చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీపై కలెక్టర్ ఆగ్రహం
=ఫైళ్లపై సంతకాలకు నో
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: ‘అసలు ఈ ఫ్యాక్టరీని ఏం చేయదలచుకున్నారు, ఇలా చేస్తే రైతుల బకాయిలు ఎలా చెల్లిస్తారు, రోజూ మాకు ఇదే పంచాయితీనా అంటూ కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుపై మండిపడినట్లు సమాచారం. సహకార చక్కెర ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌చార్జి అయిన కలెక్టర్ సంతకాలు అవసరమై కలెక్టరేట్‌కు ఎండీ వెంకటేశ్వరరావు సోమవారం వచ్చారు. గ్రీవెన్స్‌డే ముగిసిన తర్వాత తన కార్యాలయానికి కలెక్టర్ చేరుకున్నారు. ఎండీతో వెళ్లిన పీఏను వెలుపలికి పంపి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పత్రికల్లో కథనాలు వస్తున్నా పట్టించుకోరా, ఇలాగైతే ప్రభుత్వం గ్రాంట్ ఎలా మంజూరు చేస్తుంది, రైతులెలా చెరుకు సరఫరా చేస్తారని మండిపడినట్లు సమాచారం. వీటికి సమాధానాలు చెప్పిన తర్వాతే సంతకాలు చేస్తానన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ‘దీనికి పర్సన్ ఇన్‌చార్జి కావడంతో రైతుల ముందు నన్ను బాధ్యుడ్ని చేయాలనుకుంటున్నారా, నేను ముందే చెప్పాను డబ్బులుంటేనే నడపండి, లేకుంటే వద్దని అయినా మీరు వినలేదు, ఇప్పుడు రోజూ మీ పంచాయితీనే సరిపోతోందంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్లపై సంతకాలు పెట్టకనే కలెక్టర్ తిప్పి పంపినట్లు తెలిసింది.
ఆత్మహత్యలే శరణ్యం
బకాయిలు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు కలెక్టర్ రాంగోపాల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం కొందరు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు రెండేళ్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగంలో నడిచే అన్ని ఫ్యాక్టరీలూ ఇదే పరిస్థితిలో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. అయితే తమ బకాయిలు ఇప్పించాల్సిందేనని రైతులు కోరారు. బకాయిలు చెల్లించేసి ఫ్యాక్టరీని మూసేస్తే పర్వాలేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. బకాయిలిచ్చేసిన తర్వాత ఏమన్నా చేసుకోండంటూ రైతులు బదులిచ్చారు. జనరల్‌బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అన్నీ సర్దుకుంటాయని కొందరు రైతులు సూచించారు. దీంతో తప్పక వస్తానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఫ్యాక్టరీని ఏం చేయాలనుకుంటున్నారు
Published Tue, Dec 17 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement
Advertisement