 వేలకు పెంచాలని, అంగన్వాడీ వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు నాగశేషు, డివిజన్ నాయకులు భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, అంబలమ్మ, కృష్ణవేణి, నాగలక్ష్మి, సీఐటీయూ నాయకులు శంకరరావు, ఉమా మహేశ్వరరావు, సుందరరావు పాల్గొన్నారు. సమ్మె బాటలో హాస్టల్ వ ర్కర్లు: దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరించకుంటే సమ్మె చేపడతామంటూ హాస్టల్ కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం ఐటీడీఏ పీవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన వర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు సమ్మె నోటీసు అందజేశారు. వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. 9 నెలలుగా డైలీవైజ్ వర్కర్లకు, 13 నెలలుగా క్యాజువల్ కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించ లేదని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదని, కలెక్టర్ గెజిట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇకపై అధికారులతో రాజీపడేది లేదని, సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీసీహెచ్ పడాల్, సుందరరావు, హాస్టల్ కార్మిక సంఘ నాయకులు రామారావు, బాలన్న, రాజారావు, శెట్టి గాశీ, చిన్నయ్య, లంకా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వలలు, బోట్లు పంపిణీ చేయాలి తమ జీవనోపాధి కోసం బోట్లు, వలలు పంపిణీ చేయాలని ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల గిరిజనులు శుక్రవారం ఐటీడీఏకు ప్రదర్శనగా వచ్చి ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు పాండురంగస్వామి, కె.సురేష్‌తో కలిసి ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. హుద్‌హుద్ ధాటికి బోట్లు, వలలు ధ్వంసమయ్యాయని, తమకు ఆర్థిక సహాయం అందించాలని, జీవనోపాధిని కొనసాగించేందుకు వలలు, బోట్లు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పనసపుట్టు సర్పంచ్ జె.మాలియ, జోలాపుట్టు ఎంపీటీసీ రామచందర్, పలు గ్రామాల గిరిజనులు సుందరరావు, నీలాంబరం, మంగు, రాందాస్, జైరాం, రాంబాబు పాల్గొన్నారు. -
అవిటివాడిని.. ఆదుకోండి
సంగారెడ్డి అర్బన్ : ‘బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడ కాలు విరిగిం ది. వడ్డెర వృత్తిలో భాగంగా రాళ్లు కొడుతున్న క్రమంలో ఓ కన్ను పోయింది. అవిటివాడినైన నన్ను ఆదుకోండి’ అని గ్రీవెన్స్‌డేలో సోమవారం కొల్చారం మండల కేంద్రానికి చెందిన హనుమంతు జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు ఫిర్యాదులను అందజేశారు. ⇒ వికలాంగుల కోటా కింద రెండేళ్ల క్రితం డీలర్ షిప్ మంజూరైన తహశీల్దార్ అనుమతి ఇవ్వడం లేదని అందోల్ మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ జేసీకి ఫిర్యాదు చేశాడు. ⇒ మినీ డెయిరీ కోసం బీసీ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకున్నా.. ఎన్నికల కోడ్ పేరుతో పెండింగ్ పెట్టారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన సాయిమాల కోరారు. ⇒ సంగారెడ్డి పట్టణంలోని 2-6-126 ఇంటి నంబర్ గల ఆస్తి పన్ను రికార్డును మార్పులు చేశారని, ఈ విషయమై మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వాలని కోరగా నిరాకరిస్తున్నారని, పూర్తి వివరాలు అందించాలని పుల్కల్ మండలం చక్రియాల్ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి కోరారు. ⇒ బ్యాంక్ వారు కారె ్పంట్ దుకాణాల కోసం రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న.. ఆరు నెలలుగా వికలాంగ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, వికలాంగుడనైన తనకు అర్హత ఉన్న అధికారులు అడ్డుకుంటున్నారని వెంటనే రుణం మంజూరు చేయాలని కోరారు. ⇒ మనూరు మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వికలాంగుడినైన విఠల్ తాను సంగారెడ్డిలోని ఆంధ్రాబ్యాంక్‌లో ట్రై వెహికిల్ నిమిత్తమై రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా.. మేనేజర్ స్పందించడం లేదని, రుణం మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ⇒ ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందు బోల్ వెల్ మంజూరు చేయాలని మునిపల్లి మండలం కంకోల్ గ్రామస్తులు జేసీని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉడాలో గ్రీవెన్స్ డే
8 రేపటి నుంచే ప్రారంభం సాక్షి, విజయవాడ : అన్ని ప్రభుత్వ విభాగాల మాదిరి గానే వీజీటీఎం ఉడా కూడా ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్యాలయ వేళల్లో రోజూ రెండు గంటలు మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే నిర్వహించాలని అన్ని విభాగాల అధికారులను ఉడా వీసీ ఉషాకుమారి నిర్ణయించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని విభాగాల ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. గ్రీవెన్స్ డేలో నిర్వహించే ప్రతి ఫిర్యాదుకు రశీదు ఇస్తారు. ప్రతి సమస్యను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తారు. -
డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌డే
- ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు - ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ - నేటినుంచి అమలు కలెక్టరేట్/చిలుకూరు : డివిజన్, మండల స్థాయిలోనూ సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ సమక్షంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు దీనిని చేపడతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితం జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే గ్రీవెన్స్‌డే నిర్వహించేవారు. అక్కడికి వచ్చిన వినతులను తిరిగి మండల స్థాయి అధికారులకు విచారణ కోసం పంపించేవారు. కాగా ప్రతి వారం బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసాలు పడాల్సివస్తోంది. అదీగాక ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తుండడంతో అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ నూతనంగా డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు హాజరు తప్పని సరి ఇక ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు డివిజన్, మండల స్థాయి అధికారులందరూ హాజరవుతారు. అక్కడ బాధితుల నుంచి వినతులు స్వీకరించి రశీదులు కూడా ఇస్తారు. ప్రతి వారం వచ్చిన సమస్యలను ఓ ప్రత్యేకమైన రికార్డులో నమోదు చేస్తారు. సాధ్యమైనంత వరకు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. ఇక్కడ పరిష్కారం కానివాటిని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తారు. ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ప్రజావాణి వెబ్సైట్లో నమోదు చేస్తారు. పర్యవేక్షణ ఇలా.. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం అధికారులను నియమించారు. దేవరకొండ, నల్లగొండ, భువనగిరి రెవెన్యూ డివిజన్లలో వైద్య ఆరోగ్యం, డ్వామా, ట్రాన్స్‌కో, ఐబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విభాగాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. జిల్లా పరిషత్, సూర్యాపేట, మిర్యాలగూడ డివిజన్లలో సాంఘిక సంక్షేమం, మైనార్టీ, ఆర్వీఎం, డీఆర్డీఏ, ఆడిట్ విభాగాలను ఏజేసీ, అదే విధంగా జిల్లా విద్యాశాఖ, మాడా, ఆర్అండ్బీ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, జిల్లా పంచాయతీ విభాగాలను జెడ్పీ సీఈఓ పర్యవేక్షిస్తారు. అలాగే ఐసీడీఎస్, పశుసంవర్ధక, వికలాంగుల సంక్షేమం, జిల్లా పరిశ్రమలు, ఏఎంఆర్ పులిచింతల, జిల్లా ప్రణాళికా విభాగాలను వ్యవసాయశాఖ జేడీ పర్యవేక్షిస్తారు. ఉద్యానవనశాఖ, ఏపీఎంఐపీ, పట్టు పరిశ్రమ, ఆత్మ, కార్మిక శాఖ, భూగర్భజలశాఖ, సహకార శాఖలు ముఖ్య ప్రణాళిక అధికారి పర్యవేక్షిస్తారు. మార్కెటింగ్, మున్సిపాలిటీలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తారు. అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ ప్రతి సోమవారం డివిజన్, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఆదివారం కోరారు. మండలస్థాయిలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, తాగునీరు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, ఏఓలు పాల్గొనాలని ఆదేశించారు. అదే విధంగా డివిజన్‌స్థాయిలో ఆర్డీఓలు డివిజన్ అధికారులను భాగస్వాములను చేసి గ్రీవెన్స్‌డే నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం ఉన్నతాధికారులను శాఖలవారీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై చేపట్టిన చర్యలను ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. -
మొదటి సోమవారం.. గ్రీవెన్స్ డే
తొలి ఫైలుపై సంతకం చేసిన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రతి నెల మొదటి సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. ఆదివారం ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ నెల 16నుంచి 30వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెండింగ్ పనులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 12నుంచి నెలరోజులపాటు పాఠశాలలు, కళాశాలల బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు, అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రవాణా కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ యం.జగదీశ్వర్, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికీ ‘ప్రగతిచక్రం’ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10,600 గ్రామాలకుగాను ప్రస్తుతం 9,200 గ్రామాలకు బస్సు సౌకర్యం ఉందన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు. కొత్తగా 50వరకు బస్సు డిపోలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి బస్సుల తీరును సమీక్షించి ప్రమాధాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్టాండ్ల పరిధుల్లోని ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసి అభివృద్ధితోపాటు అదాయాన్ని పెంచుతామన్నారు. వారంలోగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరులో గ్రీవెన్స్‌డే రద్దు
చిత్తూరులో గ్రీవెన్స్‌డే రద్దు తిరుపతి, మదనపల్లెలోనూ స్తంభించిన పాలన ఈ-సేవల్లో నిలిచిన కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు నిరసనగా ఎన్జీవోల సమ్మె కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పాలనా వ్యవహారాలు సోమవారమూ స్తంభించాయి. చిత్తూరులోని కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రతి సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌డే రద్దయింది. ఉద్యోగుల సమ్మె కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రీవెన్సడే రద్దయిన విషయం తెలియకుండా జనం కలెక్టరేట్‌కు వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోల ఆందోళన కొనసాగు తోంది. కలెక్టరేట్లో తెరచి ఉన్న ఒకటి రెండు ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవో నాయకులు మూయిం చారు. డ్వామా కార్యాలయం ముందు ఎన్జీవో అసోసియేషన్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా 66 తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలమనేరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం మూతపడింది. మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేశారు. కుప్పంలోనూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో గ్రీవెన్స్‌డే రద్దు చేశారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ జాయిం ట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఇంటిపన్ను వసూలు, పరిపాలన అనుమతులు, కొళాయి కనెక్షన్లు మంజూరు వంటి పనులు ఆగిపోయాయి. సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. పారిశుద్ధ్య నిర్వహణ వంటి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఎక్కడి పనులు అక్కడే వారం రోజులుగా ఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాణిజ్యపన్నులు, రవాణా, డీఈవో, రెవెన్యూ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో ఎక్కడి ఫైల్స్ అక్కడే నిలిచిపోయాయి. అధికారులు కార్యాలయాలకు వస్తున్నా ఫైల్రాసే ఉద్యోగులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్‌కు వార్షిక వర్క ప్లాన్లు పంపాల్సిన సమయమిదే. అయితే ఈ పనులేమీ జరగడం లేదు. ఈ-సేవ కేంద్రాలు మూతపడ్డాయి. బంగ్లాల నుంచే పాలన.. కలెక్టర్ రాంగోపాల్, జాయింట్ కలెక్టర్ బసంతకుమార్లు బంగ్లాలోని క్యాంపు కార్యాలయం నుంచే పరిపాలన సాగిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తమ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ నుంచి అడిగే సమాచారం పంపి ఇంటి ముఖం పడుతున్నారు. -
ఫ్యాక్టరీని ఏం చేయాలనుకుంటున్నారు
చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీపై కలెక్టర్ ఆగ్రహం =ఫైళ్లపై సంతకాలకు నో చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: ‘అసలు ఈ ఫ్యాక్టరీని ఏం చేయదలచుకున్నారు, ఇలా చేస్తే రైతుల బకాయిలు ఎలా చెల్లిస్తారు, రోజూ మాకు ఇదే పంచాయితీనా అంటూ కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుపై మండిపడినట్లు సమాచారం. సహకార చక్కెర ఫ్యాక్టరీ పర్సన్ ఇన్చార్జి అయిన కలెక్టర్ సంతకాలు అవసరమై కలెక్టరేట్‌కు ఎండీ వెంకటేశ్వరరావు సోమవారం వచ్చారు. గ్రీవెన్స్‌డే ముగిసిన తర్వాత తన కార్యాలయానికి కలెక్టర్ చేరుకున్నారు. ఎండీతో వెళ్లిన పీఏను వెలుపలికి పంపి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పత్రికల్లో కథనాలు వస్తున్నా పట్టించుకోరా, ఇలాగైతే ప్రభుత్వం గ్రాంట్ ఎలా మంజూరు చేస్తుంది, రైతులెలా చెరుకు సరఫరా చేస్తారని మండిపడినట్లు సమాచారం. వీటికి సమాధానాలు చెప్పిన తర్వాతే సంతకాలు చేస్తానన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ‘దీనికి పర్సన్ ఇన్చార్జి కావడంతో రైతుల ముందు నన్ను బాధ్యుడ్ని చేయాలనుకుంటున్నారా, నేను ముందే చెప్పాను డబ్బులుంటేనే నడపండి, లేకుంటే వద్దని అయినా మీరు వినలేదు, ఇప్పుడు రోజూ మీ పంచాయితీనే సరిపోతోందంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్లపై సంతకాలు పెట్టకనే కలెక్టర్ తిప్పి పంపినట్లు తెలిసింది. ఆత్మహత్యలే శరణ్యం బకాయిలు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు కలెక్టర్ రాంగోపాల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం కొందరు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు రెండేళ్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగంలో నడిచే అన్ని ఫ్యాక్టరీలూ ఇదే పరిస్థితిలో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. అయితే తమ బకాయిలు ఇప్పించాల్సిందేనని రైతులు కోరారు. బకాయిలు చెల్లించేసి ఫ్యాక్టరీని మూసేస్తే పర్వాలేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. బకాయిలిచ్చేసిన తర్వాత ఏమన్నా చేసుకోండంటూ రైతులు బదులిచ్చారు. జనరల్‌బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అన్నీ సర్దుకుంటాయని కొందరు రైతులు సూచించారు. దీంతో తప్పక వస్తానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. -
కాలుష్య కోరల్లో పల్లెలు
కొండాపూర్, న్యూస్‌లైన్: పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. రాత్రివేళలో పరిశ్రమలు యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని గుంతపల్లి చౌరస్తాలో రెండు మినీ పరిశ్రమలున్నాయి. రెండు నెలల క్రితం మరో పరిశ్రమ కూడా ప్రారంభమైంది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు రాత్రి వేళలో యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేస్తున్నాయి. పాడైపోయిన వాహనాల టైర్లను అధిక మోతాదులో రాత్రింబవళ్లు కాల్చి అందులోని రసాయనాలను వెలికితీస్తారు. రసాయనాలను ట్యాంకర్లలో హైదరాబాద్‌కు తరలిస్తారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులను సైతం పట్టించుకోవడం లేదు. వారు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా టైర్లను కాల్చగా ఏర్పడిన బుడిద పంటపొలాల్లో చేరడంతో పంటలు సైతం దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గుంతపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, ఎదురుగూడెం గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వాహనదారులు పరిశ్రమలు వదిలే విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల తీరును నిరసిస్తూ గతంలో పరిశ్రమల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. యువజన సంఘాల నాయకులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. గ్రీవెన్స్‌డేలో భాగంగా కలెక్టర్ దృష్టికి విషవాయువుల పరిశ్రమలను మూసివేయాలని ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పరిశ్రమల యాజమాన్యాలను నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలుష్య కోరల నుంచి గ్రామాలను కాపాడాని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నా బాధలు ‘గ్రీవెన్స్‌డే’లో చెప్పుకోమంటారా?
సాక్షి, హైదరాబాద్: నేను మంత్రినన్న విషయాన్ని పక్కనబెడితే కనీసం ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం జరిగిన గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) నోడల్ ఏజెన్సీ సబ్‌ప్లాన్ సమావేశంలో భాగంగా మంత్రి బాలరాజు అధికారుల వ్యవహారశైలిని ప్రశ్నిస్తూనే.. ముఖ్యమంత్రితో నెలకొన్న వివాదం విషయంలో పరోక్షంగా రుసరుసలాడారు. ‘‘గత మే నెలలో నేను, బీసీ మంత్రి కలసి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామానికి వచ్చాం. మా కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా లబ్ధిదారులందరినీ చేరదీసి సెర్ప్ అధికారులు వేరే గ్రామంలో సమావేశం పెట్టారు. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దిక్కులేదు. నా బాధలు గ్రీవెన్స్‌డేలో చెప్పుకొమ్మంటారా’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.